పోలవరం....సౌందర్యాల గని
పోలవరం అంటే గుర్తుకు వచ్చేది ఒక ప్రాజెక్ట్ రూపం. అక్కడ గోదావరి నది నీటిని స్టోరేజ్ చేసి వివిధ ప్రాంతాలకు అవసరమైన సందర్భాలలో రిలీజ్ చేసే అతి పెద్ద జలనిధిగా చూస్తారు.
By: Satya P | 2 July 2026 8:30 AM ISTపోలవరం అంటే గుర్తుకు వచ్చేది ఒక ప్రాజెక్ట్ రూపం. అక్కడ గోదావరి నది నీటిని స్టోరేజ్ చేసి వివిధ ప్రాంతాలకు అవసరమైన సందర్భాలలో రిలీజ్ చేసే అతి పెద్ద జలనిధిగా చూస్తారు. అయితే పోలవరం అన్నది బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ అని పెద్దలు ఎపుడో చెప్పారు. పోలవరం ద్వారా సాగు తాగు నీరు మాత్రమే కాదు పారిశ్రామిక అవసరాలకు నీరు అందించడమే కాదు మరో కొత్త రూపంలో కూడా జనాలకు కళ్ళకు కట్టే విధంగా డిజైన్ చేసే పనిలో కూటమి ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. దాంతో పోలవరం అంటే రానున్న రోజులలో సౌందర్య రాశిగా సోయగాల గనిగా పర్యాటక కేంద్రంగా మారనుంది అని అంటున్నారు.
పోలవరం చుట్టూనే :
ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ విషయంలో సరికొత్త ఆలోచనలు చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు ఏరియాలో గోదావరి ఔన్నత్యాన్ని చాటేలా మ్యూజియం ని తీసుకుని రావాలని అనుకుంటోంది. అదే విధంగా వాటర్ స్పోర్ట్స్, టెంపుల్ టూరిజం, రిసార్ట్స్ అలాగే హట్స్ వాటితో పాటు ఎమ్యూజ్మెంట్ పార్క్ లను కూడా భారీ ఎత్తున అభివృద్ది చేసేలా ప్రణాళికలు రూపొందిస్తోనిద్. పోలవరం బ్యూటిఫికేషన్ కు సంబందించి అధికారులు, ఆర్కిటెక్చర్స్ ఏజెన్సీ ప్రతినిధులతో ప్రభుత్వం ఈ మేరకు కీలక సమావేశం నిర్వహించింది.
బాబు చేతుల మీదుగా :
ఇక పోలవరం బ్యూటిఫికేషన్ కి సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలన చేసి డిజైన్స్ ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు పరిధిలో 10 వేల ఏకరాలను లైడార్ సర్వే చేసి పోలవరాన్ని టూరిజం హబ్‌గా డిజైన్ చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందించింది. పోలవరం రైట్, లెఫ్ట్ బ్యాంక్ లను కలుపుతూ అలాగే బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. ఇక పోలవరం ప్రాజెక్ట్ కు ఏలూరు, కొవ్వూరు, రాజమండ్రిలను జాతీయ రహదారులతో అనుసంధానించేలా కూడా ప్రభుత్వం పరిశీలన చేస్తోంది. పోలవరం ప్రాజెక్టు నుండి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్ గా మార్చేలా మాస్టర్ ప్లాన్ రెడీ అవుతోంది. దీనికి సంబంధించి నిప్పాన్ కోయి ఏజెన్సీ ఇచ్చిన పలు డిజైన్స్ ప్రస్తుతం ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.
అందాలతో అలరిస్తూ :
ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలు ఒక కొలిక్కి వచ్చినట్లు అయితే పోలవరం అందాలను చూసేందుకు దేశంలోని విదేశాలలోని పర్యాటకులు అంతా తరలి వస్తారు. తద్వారా అదనపు ఆదాయం కూడా ప్రభుత్వానికి సమకూరుతుంది. అంతే కాదు పోలవరం ఖ్యాతి ప్రపంచం నలుమూలలకు విస్తరిస్తుంది. నిజానికి పోలవరం విషయంలో ఏపీకి జీవనాడిగా వరప్రదాయినిగానే ఇప్పటిదాకా అంతా చూశారు. కానీ ఇపుడు పర్యాటకం యాంగిల్ లో కూటమి ప్రభుత్వం చూస్తూ అభివృద్ధి చేయాలనుకోవడం మాత్రం కచ్చితంగా మంచి నిర్ణయంగా భావిస్తున్నారు. పోలవరం టూరిజం హబ్ గా మారితే వయ్యారి గోదారమ్మ అందాలను తనివి తీరా చూసి తరించే భాగ్యం మాత్రం అందరిదీ అవుతుంది. మరీ ముఖ్యంగా ప్రకృతి ప్రేమికులకు ఇది కేరాఫ్ అడ్రస్ అవుతుంది అని అంటున్నారు.
