భారత ప్రధాని కేరాఫ్ సేవా తీర్థ్
ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అడ్రస్ మారింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ఈ రోజు (శుక్రవారం) సేవాతీర్థ్ కు మారింది.
By: Garuda Media | 13 Feb 2026 9:00 PM ISTప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అడ్రస్ మారింది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయంగా ఉన్న సౌత్ బ్లాక్ నుంచి ఈ రోజు (శుక్రవారం) సేవాతీర్థ్ కు మారింది. 1931లో బ్రిటిష్ కాలంలో నిర్మించిన సౌత్ బ్లాక్ రాష్ట్రపతి భవన్ పక్కనే ఉన్న రైసినా హిల్ ప్రాంతంలో ఉండేది. ఇప్పటివరకు ఇక్కడి నుంచే ప్రధానమంత్రులు పని చేసేవారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా సరికొత్త హంగులతో పార్లమెంట్ భవనంతో పాటు ఇతర ప్రభుత్వ పాలనా భవనాల్ని నిర్మిస్తున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సైతం మారుస్తున్నారు.
ఈ కొత్త భవనాన్ని ఈ రోజు నరేంద్ర మోడీ ప్రారంభించారు. దీన్ని సేవా తీర్థ్ గా పిలుస్తారు. ఇంతకాలం పీఎంవో, జాతీయ భద్రతా మండలి కార్యాలయం, కేబినెట్ సెక్రటేరియట్ లు ఇప్పుడు ఒకే ప్రాంగణంలోకి వస్తున్నాయి. ఈ భవనం ఎయిర్ ఫోర్స్ ఆఫీసు పక్కనే ఉంటుంది. ఒకే భవనంలో కీలకమైన నేషనల్ సెక్యూరిటీ కౌన్సెల్ తో పాటు క్యాబినెట్ సెక్రటేరియట్ ఒకే భవనంలో అందుబాటులోకి రావటంతో పాలనాపరంగా మరింత వేగంగా నిర్ణయాలకు వీలువుతుంది. సేవా తీర్థ్ లో మొత్తం మూడుగా ఉన్నాయి. దీన్ని అత్యాధునిక గ్రీన్ బిల్డింగ్ టెక్నాలజీతో నిర్మించారు.
ఈ భవనంలో వినియోగించే విద్యుత్ ను సోలార్ పవర్ తో పని చేసేలా సాంకేతికతను ఏర్పాటు చేశారు. నీటి పొదుపుతో పాటు.. చెత్తను రీసైక్లింగ్ చేసే వ్యవస్థలు ఉంటాయి. దీంతో పర్యావరణాన్ని కాపాడటంతోపాటు.. విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈ భవనాల్లోని మరో ముఖ్యమైన అంశం ఫైల్స్.. పేపర్ అన్నది లేకుండా అంతా డిజిటల్ గా షేర్ చేసుకోవచ్చు. దీంతో పారదర్శకత మరింత పెరుగుతుంది. స్మార్ట్ లాక్స్.. కెమెరాలు.. అత్యవసర అతారమ్ లు ఉన్నాయి. దీంతో భవనంలోకి ఎవరు.. ఎప్పుడు వచ్చారు? ఎక్కడకు వెళ్లారు లాంటివి ఇట్టే తెలుస్తాయి. దీంతో.. భద్రతాపరమైన సమస్యలు తగ్గుతాయి. అత్యాధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా పాలనాపరమైన మార్పులకు.. వేగానికి దోహదం చేస్తుంది.
