తెలంగాణ ఎంపీలకు మోడీ క్లాస్.. ఇకనైనా మారతారా?
2014 నుంచి ఇన్నేళ్లలో ఎప్పుడూ బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం అనేది లేదని.. ఇప్పుడు తొలిసారి తాను విన్నానని ఆయన చెప్పారు.
By: Garuda Media | 11 Dec 2025 3:44 PM ISTతెలంగాణ బీజేపీ ఎంపీల పనితీరుపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీరు పనిచేయలేరా? పార్టీని ముందుకు తీసుకువెళ్లలేరా? అంటూ.. వారికి క్లాస్ ఇచ్చారు. తాజాగా గురువారం ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీయే కూటమి ఎంపీలకు.. ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో ఆయన తెలంగాణ ఎంపీలకు సుదీర్ఘ క్లాస్ పీక్ పీకారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దక్కకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు.
2014 నుంచి ఇన్నేళ్లలో ఎప్పుడూ బీజేపీ డిపాజిట్ కూడా దక్కించుకోకపోవడం అనేది లేదని.. ఇప్పుడు తొలిసారి తాను విన్నానని ఆయన చెప్పారు. కలివిడిగా లేకపోతే.. ఏదీ సాధ్యం కాదని.. గత కొన్నాళ్లుగా జరుగుతున్న పరిణామాలను ఆయన ప్రస్తావించారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయిలో ఉన్నామన్న ప్రధాని మోడీ.. అంతర్గత విభేదాలతో పార్టీని నాశనం చేయొద్దని ఒకింత ఘాటుగానే చెప్పుకొచ్చారు. నాయకుల విభేదాలతో పార్టీపై ప్రభావం పడుతోందన్నారు.
''మీరు చేయలేకపోతే.. చెప్పండి. పార్టీలో సంస్కరణలు తీసుకువస్తాం.'' అని హెచ్చరించడం ద్వారా.. నాయకులకు గట్టిగానే మోడీ దిశానిర్దేశం చేసినట్టు అయింది. ఇక, రాజకీయంగా పుంజుకోవాలని.. వచ్చే ఎన్నికలలో విజయం దక్కించుకుని అధికారం చేపట్టే స్థాయికి ఎదగాలని సూచించారు. అవసరమైతే.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ప్రజల మధ్య పార్టీ ఎలా పుంజుకుంటోంది? అనే విషయాలను అధ్యయనం చేయాలని కూడా ప్రధాని సూచించారు.
మార్పు తథ్యం..
ఇప్పటి వరకు తెలంగాణలో పరిణామాలు అందరికీ తెలిసిందే. ఒకరంటే ఒకరికి పడకపోవడం.. ఆధిపత్య రాజకీయాలు వంటివి బీజేపీని ఇరుకున పెట్టాయి. అయితే.. ఇప్పటి వరకు సీనియర్లు జోక్యం చేసుకున్నా పట్టించుకోలేదు. కానీ.. ఇప్పుడు ప్రధాని నేరుగా జోక్యం చేసుకునే సరికి.. పరిస్థితి లో మార్పు స్పష్టంగా వస్తుందని అంటున్నారు పరిశీలకులు. ప్రధాని ఇంతలా జోక్యం చేసుకున్నారంటే.. ఏదో మార్పు జరుగుతుందన్న స్పష్టత వచ్చినట్టేనని కూడా అంటున్నారు.
