Begin typing your search above and press return to search.

పోలవరం అద్భుతం : చైనా 'త్రీ గార్జెస్'కూడా వెనకే.. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వేగా రికార్డు!

వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంలో ఈ ప్రాజెక్టు స్పిల్‌వే ప్రపంచ ప్రఖ్యాత చైనా 'త్రీ గార్జెస్' డ్యామ్‌ను కూడా వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.

By:  Tupaki Political Desk   |   5 Aug 2026 2:56 PM IST
పోలవరం అద్భుతం : చైనా త్రీ గార్జెస్కూడా వెనకే.. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిల్‌వేగా రికార్డు!
X

ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టు ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు సాధించింది. వరద నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యంలో ఈ ప్రాజెక్టు స్పిల్‌వే ప్రపంచ ప్రఖ్యాత చైనా 'త్రీ గార్జెస్' డ్యామ్‌ను కూడా వెనక్కి నెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది. గోదావరి నది ఉగ్రరూపాన్ని, భీకర ప్రవాహాన్ని తట్టుకునేలా అత్యంత పటిష్టమైన ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టు స్పిల్ వే ద్వారా ఒకేసారి 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. గోదావరి నదికి భవిష్యత్తులో వచ్చే అత్యంత భారీ వరదలను సైతం తట్టుకుని సురక్షితంగా వరద నీటిని దిగువకు విడుదల చేసేలా స్పిల్‌వేను నిర్మించినట్లు చెబుతున్నారు.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే ద్వారా గరిష్ఠంగా యాభై లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేయడం ప్రపంచంలోనే ఒక రికార్డుగా చెబుతున్నారు. స్పిల్‌వేపై మొత్తం 48 భారీ రేడియల్ గేట్ల ద్వారా వరదను నియంత్రించేలా ప్రాజెక్టు నిర్మించారని అంటున్నారు. సుమారు 1,200 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ భారీ స్పిల్‌వే ద్వారా గోదావరి నీటి ప్రవాహాన్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహించవచ్చు. ఈ రికార్డుతో పోలవరం చైనాలోని అతిపెద్ద ప్రాజెక్టు అయిన త్రీ గార్జెస్ డ్యామ్ కు ఉన్న రికార్డును అధిగమించినట్లు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఒకేసారి 47 లక్షల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, ఇప్పుడు పోలవరం ఆ రికార్డును అధిగమించిందని ప్రాజెక్టు నిర్మాణ సంస్థ చెబుతోంది.

చైనాలోని యాంగ్ టీజ్ నదిపై నిర్మించిన త్రీ గార్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఒకటిగా పేరుగాంచింది. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, రిజర్వాయర్ నీటి నిల్వ పరంగా ఇది పోలవరం కంటే పెద్దదైనప్పటికీ, వరద నీటిని బయటకు పంపే స్పిల్‌వే డిశ్ఛార్జ్ కెపాసిటీ విషయంలో మాత్రం పోలవరం ప్రాజెక్టు ముందంజలో ఉండటం గమనార్హం. త్రీ గార్జెస్ డ్యామ్ డిశ్ఛార్జ్ కెపాసిటీ సుమారు 47.32 లక్షల క్యూసెక్కులు కాగా, పోలవరం ప్రాజెక్టు డిశ్ఛార్జ్ కెపాసిటీ ఏకంగా 50 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ రికార్డుతో పోలవరం ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ స్పిల్‌వేగా ఖ్యాతి గడించిందని చెబుతున్నారు.

ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి మరికొన్ని ఆసక్తికరమైన అంశాలు ఇంజనీరింగ్ రంగంలో చర్చనీయాంశంగా మారాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో భాగంగా ఒకే రోజులో అత్యధికంగా 32,315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి ప్రపంచ రికార్డు సృష్టించారు. మరోవైపు, చైనా త్రీ గార్జెస్ డ్యామ్ నిర్మాణానికి కోట్లాది టన్నుల కాంక్రీట్, ఉక్కును వాడటం వల్ల ఆ ప్రాజెక్టు భారీ పరిమాణం కారణంగా భూభ్రమణ వేగం కూడా స్వల్పంగా మందగించిందనే శాస్త్రీయ అంచనాలు ఉన్నాయి. చైనా త్రీ గార్జెస్ డ్యామ్ పరిమాణం ఎంత పెద్దదదంటే ఇది అంతరిక్షం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే, పూర్తిస్థాయిలో పూర్తయితే పోలవరం ప్రాజెక్టు కూడా తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మానవ నిర్మిత అద్భుతంగా నిలవనుందని అంటున్నారు.

కేవలం వరద నిర్వహణే కాకుండా, పోలవరం ప్రాజెక్టు ద్వారా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ ప్రాజెక్టుగా గుర్తించింది. ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేస్తున్న జలవిద్యుత్ కేంద్రం ద్వారా భారీగా విద్యుత్ ఉత్పత్తి జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు, గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి ఈ ప్రాజెక్టు కేంద్ర బిందువుగా మారుతుందని చెబుతున్నారు. గోదావరి నది భీకర ప్రవాహాన్ని శాసించేలా, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న పోలవరం ప్రాజెక్టు మన దేశానికి గర్వకారణంగా చెబుతున్నారు. చైనా త్రీ గార్జెస్ వంటి ప్రపంచ దిగ్గజ ప్రాజెక్టులను డిశ్ఛార్జ్ కెపాసిటీలో వెనక్కి నెట్టిన ఈ అద్భుత నిర్మాణం.. త్వరలోనే పూర్తై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, వ్యవసాయ స్వరూపాన్ని పూర్తిగా మార్చనుందనడంలో ఎలాంటి సందేహం లేదు.