కొత్త ప్లాన్ : ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ కనెక్షన్లు
ఇక దేశంలో పెద్ద ఎత్తున పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి రాయితీలను సీజీడీ సంస్థలు ప్రకటిస్తున్నాయి.
By: Satya P | 17 March 2026 9:17 AM ISTదేశంలో ఇపుడు గ్యాస్ సమస్య జనాలను పట్టి పీడిస్తోంది. ఎక్కడో పశ్చిమాసియాలో యుద్ధం అనుకుంటే అది కాస్తా ప్రతీ వారి వంటింట్లో కుంపటి పెడుతోంది. గ్యాస్ ని లేకుండా చేస్తోంది. దాంతో సాధారణ జీవితం అతలాకుతలం అవుతోంది. యుద్ధం ఎపుడు ఆగుతుందో ఎవరికీ తెలియదు, దాంతో విదేశాల నుంచి వచ్చే ఇంధనం మీద ఆధారపడి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునే భారత్ లాంటి దేశాలు ఇపుడు ఇరకాటంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ఏమి చేయాలన్నది అందరిలో కలుగుతున్న పెద్ద ప్రశ్న. ఆల్టర్నేషన్ మార్గాలని చూడాలని సలహాలు సూచనలు వస్తున్నాయి.
పీఎన్‌జీ వైపుగా చూడాల్సిందే :
ఇక దేశంలో ఎల్పీజీ వినియోగం గడచిన దశాబ్దాల కాలంలో పెద్ద ఎత్తున పెరిగిపోయింది. పేదలందరికీ ఉచితంగా ప్రభుత్వాలు పధకాలు పెట్టి మరీ వంట గ్యాస్ ని సరఫరా చేస్తున్నాయి. దాంతో గ్రామాల్లో సైతం కట్టెల పొయ్యిలు చరిత్రలోకి వెళ్ళిపోయాయి. ఈ క్రమంలో ఎల్పీజీ కొరత ప్రస్తుతం ఒక స్థాయిలో ఉంటేనే ఇబ్బంది అవుతోంది, అది కాస్తా మరింతగా ముదిరితే ఏమి చేయాలన్నది కూడా అంతా చర్చిస్తున్నారు. దాంతో పీఎన్‌జీ కనెక్షన్ల వైపు జనాలను మళ్ళించాలని కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు సూచిస్తున్నారు. ఒక వైపు పశ్చిమాసియాలో ఇటీవల పరిణామాలపై వివిధ మంత్రిత్వ శాఖలు పరిశీలిస్తూనే దేశంలో నెలకొన్న గ్యాస్ కొరత పరిస్థితులను అధ్యయనం చేస్తున్నాయి.
భారీ రాయితీలతో :
ఇక దేశంలో పెద్ద ఎత్తున పీఎన్‌జీ కనెక్షన్లను ప్రోత్సహించడానికి రాయితీలను సీజీడీ సంస్థలు ప్రకటిస్తున్నాయి. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎల్‌పీజీ సరఫరాపై నిరంతరం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఆయా మంత్రిత్వ శాఖలు నిశితంగా పర్యవేక్షణ చేస్తున్నాయి. ఇక చూస్తే యుద్ధం మొదలైన తరువాత దేశంలో దాదాపు 84 శాతం నుంచి 90 శాతానికి ఆన్‌లైన్ ఎల్‌పీజీ సిలిండర్ బుకింగ్‌లు పెరిగినట్లుగా చెబుతున్నారు. ఇక అదే సమయంలో గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వల మీద బ్లాక్ మార్కెట్ మీద కూడా నిఘా పెరిగింది. అక్కడ జరిగే వ్యవహారాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో పీఎన్‌జీ కనెక్షన్లకు ఇస్తున్న భారీ రాయితీల గురించి జనంలో ప్రచారం చేయాలని అధికారులను కోరుతున్నారు.
పీఎన్‌జీ అంటే ఏమిటి :
పీఎన్‌జీ అంటే పైప్డ్ నేచరల్ గ్యాస్ అన్న మాట. పీఎన్‌జీ నేరుగా పైప్‌లైన్ల ద్వారా ఇళ్లకు వాణిజ్య సంస్థలకు సరఫరా చేయబడే సహజ వాయువు. ఇది మిథేన్, ఇతర హైడ్రోకార్బన్ తో కూడి ఉంటుంది. పీఎన్‌జీ సురక్షితమైనదిగా చెబుతారు. అలాగే నిరంతర సరఫరా ఉంటుంది అంతే కాదు ఎల్‌పీజీ సిలిండర్లతో పోలిస్తే చౌకగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దేశంలో పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవారంతా ఎల్‌పీజీ సిలిండర్లను సరెండర్ చేయాలని కేంద్రం కొత్త నిబంధనలు కూడా తాజాగా తెచ్చింది.
సిలిండర్ అవసరం లేదు :
ఇక పీఎన్‌జీ కనెక్షన్లను తీసుకుంతే పైప్‌లైన్ ద్వారా నేరుగా వంటగదికి నిరంతరాయంగా అందుతుంది కాబట్టి సిలిండర్ మార్చే అవసరం లేదు. అలాగే పీఎన్‌జీ గాలి కంటే తేలికగా ఉంటుంది, కాబట్టి లీక్ అయితే త్వరగా గాలిలో కలిసిపోతుంది దాని వల్ల ప్రమాద తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. అంతే కాకుండా ఎల్‌పీజీతో పోలిస్తే పీఎన్‌జీ వాడకం చవకగా ఉంటుంది. పర్యావరణ అనుకూలమైనదిగా చెబుతున్నారు. ఇప్పటిదాకా చూస్తే కనుక పీఎన్‌జీ కనెక్షన్లను వాణిజ్యపరంగా హోటళ్లు అలాగే ఇతర పరిశ్రమల్లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
