వందేమాతరానికి 150 ఏళ్లు: దేశవ్యాప్తంగా ఘనోత్సవాలు
భారత స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గేయం 'వందేమాతరం' రచించి నేటితో సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయింది.
By: A.N.Kumar | 7 Nov 2025 11:53 AM ISTభారత స్వాతంత్య్రోద్యమానికి స్ఫూర్తినిచ్చిన జాతీయ గేయం 'వందేమాతరం' రచించి నేటితో సరిగ్గా 150 సంవత్సరాలు పూర్తయింది. ఈ చారిత్రక ఘట్టాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా ఏడాది పొడవునా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఢిల్లీలో ప్రధాని చేతుల మీదుగా ఆరంభం
దిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'వందేమాతరం' 150వ స్మారకోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన స్మారక స్టాంపు (తపాలా బిళ్ల) , ప్రత్యేక నాణెంను విడుదల చేయడంతో పాటు, వందేమాతరం గేయం ఆధారంగా రూపొందించిన డాక్యుమెంటరీని కూడా ఆవిష్కరించారు.
ఈ వేడుకల్లో కేంద్ర మంత్రులు, అధికారులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, వందేమాతరం కేవలం పాట కాదని, ఇది భారతీయుల ఐక్యత, దేశభక్తి, మరియు మాతృదేశం పట్ల గౌరవానికి ప్రతీక అని ఉద్ఘాటించారు. ఈ గేయం స్ఫూర్తిని కొత్త తరాలకు తీసుకెళ్లడమే ఈ ఉత్సవాల ప్రధాన లక్ష్యమన్నారు.
* సామూహిక వందేమాతర గీతాలాపన
వేడుకల్లో భాగంగా, దేశవ్యాప్తంగా సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించే కార్యక్రమం ఉదయం 9:50 గంటలకు నిర్వహించబడింది. దేశమంతటా విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, పోలీసు అధికారులు, వైద్యసిబ్బంది సహా అన్ని వర్గాల ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఒకేసారి నిలబడి ఈ జాతీయ గేయాన్ని ఆలపించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్ర ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో సామూహిక గీతాలాపనకు సమగ్ర ఏర్పాట్లు చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్ కె.రామకృష్ణారావు, తెలంగాణలో రాష్ట్ర నోడల్ అధికారి ఆర్. మల్లికార్జునరావు ఈ కార్యక్రమ విజయవంతానికి కృషి చేశారు.
* చరిత్రలో వందేమాతరం ప్రాముఖ్యత
'వందేమాతరం' గేయాన్ని బంకిమ్‌చంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న (అక్షయ నవమి పర్వదినం) రచించారు. ఇది మొదట ఆయన ప్రసిద్ధ బెంగాలీ నవల 'ఆనంద్ మఠ్' లో భాగంగా 1882లో ప్రచురించబడింది. ఈ గేయం భారత స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రణన్నినాదంగా నిలిచింది, కోట్లాది భారతీయులలో దేశభక్తి జ్వాలలను రేకెత్తించింది. బిపిన్ చంద్ర పాల్, అరవిందఘోష్ వంటి ఎందరో నేతలు దీన్ని తమ పోరాట నినాదంగా మార్చుకున్నారు.
జాతీయ గేయంగా గుర్తింపు
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950 జనవరి 24న రాజ్యాంగ సభ ఈ గేయాన్ని జాతీయ గీతం 'జనగణమన'తో సమానంగా గౌరవిస్తూ 'జాతీయ గేయం'గా అధికారికంగా గుర్తించింది. బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్‌లో, వందేమాతరం ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాలలో రెండో స్థానాన్ని దక్కించుకోవడం విశేషం.
ఈ వేడుకలు కేవలం ఒక రోజుతో ముగియకుండా, 2026 నవంబర్ 7 వరకు ఏడాది పొడవునా కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి వివిధ పోటీలు, ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
