Begin typing your search above and press return to search.

మోదీ వర్క్ ఫ్రం హోం పిలుపు.. కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలా?

ప్రధాని సూచించినా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవడానికే మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలున్నాయి.

By:  Tupaki Political Desk   |   13 May 2026 11:15 PM IST
మోదీ వర్క్ ఫ్రం హోం పిలుపు.. కంపెనీలు తప్పనిసరిగా అమలు చేయాలా?
X

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్, కార్పొరేట్ ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తించాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, విదేశీ మారక నిల్వలపై ఒత్తిడిని తగ్గించేందుకు "వర్క్ ఫ్రమ్ హోమ్" విధానాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. దీంతో మళ్లీ ఐటీ కంపెనీలు ఇంటి నుంచే పని చేసే వెసులుబాటు కల్పిస్తాయా? దీనిపై చట్టాలు ఏం చెబుతున్నాయి? అన్నది ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు.

ప్రధాని పిలుపు వెనుక అసలు కారణమేంటి?

ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఆఫీసులకు వెళ్లడం తగ్గితే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గుతుంది. ట్రాఫిక్ తగ్గి కాలుష్యం అదుపులోకి వస్తుంది. ఆర్థిక స్థిరత్వంతో విదేశీ మారక ద్రవ్యం ఆదా అవుతుంది. అందుకే ఆన్‌లైన్ మీటింగ్స్, వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి కోవిడ్ కాలం నాటి పద్ధతులను మళ్లీ అనుసరించాలని ప్రధాని సూచించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఉద్యోగి హక్కా? చట్టం ఏం చెబుతోంది?

ప్రధాని పిలుపునిచ్చినంత మాత్రాన కంపెనీలు వెంటనే వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేయాల్సిన చట్టబద్ధమైన నిబంధన ఏదీ ప్రస్తుతం లేదు. భారత కార్మిక చట్టాల ప్రకారం.. కంపెనీదే తుది నిర్ణయం. ఉద్యోగి ఎక్కడ పని చేయాలి, ఎన్ని గంటలు ఆఫీసులో ఉండాలి అనేది పూర్తిగా సంస్థ యొక్క హెచ్ఆర్ పాలసీలు, ఉద్యోగ ఒప్పందంపై ఆధారపడి ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో "నేను ఇంటి నుంచే పని చేస్తాను" అని డిమాండ్ చేసే చట్టపరమైన హక్కు ఉద్యోగికి లేదు. కంపెనీ ఆదేశిస్తే ఆఫీస్‌కు రావాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు చూస్తే.. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాలు పని గంటలు, సెలవుల గురించి చెబుతాయే తప్ప.. వర్క్ ఫ్రం హోంను తప్పనిసరి చేయవు.

కరోనా సమయంలో ఎందుకు సాధ్యమైంది?

కోవిడ్ సమయంలో ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ (2005) , ఎపిడమిక్ డీజీసెస్ యాక్ట్ (1897) వంటి అత్యవసర చట్టాలను ప్రయోగించింది. అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు కంపెనీలకు తప్పనిసరి గా చేయాల్సి వచ్చేది. ప్రస్తుతం అటువంటి అత్యవసర పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వ సూచన కేవలం ఒక "సలహా" గానే పరిగణించబడుతుంది.

కొత్త లేబర్ కోడ్స్.. మినహాయింపులు

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త లేబర్ కోడ్స్‌లో మొదటిసారిగా "వర్క్ ఫ్రమ్ హోమ్" అనే పదాన్ని చేర్చారు. అయితే ఇది కూడా యాజమాన్యం, ఉద్యోగి మధ్య కుదిరే పరస్పర ఒప్పందంపైనే ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయింపులుంటాయి. మాతృత్వ ప్రయోజనాల చట్టం ప్రకారం.. ప్రసవం తర్వాత ఉద్యోగ స్వభావం వీలుంటే, మహిళా ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చే వెసులుబాటు ఉంది. వికలాంగులకు అవసరమైన సౌకర్యాలు కల్పించే క్రమంలో రిమోట్ వర్క్‌ను పరిశీలించవచ్చు.

కంపెనీలు ఎందుకు ఆసక్తి చూపడం లేదు?

ప్రధాని సూచించినా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవడానికే మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణాలున్నాయి. ఆఫీసుల్లో ఉద్యోగుల పనితీరును ప్రత్యక్షంగా పర్యవేక్షించడం సులభం అవుతుంది. ఆఫీస్ నెట్‌వర్క్ వెలుపల సైబర్ భద్రత ప్రమాదాలు ఎక్కువ.. ఉద్యోగుల మధ్య కమ్యూనికేషన్, ఆఫీస్ కల్చర్ దెబ్బతింటాయని సంస్థల భావన. రియల్ ఎస్టేట్ తగ్గుతుంది. ఇప్పటికే భారీగా ఆఫీస్ స్పేస్ కోసం పెట్టిన పెట్టుబడులు వృధా అవుతాయనే ఆందోళన.

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

ప్రస్తుతానికి వర్క్ ఫ్రం హోం అనేది పూర్తిగా కంపెనీల ఇష్టం. అయితే రాబోయే రోజుల్లో కాలుష్యం లేదా ఇంధన సంక్షోభం తీవ్రమైతే ప్రభుత్వం మళ్లీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసే అవకాశం లేకపోలేదు. అప్పటి వరకు చాలా కంపెనీలు "హైబ్రిడ్ మోడల్" వారంలో 2-3 రోజులు ఆఫీస్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.