అర్బన్ నక్సలైట్లు...మోడి పేల్చిన పొలిటికల్ డైనమేట్
ఈ సందర్భంగా పరోక్షంగా అమెరికా దేశాన్ని మోడీ ప్రస్తావిస్తూ ప్రపంచానికి తామే అధిపతులమని భావించే కొన్ని సంపన్న దేశాలు శక్తివంతమైన దేశాలు కూడా అక్రమ వలసదారులను గుర్తించి మరీ వెనక్కి పంపుతున్నాయని అన్నారు.
By: Satya P | 21 Jan 2026 9:03 AM ISTఅర్బన్ నక్సలైట్లు అన్నది ఇప్పటిదాకా ఏదో స్థాయిలో ఉన్న నేతలు అనడమే అంతా చూశారు. కానీ సువిశాలమైన భారత దేశానికి నాయకత్వం వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ వంటి వారి నోటి నుంచి ఈ మాట రావడం నిజంగా షాకింగ్ పరిణామమే అని అంటున్నారు. అంతే కాదు అర్బన్ నక్సలైట్లను అక్రమ వలసదారులను కలిపి మరీ మోడీ తాజాగా విమర్శించారు. ఈ రెండు ఫ్యాక్టర్లు జాతీయ భద్రతకు పెను ముప్పు అని కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. ఒక విధంగా అర్బన్ నక్సలైట్లు గురించి మాట్లాడుతూ పొలిటికల్ గా డైనమేట్ నే పేల్చారు అని అంటున్నారు.
వారితోనే ముప్పు :
దేశంలో అక్రమంగా చొరబడి జనాభా అసమతూల్యతకు ముప్పు తెస్తున్న వారు అక్రమ వలసదారులు అని ప్రధాని అన్నారు. వారు ఎలా దేశంలోకి ప్రవేశించారో అలాగే వెనక్కి తిరిగి పంపించేయాలని ఆయన అన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల మీద కూడా ఆయన తీవ్ర విమర్శలే చేశారు. ఈ తరహా రాజకీయాలు ప్రమాదం అన్నారు, అదే సమయంలో అర్బన్ నక్సలైట్లు గురించి ప్రస్తావించారు వారు సైతం జాతీయ భద్రతకు పెను ముప్పుగా మారారని అన్నారు. ఇలా చెబుతూ ఇవన్నీ దేశం ముందు ఉన్న అతి పెద్ద సవాళ్ళుగా మోడీ అభివర్ణించారు. బీజేపీ నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడుతూ మోడీ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏ దేశమూ అంగీకరించదు :
ఈ సందర్భంగా పరోక్షంగా అమెరికా దేశాన్ని మోడీ ప్రస్తావిస్తూ ప్రపంచానికి తామే అధిపతులమని భావించే కొన్ని సంపన్న దేశాలు శక్తివంతమైన దేశాలు కూడా అక్రమ వలసదారులను గుర్తించి మరీ వెనక్కి పంపుతున్నాయని అన్నారు. వారు ఏమి చేసినా ఆ చర్యలను ఎవరూ ఏమీ అనడం లేదని అన్నారు భారత్ లో మాత్రం తిష్ట వేసుకుని కూర్చున్న అక్రమ వలసదారులను వెనక్కి పంపడం ఏ విధంగా అన్యాయం అవుతుందని ఆయన ప్రశ్నించరు. పేదలకు దేశ ప్రజలకు దక్కాల్సిన అన్ని రకాల సదుపాయాలను దోచుకోవడం తగునా అని నిలదీశారు. దీనిని భారత్ ఎప్పటికీ అనుమతించదని ఆయన స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే అక్రమ వలసదారులకు మద్దతు పలుకుతున్నాయని ఆయన విమర్శించారు.
అర్బన్ నక్సలైట్లు ప్రమాదం :
ఈ రోజున అతి పెద్ద సవాల్ గా ఉన్నది అర్బన్ నక్సలైట్లు అని ఆయన చెప్పుకొచ్చారు వీరంతా ప్రపంచవ్యాప్తంగానూ తమ ప్రభావాన్ని విస్తరిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ గురించి ఎవరు మంచిగా రాసినా పొగిడినా వీరు తట్టుకోలేకపోతున్నారు అని ఆయన అన్నారు వారిని వేధిస్తున్నారని అన్నారు. అర్బన్ నక్సలైట్లు శైలి ఏమిటి అంటే బీజేపీని అంటరాని పార్టీగా చూడడం, ఏకాకిగా చేయడం అని ఆయన ఫైర్ అయ్యారు, కానీ వారి ఎత్తులు పారడం లేదని దేశం అన్నీ గమనిస్తోంది అని మోడీ అన్నారు. దేశానికి హాని చేయడానికే అర్బన్ నక్సలైట్లు నిరంతరం పనిచేస్తున్నారని మోడీ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. బీజేపీ తన సంస్థాగతమైన బలంతో పాటు ఫిలాసఫీ ద్వారానే అర్బన్ నక్సలైట్లు ఫిలాసఫీని ఓడించాలని ఆయన చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ హాట్ కామెంట్స్ :
ఇదిలా ఉంటే అర్బన్ నక్సలైట్లు అంటూ మోడీ విమర్శించడాన్ని కాంగ్రెస్ తప్పు పట్టింది. హోం శాఖ సైతం అర్బన్ నక్సలైట్లు అన్న పదం ఎక్కడా వాడదని పార్లమెంట్ లో కేంద్రం ఇచ్చిన సమాధానంలో అదే ఉంటుందని చెప్పింది. కానీ మోడీ మాత్రం అర్బన్ నక్సలైట్లు అని విమర్శలు చేస్తున్నారని మోడీని వ్యతిరేకిస్తే అర్బన్ నక్సలైట్లు అయిపోతారా అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సామాజిక మాధ్యమం ద్వారా ప్రశ్నించారు. మొత్తానికి అర్బన్ నక్సలైట్లు అంటూ మోడీ చేసిన ఈ కామెంట్స్ రాజకీయ చర్చకు ఆస్కారం ఇస్తున్నాయి. కాంగ్రెస్ అయితే గట్టిగానే విమర్శిస్తోంది.
