అసలేంటి ‘పోక్సో’ చట్టం? ఎవరికి వర్తిస్తుంది? ఫుల్ స్టోరీ
భారతదేశంలో చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు రూపొందించిన అత్యంత కీలకమైన చట్టాలలో ఒకటి పోక్సో యాక్ట్.
By: A.N.Kumar | 17 May 2026 5:00 PM ISTభారతదేశంలో చిన్నారులపై లైంగిక నేరాలను అరికట్టేందుకు రూపొందించిన అత్యంత కీలకమైన చట్టాలలో ఒకటి పోక్సో యాక్ట్. “ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ ఆఫెన్సెస్ యాక్ట్-2012”గా పిలిచే ఈ చట్టం పిల్లల భద్రతకు ఒక కవచంలా పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా చిన్నారులపై పెరుగుతున్న లైంగిక దాడులు, వేధింపులు, ఆన్‌లైన్ దుర్వినియోగం వంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. 18 ఏళ్ల లోపు ఉన్న ప్రతి బాలుడు, బాలికను ఈ చట్టం “చైల్డ్”గా పరిగణిస్తుంది.
పోక్సో చట్టంలో లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన, అత్యాచారం, పిల్లలను అశ్లీల చిత్రాల్లో ఉపయోగించడం, ఆన్‌లైన్ ద్వారా వేధించడం వంటి అనేక నేరాలకు కఠిన శిక్షలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై జరిగిన నేరాల్లో బాధితుల గోప్యతకు ఈ చట్టం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. విచారణ సమయంలో బాధితుల పేర్లు, ఫొటోలు, వివరాలు బయటపెట్టడం నేరంగా పరిగణిస్తారు.
పోక్సో కేసుల్లో ప్రత్యేక కోర్టుల ద్వారా వేగవంతమైన విచారణ జరపాలని చట్టం స్పష్టం చేస్తోంది. చిన్నారుల మనోభావాలు దెబ్బతినకుండా మహిళా పోలీసులతో స్టేట్‌మెంట్ తీసుకోవడం, కుటుంబ సభ్యుల సమక్షంలో విచారణ జరపడం, పిల్లలపై ఒత్తిడి లేకుండా వ్యవహరించడం వంటి ప్రత్యేక నిబంధనలు ఇందులో ఉన్నాయి. బాధిత చిన్నారికి కౌన్సెలింగ్, వైద్య సహాయం, చట్టపరమైన రక్షణ కూడా కల్పించాల్సి ఉంటుంది.
ఇటీవల కాలంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగం పెరగడంతో ఆన్‌లైన్ లైంగిక నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఫేక్ అకౌంట్లు, వీడియో కాల్స్, బ్లాక్‌మెయిల్, ఫోటో మార్ఫింగ్ వంటి ఘటనల్లో కూడా పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తున్నారు. పాఠశాలలు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లు, ఆధ్యాత్మిక సంస్థలు వంటి చోట్ల పిల్లల భద్రతపై మరింత అప్రమత్తత అవసరమని నిపుణులు చెబుతున్నారు.
చట్టం ఎంత కఠినంగా ఉన్నా, సమాజంలో అవగాహన లేకపోతే ఫలితం ఉండదని అధికారులు చెబుతున్నారు. చాలా సందర్భాల్లో కుటుంబ పరువు భయంతో ఫిర్యాదులు ఇవ్వకపోవడం వల్ల నిందితులు తప్పించుకుంటున్నారు. చిన్నారుల ప్రవర్తనలో మార్పులు, భయం, ఒంటరితనం వంటి లక్షణాలను తల్లిదండ్రులు గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు “గుడ్ టచ్, బ్యాడ్ టచ్”పై అవగాహన కల్పించడం కూడా ఎంతో ముఖ్యం అంటున్నారు.
