చర్లపల్లి ట్రైన్ సూసైడ్ కేసు : డిప్రెషనే ఆత్మహత్యకు కారణమన్న పోలీసులు
చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఐటీ ఉద్యోగిని విజయ రెడ్డి తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
By: A.N.Kumar | 7 Feb 2026 2:04 PM ISTచర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఇటీవల ఐటీ ఉద్యోగిని విజయ రెడ్డి తన ఇద్దరు చిన్నారులతో కలిసి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఆర్థిక ఇబ్బందులు లేవు, కుటుంబ కలహాలు లేవు అన్న పరిస్థితుల్లో ఇలాంటి ఘోర ఘటన జరగడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీంతో తెలంగాణ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకుని ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల విచారణలో విజయ రెడ్డికి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని తేలింది. ఆమె భర్త విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా విజయ రెడ్డికీ నెలకు మంచి వేతనం వచ్చేది. భర్త వేతనం కూడా ఆమె ఖాతాలోనే జమ అవుతుండేదని, ఇద్దరు పిల్లలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదువుతున్నారని పోలీసులు నిర్ధారించారు. కుటుంబ పరంగా గానీ, బంధువులతో ఆస్తి వివాదాల పరంగా గానీ ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో విజయ రెడ్డి ఆత్మహత్యకు కారణాలు తెలుసుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. భర్తతో పాటు కుటుంబ సభ్యులను పలుమార్లు విచారించారు. ఆమె ఫోన్ డేటాను విశ్లేషించి వచ్చిన కాల్స్, మెసేజ్‌లను పరిశీలించారు. అయినప్పటికీ బయటకు కనిపించేలా ఎలాంటి వివాదాలు లేదా ప్రేరేపించే కారణాలు లభించలేదు. భర్త కూడా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, ఆర్థిక ఒత్తిడి లేదని పోలీసులకు తెలిపాడు.
అయితే మీడియాలో ఈ కేసుపై రకరకాల కథనాలు రావడంతో గందరగోళం ఏర్పడింది. దీనిపై మరోసారి కుటుంబ సభ్యులను విచారించిన పోలీసులు, అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత కీలకమైన నిర్ణయానికి వచ్చారు. తీవ్ర మానసిక ఒత్తిడి, లోతైన డిప్రెషన్ కారణంగానే విజయ రెడ్డి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తేల్చారు. తనకు ఏమైపోయినా పిల్లలు అనాధలు అవుతారనే భయంతో వారిని కూడా తనతో పాటు తీసుకెళ్లాలనే తప్పు దారుణమైన ఆలోచనకు లోనై ఈ నిర్ణయం తీసుకుందని పోలీసులు వెల్లడించారు.
“ఈ కేసును అనేక కోణాల్లో పరిశీలించాం. అనేక మందిని విచారించాం. కీలక ఆధారాల కోసం లోతుగా దర్యాప్తు సాగించాం. కానీ బయటకు కనిపించేలా ఎలాంటి నేరపూరిత కారణాలు లభించలేదు. తెలియని మానసిక ఒత్తిడి, తీవ్రమైన వేదన వల్లే విజయ రెడ్డి ఈ అతి నిర్ణయం తీసుకుంది ” అని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, విజయ రెడ్డి మృతికి కుటుంబ సభ్యులే కారణమంటూ కొన్ని మీడియా ఛానెళ్లు ప్రచారం చేయడంపై ఆమె సోదరుడు చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సోదరిని, ఆమె పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకున్నామని, ఆమె చావుకు తామెలా కారణమవుతామని ప్రశ్నించారు. ఒక ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి నిరాకరించడంతోనే తనపై కుట్ర చేసి తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని ఆరోపించారు.
సమాజానికి మేలు చేసే ఎన్నో వార్తలు ఉన్నాయని, అలాంటివి ప్రసారం చేయాలని మీడియా సంస్థలను కోరిన చిరంజీవి తప్పుడు కథనాలు ప్రచురించిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిజాలు వెలుగులోకి రావడంతో పాటు, మానసిక ఆరోగ్యంపై అవగాహన అవసరం ఎంతగానో ఉందన్న అంశం మరోసారి చర్చకు వచ్చింది.
