Begin typing your search above and press return to search.

పీఓకేలో రచ్చ రచ్చ... అసలేం జరుగుతుంది?

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్‌ లో సోమవారం మొదలైన అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.

By:  Raja Ch   |   1 Oct 2025 9:22 AM IST
పీఓకేలో రచ్చ రచ్చ... అసలేం జరుగుతుంది?
X

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్‌ లో సోమవారం మొదలైన అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న నిరాయుధ కాశ్మీరీలపై పాకిస్తాన్ పోలీసులు కాల్పులు జరపడంతో ఇద్దరు మరణించగా 18 మంది గాయపడ్డారు. మరోవైపు ప్రజలు పోలీసులపై తిరిగబడి వారిని బంధించారు!

అవును... పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడి ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ఈ సమయంలో నిరసనలను ఆపాలని పాక్ ప్రభుత్వం పోలీసులు, ఆర్మీని రంగంలోకి దింపింది.. ప్రజలపై తూటాల వర్షం కురిపించింది. అయితే.. ఆ బెదిరింపులకు ఏమాత్రం లొంగని ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు!

ఈ సమయంలో తమను అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను పీఓకే ప్రజలు బంధించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా... ప్రపంచ వేదికలపైనా, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో శాంతి కబుర్లు చెప్పే పాకిస్థాన్ ప్రభుత్వం... ఇప్పుడు తన సొంత ప్రజలపైనే బుల్లెట్ల వర్షం కురిపిస్తోందంటూ స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో, పీఓకేలోని అన్ని జిల్లాల్లో బంద్‌ కు పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాల్లోని వ్యాపారులు దుకాణాలను మూసివేసి, లాక్‌ డౌన్ విధించారు. ప్రజలు పాకిస్తాన్ అధికారులకు వ్యతిరేకంగా వీధుల్లోకి వస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

పీఓకే ఎందుకు మండుతోంది..?:

పీఓకే అంతటా దుకాణాలు మూసి ఉండగా, ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ హక్కులను డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా... పీఓకే నదులు, భూమి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే మంగళా ఆనకట్ట, నీలం-జీలం ప్రాజెక్టుల వంటి సమస్యల వల్ల నిరసనలు చెలరేగాయి. ఈ విద్యుత్తులో సుమారు 60% పాకిస్తాన్‌ లోని పంజాబ్ ప్రావిన్స్, ఇతర ప్రాంతాలకు సరఫరా చేయబడుతుందనేది ప్రధాన ఆరోపణ!

మరో ముఖ్యమైన ఫిర్యాదు ఏమిటంటే.. పీఓకే అసెంబ్లీ కూర్పు, ఇక్కడ 12 సీట్లు పాకిస్తాన్ ప్రభుత్వం నామినేట్ చేసిన సభ్యులకు రిజర్వ్ చేయబడ్డాయి, ఇవి భారత కాశ్మీర్ నుండి వచ్చిన శరణార్థులకు ప్రాతినిధ్యం వహిస్తాయి. ఈ సీట్లు స్థానిక జనాభా గొంతును అణచివేస్తాయని, ఇస్లామాబాద్ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం వీటిని ఉపయోగించుకుంటుందని స్థానికులు చెబుతున్నారు.

యూనివర్సిటీలకు బదులు ఉగ్రవాద శిక్షణా శిబిరాలు!:

పీఓకే లో యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలను నిర్మించడానికి బదులుగా, పాకిస్తాన్ ప్రభుత్వం ఉగ్రవాద శిక్షణా శిబిరాలను ఏర్పాటు చేసిందని ప్రజలు ఘాటుగా విమర్శిస్తున్నారు. పీఓకేలో కేవలం ఆరు ప్రభుత్వ కళాశాలలు, రెండు వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయని.. ఇవి దీర్ఘకాలిక సౌకర్యాల కొరతను ఎదుర్కొంటున్నాయని తెలిపారు.

మరోవైపు.. అబ్దుల్లా బిన్ మసూద్ వంటి 12 కంటే ఎక్కువ పెద్ద ఉగ్రవాద శిక్షణా శిబిరాలు.. మార్కజ్ షోహాదా-ఎ-కాశ్మీర్ వంటి 20 కంటే ఎక్కువ మధ్య తరహా కేంద్రాలు పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం మద్దతుతో ఉన్నాయని మండిపడుతున్నారు.

భారీగా పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు!:

పిండి, బియ్యం, పప్పులు వంటి నిత్యావసర వస్తువులపై సబ్సిడీలు ఇవ్వాలని కూడా పీఓకే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పీఓకేలో బియ్యం కిలో పాకిస్థాన్ కరెన్సీలో 301, పిండి కిలోకు 110, మసూర్ పప్పు కిలో 360, కంది పప్పు కిలో 710 గా ఉందని.. ఇవి ఏమాత్రం సామాన్యుడికి అందుబాటు ధరలు కాదని చెబుతున్నారు. కాగా... భారత్ లో ప్రీమియం బాస్మతి బియ్యం కిలో రూ.110, గోధుమ పిండి కిలో రూ.42, కంది పప్పు కిలో రూ.112 గా ఉందని గుర్తుచేస్తున్నారు.