Begin typing your search above and press return to search.

పోలవరం గైడ్ బండ్ పై అంతర్జాతీయ నిపుణుల సంచలన నివేదిక.. కీలక అంశాలపై సూచనలు

దీనిపై కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించగా, భవిష్యత్తు నిర్మాణాలపై తగిన సలహాల కోసం నలుగురు అంతర్జాతీయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది.

By:  Tupaki Political Desk   |   10 Oct 2025 3:54 PM IST
పోలవరం గైడ్ బండ్ పై అంతర్జాతీయ నిపుణుల సంచలన నివేదిక.. కీలక అంశాలపై సూచనలు
X

పోలవరం ప్రాజెక్టులోని కీలకమైన గైడ్ బండ్ పై అధ్యయనం చేసిన అంతర్జాతీయ నిపుణులు సంచనల నివేదిక సమర్పించారు. పోలవరం ప్రాజెక్టు పనులు నిర్దేశించిన విధంగా కొనసాగాలంటే గతంలో కుంగిపోయిన గైడ్ బండ్ ను పునర్మించాల్సిన అవసరం ఉందని నలుగురు సభ్యులతో కూడిన ఇంటర్నేషనల్ ఎక్సపర్ట్స్ ప్యానెల్ స్పష్టం చేసింది. 2019-24 మధ్య వరదలకు పాడైన గైడ్ బండ్ ను మరమ్మతులు చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. కొత్తగా నిర్మించే గైడ్ బండ్ కు కొత్త డిజైన్లు చేయాలని సూచించింది.

అదేవిధంగా దిగువ కాఫర్ డ్యాం సీపేజీని నివారించేందుకు రోజువారీ పరిశీలన చేయాలని సూచించింది. గత ప్రభుత్వం ప్రభుత్వంలో పాడైన డయాఫ్రం వాల్ కు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వాల్ పనులు ఏడు నెలల్లోనే 50 శాతం పూర్తికావడాన్ని నిపుణులు కొనియాడారు. కాగా, గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు పనులు సజావుగా సాగకపోవడంతో డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోపాటు గైడ్ బండ్ కుంగిపోయినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. డయాఫ్రం వాల్ ను పునర్మిస్తూనే గైడ్ బండ్ సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని భావించింది. దీనివల్ల ప్రాజెక్టు పనులు వేగవంతమయ్యే అవకాశం ఉందని భావించింది.

దీనిపై కేంద్ర జలశక్తి శాఖను రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించగా, భవిష్యత్తు నిర్మాణాలపై తగిన సలహాల కోసం నలుగురు అంతర్జాతీయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపాటు, గైడ్ బండ్, కాఫర్ డ్యాం, డయాఫ్రంవాల్ నిర్మాణాలను పరిశీలించారు. డయాఫ్రం వాల్ కు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వాల్ పనులపై కితాబునిచ్చిన నిపుణులు, గైడ్ బండ్ మాత్రం కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించడంతో పోలవరం పనులు గడువులోగా పూర్తవుతందా? అని మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రాజెక్టు పరిశీలనకు కేంద్రం నియమించిన నిపుణుల టీంలో డేవిడ్ బి.పాల్, జియాస్ ఫ్రాంకో డిసిస్కో (అమెరికా), రిచర్డ్ డొనెల్లీ, ఎస్.హించ్ బెర్గర్ (కెనడా) ఉన్నారు. ఈ నలుగురు మొత్తం ఐదు సార్లు ప్రాజెక్టును సందర్శించారు. గత ఆగస్టులో చివరిసారిగా పోలవరం వచ్చిన వీరు పనులను పరిశీలించి కేంద్రానికి సమగ్ర నివేదిక సమర్పించినట్లు సమాచారం. 2027 నాటికి ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ చెబుతున్నప్పటికీ గైడ్ బండ్ పునర్నిర్మాణంతోనే సాధ్యమని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేందుకు మరికొన్ని కీలక సూచనలు సైతం చేశారు. ప్రాజెక్టు పనులను సాంకేతికంగా నిత్యం పర్యవేక్షించాలని సూచించారు.