మోడీ ఎఫెక్ట్: శ్రీశైలానికి మహర్దశ!
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశైలానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో రాత్రికి రాత్రి సదరు రహదారి పనులను ఆర్ అండ్ బీ శాఖ అధికారులు చేపట్టారు.
By: Garuda Media | 15 Oct 2025 5:26 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ఏపీలో పర్యటించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 2 ప్రాంతాల్లో ఆయన రోజు రోజంతా గడపనున్నారు. ముందుగా శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని దర్శించుకోనున్నారు. అనంతరం కర్నూలులో నిర్వహించనున్న సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ సభకు హాజరు కానున్నారు. ఇక, ప్రధాని రాకనేపథ్యంలో సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న శ్రీశైలం రహదారుల సమస్య పరిష్కారం అవుతుండడం గమనార్హం. ఆత్మకూరు నుంచి దోర్నాల వరకూ రోడ్డు వేయిస్తున్నారు.
కర్నూల్ నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు .. దోర్నాల ఘాట్ రోడ్డు అధ్వానంగా ఉంది. ఇది కొన్ని దశాబ్దాలుగా అలానే ఉంది. పైగా అందులో సింగల్ రోడ్డు ఉంది. రోడ్డు వైడనింగ్ చేయాలని కోరుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదు. పైగా ఇక్కడ ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్గంలో కర్నూలు నుంచి ఆత్మకూరు వరకూ రోడ్డు బాగుంది. కానీ, ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి ప్రకాశం జిల్లా దోర్నాల వరకూ రోడ్డు గుంతలతో అధ్వానంగా తయారైంది.
రోడ్డుకు మరమ్మత్తులు చేసి.. రోడ్డు వైడనింగ్ చేయాలని వాహనదారులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు నుంచి దోర్నాల వరకూ 50 కిలో మీటర్లు ఉందని, ఆ రోడ్డులో ప్రయాణించా లంటే నరకం అనుభవించాల్సిందేనని స్థానికులు కూడా చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయితే.. ఈ మార్గం అటవీ శాఖ పరిధిలో ఉండడంతో పనులు ప్రారంభించలేదు. పర్యావరణ శాఖ నుంచి అనుమతులు తీసుకొని రోడ్డు వైడనింగ్ చేయించాలని అనుకున్నా.. అది కూడా సాకారం కాలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా శ్రీశైలానికి ప్రధాని వస్తున్న నేపథ్యంలో రాత్రికి రాత్రి సదరు రహదారి పనులను ఆర్ అండ్ బీ శాఖ అధికారులు చేపట్టారు. అయితే.. హడావుడిగా చేస్తున్న పనులపైనా ప్రజలు అసంతృ ప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మంత్రి కోసం కాకుండా.. ప్రజల కోసం పనులు చేయాలని వారు చెబుతు న్నారు. కనీసం పాతికేళ్లపాటైనా పనులు నిలిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రస్తుతం పనులు అయితే..సాగుతున్నాయి.
