ఏకంగా 111 మంది ... ...ఫిరాయింపుల్లో సరికొత్త రికార్డు !
ఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి జంప్ చేయడం చాలా కాలంగా ఒక ఆచారంగా మారింది.
By: Satya P | 26 Sept 2026 8:57 AM ISTఒక పార్టీ తరఫున గెలిచి మరో పార్టీలోకి జంప్ చేయడం చాలా కాలంగా ఒక ఆచారంగా మారింది. ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి నాలుగు దశాబ్దాలు అవుతున్నా ఫిరాయింపులు మాత్రం ఆగడం లేదు, ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా బాధితులు అవుతూంటారు, వారే అధికారంలో ఉంటే అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. అందుకే ఫిరాయింపు చట్టాన్ని మరింత సమగ్రంగా కట్టుదిట్టంగా సవరించాలన్న ఆలోచనలు ముందుకు కదలడం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే దేశంలో నాలుగేళ్ల కాలంలో ఏకంగా 111 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు పార్టీలు మారి సరికొత్త రికార్డు సృష్టించారు అని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) రిపోర్ట్ సంచలన విషయాలను వెల్లడించింది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని కూడా లేదు, అవకాశ వాద రాజకీయాలకు ఏ మాత్రం సందు దొరికినా జంప్ చేసేసే వారి జాబితా అధికంగా ఉందని ఏడీఆర్ రిపోర్ట్ తేల్చేసింది.
కండువాలు మార్చేస్తూ :
ఇక దేశంలో జాతీయ స్థాయి నుంచి ప్రాంతీయ స్థాయి వరకూ చూస్తే వివిధ రాష్ట్రాలలో 2022-2026 మధ్య కాలం అంటే నాలుగేళ్లలో ఒక పార్టీ తరఫున పార్లమెంట్ లేదా అసెంబ్లీలకు ప్రజా తీర్పుతో విజయం సాధించిన 111 మంది ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ తరువాత తమ రాజకీయ అనుకూలతను చూసుకుని పార్టీలు ఫిరాయించాయని ఏడీఆర్ నివేదిక తేటతెల్లం చేస్తోంది. ఈశాన్య రాష్టం అయిన నాగాలాండ్ తో మొదలెడితే పశ్చిమ బెంగాల్ లో ఎక్కువగా ఈ ఫిరాయింపులు ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. ఇందులో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు 78 మంది ఎమ్మెల్యేలు ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీలోకి మారిన వారి జాబితలో ఉన్నారని నివేదిక చెబుతోంది.
నాగాలాండ్ దే ర్యాంక్ :
ఇక ఈ ఫిరాయింపులలో అత్యధిక వాటా నాగాలాండ్ దే అని ఏడీఅర్ రిపోర్టు చెబుతోంది. ఇక్కడ ఫిరాయింపులు చేసిన ప్రజా ప్రతినిధులు ఏకంగా 32 మంది దాకా ఉన్నారు. ఈ రాష్ట్రంలో అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ నాగా పీపుల్స్ ఫ్రంట్ మధ్య ఢీ అంటే ఢీ అన్నట్లుగా రాజకీయం ఉంది. ఈ క్రమంలో జరిగిన రాజకీయ సమీకరణాలు ఎత్తులు వ్యూహాలలో భాగంగా ఈ భారీ ఫిరాయింపులు చోటుచేసుకున్నాయని చెబుతున్నారు. ఇక ఈ రాష్ట్రంలో ఎక్కువగా ఫిరాయింపులను ప్రోత్సహించిన పార్టీగా నాగా పీపుల్స్ ఫ్రంట్ రికార్డ్ క్రియేట్ చేయడం విశేషం.
బెంగాల్ లో సైతం :
ఇక పశ్చిమ బెంగాల్ కూడా ఫిరాయింపుల విషయంలో ఏమీ తీసిపోలేదని అంటున్నారు. ఇక్కడ 20 మంది లోక్‌సభ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ నుంచి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలోకి ఒక్కసారిగా చేరిపోయారు. ఇది ఈ మధ్యనే జరిగింది. వీరంతా లోక్ సభ స్పీకర్ కి వినతి చేసుకుని మరీ వేరేగా తమ గ్రూప్ ని గుర్తించాలని కోరారు. ఇక దక్షిణాదిన చూస్తే ఫిరాయింపులకు తెలంగాణ కేంద్ర బిందువుగా నిలిచింది అంటున్నారు. ఇక్కడ బీఆర్ఎస్‌లో గెలిచిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అలాగే గోవాలో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి బీజేపీలో చేరారు. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీలు ఈ మధ్యనే ఏక్‌నాథ్ షిండే నాయకత్వంలోని శివసేనలో చేరారు. ఇదే వరసలో మేఘాలయలో అయిదురుగు, మణిపూర్‌లో ముగ్గురు, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్‌లో చెరో నలుగురు ఎమ్మెల్యేలు కండువాలు మార్చేశారు. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్‌లో ఇద్దరు వంతున కర్ణాటక, మధ్యప్రదేశ్, సిక్కిం, యూపీలలో ఒక్కరు చొప్పున ఫిరాయింపులకు పాల్పడ్డారు అని లెక్క తేల్చింది ఏడీఆర్ రిపోర్టు.
పార్టీల వారీగా :
ఇక దేశంలోని పార్టీల వారీగా ఈ ఫిరాయింపుల నంబర్ చూస్తే పాతిక మంది ఎన్డీపీపీ వీడి బయటకు వెళ్ళారు. అలాగే టీఎంసీ నుంచి ఇరవై మంది కాంగ్రెస్ నుంచి 19 మంది, బీఆర్ఎస్ నుంచి 9 మంది, ఆప్ ఎన్సీపీల నుంచి చెరో ఏడుగురు, శివసేన నుంచి ఆరుగురు, జేడీయూ నుంచి ఐదుగురు, ఎన్‌పీపీ నుంచి నలుగురు పార్టీలు మారారు. ఈ ఫిరాయింపుల వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా ప్రభుత్వాలు కూడా పడిపోయాయని ఏడీఆర్ రిపోర్టు చెప్పడం విశేషం. మొత్తం మీద చూస్తే ఫిరాయింపుల కధ విజయవంతంగా దేశవ్యాప్తంగా జరుగుతోంది అని ఈ నివేదిక చెబుతోంది. మరి దీనికి అడ్డు కట్ట పడుతుందా అంటే కఠినంగా చట్టంలో సవరణలు తేవాలి. అది వీలు అయ్యే పనేనా అంటే రాజకీయ పార్టీల చిత్త శుద్ధి మీదనే ఆధారపడి ఉంది అని అంటున్నారు.
