పోలవరం క్రెడిట్ కోసం కమలం ఆరాటం !
పోలవరం క్రెడిట్ తమదే అని అంటోంది ఏపీ కమలదళం. కేంద్రం ఇచ్చిన నిధులతోనే పోలవరం వంటి భారీ ప్రాజెక్ట్ పూర్తి అవుతోందని గట్టిగా చెప్పుకుంటోంది.
By: Satya P | 20 July 2026 10:04 AM ISTపోలవరం క్రెడిట్ తమదే అని అంటోంది ఏపీ కమలదళం. కేంద్రం ఇచ్చిన నిధులతోనే పోలవరం వంటి భారీ ప్రాజెక్ట్ పూర్తి అవుతోందని గట్టిగా చెప్పుకుంటోంది. పోలవరానికి ఉదారంగా కేంద్రం ఇచ్చిన ఆర్ధిక చేయూత గొప్పదని ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ కేంద్ర మంత్రి సహా ఎమ్మెల్యేలు కీలక నేతలు పోలవరం సందర్శన కార్యక్రమం చేపట్టారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అండతోనే పోలవరం ప్రాజెక్ట్ కల నిజం అయింది అని బీజేపీ నేతలు అంటున్నారు.
పదమూడేళ్ళ కాలం :
అయితే పోలవరం ప్రాజెక్ట్ వ్యవహారం ఈనాటిది కాదు. 2004లో అప్పటి ఉమ్మడి ఏపీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ ని సాకారం చేయడానికి కృషి చేశారు. అనేక అనుమతులను ఆయన అయిదేళ్ళ ముఖ్యమంత్రిత్వంలోనే సాధించారు. రెండవ టెర్మ్ 2009లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే వైఎస్సార్ మరణించారు. ఆయన ఆలోచన మేరకు అయితే 2014లోగా పోలవరం పూర్తి చేస్తే ఏపీ విడిపోయినా సాగు తాగు నీటికి ఇబ్బంది రాదని అని అంటారు. అయితే అది అలా జరగలేదు. ఈలోగా 2014లో విడిపోవడమే ముందు జరిగింది. అయితే దానికంటే ముందు కేంద్రంలో యూపీయే ప్రభుత్వం పోలవరం ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ విభజన చట్టంలో పెట్టడమే ఏపీకి అతి పెద్ద వరం అయింది. ఇక బీజేపీ 2014 నుంచి అధికారంలో ఉంది. పోలవరం 2027 నాటికి పూర్తి అవుతుంది అనుకున్నా బీజేపీ పెద్దలకు పూర్తి చేయడానికి 13 ఏళ్ళు పట్టిందా అన్న చర్చ కూడా జనంలో నుంచి వస్తోంది.
పోలవరం అడుగులు తగ్గింపు
పోలవరం ప్రాజెక్టు గరిష్ట ఎత్తును 45.72 మీటర్లు అంటే 150 అడుగులుగా నిర్మించాలన్నది వాస్తవ అంచనాగా ఉంది. అయితే తొలిదశలో 41.15 మీటర్లకు అంటే 135 అడుగులు కుదించారని విపక్షాలు నుంచి విమర్శలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన స్పష్టత ప్రకారం పోలవరం ప్రాజెక్టు అసలు ఎత్తు 45.72 మీటర్లుగానే ఉంటుందని అంటున్నారు. అయితే 2027 నాటికి మాత్రం 41.15 మీటర్ల ఎత్తున నిర్మించి పూర్తి చేస్తున్నారా లేదా 45.72 మీటర్ల దాకా వాస్తవ ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తున్నారా అన్నది చూడాల్సి ఉందని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎత్తును తగ్గించే ప్రతిపాదనను ఎప్పుడూ ఆమోదించలేదని ప్రాజెక్టు ఎప్పటికైనా 45.72 మీటర్ల ఎత్తులోనే పూర్తవుతుందని స్పష్టం చేసిన నేపధ్యంలో ఆ దిశగానే 2027లో పోలవరం ప్రాజెక్ట్ ఏపీకి అందిస్తే బీజేపీకి ఎంతో క్రెడిట్ దక్కుతుందని అంటున్నారు.
జనాల మెప్పు కోసం :
ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్ట్ తమ క్రెడిట్ అని బీజేపీ నేతలు ఏపీకి ఇచ్చిన నిధులను లెక్కతో సహా చెబుతున్నారు. అదే విధంగా అమరావతి రాజధాని కోసం అక్కడ అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇచ్చిన నిధుల గురించి కూడా ప్రస్తావిస్తున్నారు. అలాగే రాయలసీమలో ఇటీవల కాలంలో వచ్చిన ప్రాజెక్టుల వెనక కేంద్రం కృషి ఉందని గుర్తు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఏపీ జనాల మెప్పు పొంది బీజేపీ ఏపీకి చేసిన మేలు ఇదని చెప్పుకోవడానికి తాపత్రయపడుతున్నారు. అయితే ప్రజలు ఈ విషయంలో క్రెడిట్ ఎవరికి ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ సీఎం వైఎస్సార్ పునాది వేశారు అని ఆ పార్టీ అంటోంది. అలాగే అప్పటి యూపీయే ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి విభజన చట్టంలో పెట్టిందని అంటున్నారు. టీడీపీ అయితే తమ నిరంతర పర్యవేక్షణతోనే వేగంగా పోలవరం పూర్తి చేశామని చెబుతోంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా తాము కూడా క్రెడిట్ రేసులో ఉన్నామని బీజేపీ నేతలు అంటున్నారు. చూడాలి మరి పోలవరం ఎవరి రాజకీయ జాతకం మారుస్తుందో.