చట్టం దృష్టిలో ఇద్దరూ సమానమే
పోక్సో చట్టంలోని అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే ఇది జెండర్-న్యూట్రల్ . 18 సంవత్సరాల లోపు ఉన్నవారందరూ ఈ చట్టం పరిధిలోకి వస్తారు. బాధితుడు అబ్బాయి అయినా, అమ్మాయి అయినా చట్టం ఒకేలా వర్తిస్తుంది. నేరస్థుడికి పడే శిక్షల్లో కూడా ఎలాంటి తారతమ్యాలు ఉండవు. చట్టం ప్రకారం 18 ఏళ్ల లోపు పిల్లలపై జరిగే ఎలాంటి లైంగిక దాడి లేదా వేధింపులైనా సమానమైన నేరాలుగానే పరిగణించబడతాయి.
చట్టం ఇద్దరికీ సమాన రక్షణ కల్పించినప్పటికీ, నమోదవుతున్న కేసుల సంఖ్యను పరిశీలిస్తే అమ్మాయిల కేసులే సింహభాగం సుమారు 85% నుండి 90% పైగా ఉంటున్నాయి. అబ్బాయిలపై జరిగే నేరాల కేసులు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలున్నాయి. అబ్బాయిలపై లైంగిక వేధింపులు జరగవనే తప్పుడు నమ్మకం సమాజంలో బలంగా ఉంది. అబ్బాయిలు వేధింపులకు గురైతే, "మగాడివి ఉండి ఎదురు తిరగలేకపోయావా?" అనే సామాజిక హేళనకు భయపడి తల్లిదండ్రులు, బాధితులు బయటకు చెప్పరు. అబ్బాయిలపై జరిగే వేధింపులపై కూడా పోక్సో కేసు పెట్టవచ్చనే విషయం చాలామంది గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియదు.
పోక్సో చట్టంలో కేసు పెట్టడానికి ఎటువంటి కాల పరిమితి లేదు. ఘటన జరిగిన రోజునే కేసు పెట్టాలనే నిబంధన లేదు.
ఒక అమ్మాయి లేదా అబ్బాయి చిన్నప్పుడు (18 ఏళ్ల లోపు) వేధింపులకు గురైతే, వారు పెద్దయ్యాక ఉదాహరణకు 20 లేదా 25 ఏళ్ల వయసులో కూడా తమకు చిన్నప్పుడు జరిగిన అన్యాయంపై పోక్సో కింద ఫిర్యాదు చేయవచ్చు. అయితే ఆలస్యంగా ఫిర్యాదు చేసినప్పుడు కోర్టులో సరైన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది.
పరస్పర సమ్మతితో కూడిన ప్రేమ వ్యవహారాల్లో 16-18 ఏళ్ల వయసున్న అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయినప్పుడు, అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిపై పోక్సో కింద రేప్ కేసులు పెడుతున్నారు. ఇక్కడ అబ్బాయి కూడా మైనరే అయినప్పటికీ చట్టం ప్రకారం అమ్మాయి సమ్మతికి విలువ ఉండదు కాబట్టి అబ్బాయి జైలుకు వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల అనేకమంది యువకుల జీవితాలు నాశనమవుతున్నాయని కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి.
ఇటీవలి కొన్ని సంచలన కేసుల్లో పోక్సో చట్టం కింద అరెస్టులు, కఠిన శిక్షలు విధించడంతో ఈ చట్టంపై దేశవ్యాప్తంగా మళ్లీ చర్చ మొదలైంది. చిన్నారులపై నేరాలకు ఎలాంటి క్షమాభిక్ష ఉండదనే సందేశాన్ని ప్రభుత్వం, న్యాయస్థానాలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పోక్సో చట్టం అమలులో ప్రజల సహకారం అత్యంత అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పోక్సో అనేది కేవలం అమ్మాయిలను కాపాడే ఆయుధం మాత్రమే కాదు.. అది పిల్లలందరినీ రక్షించే ఒక కవచం. అబ్బాయిలపై జరిగే లైంగిక దాడులను కూడా సమాజం తీవ్రంగా పరిగణించాలి. పిల్లలు అమ్మాయి అయినా, అబ్బాయి అయినా తమకు జరుగుతున్న ఇబ్బందులను తల్లిదండ్రులతో పంచుకునేలా ఇంట్లో స్వేచ్ఛా పూరిత వాతావరణం కల్పించినప్పుడే ఇలాంటి నేరాలకు అడ్డుకట్ట వేయడం సాధ్యమవుతుంది.
