తమిళనాడు ప్రచారంలో ప్రధాని మోదీ కొత్త లుక్.. నెట్టింట హాట్ డిబేట్
ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రధాని మోదీ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. తమిళ ప్రజలు చామన ఛాయలో ఉంటారన్న విషయం తెలిసిందే.
By: Tupaki Political Desk | 21 April 2026 12:44 PM ISTతమిళనాడు ఎన్నికల్లో ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. హోరాహోరీగా సాగుతున్న పోరులో అధికారం దక్కించుకోడానికి పార్టీలు రకరకాల రీతులలో ప్రచారం చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకోవడమే ప్రధాన అజెండాగా సాగుతున్న ప్రచారంలో ప్రధాని మోదీకి చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తమిళనాడు ఎన్నికల దృష్టిలో పెట్టుకుని మోదీ కొత్త లుక్ లో కనిపించేందుకు తన స్కిన్ టోన్ మార్చుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రధాని మోదీ మద్దతుదారుల మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ప్రధాని మోదీ వీడియో చుట్టూ చర్చ ఆసక్తి రేపుతోంది.
తమిళనాడు ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ చామనఛాయలో కనిపిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సహజంగా మేలివర్ణంలో దగదగ మెరిసిపోయే ప్రధాని మోదీ ఇలా రంగు మారినట్లు కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళనాడు ఓటర్లను ఆకట్టుకోవాడానికే ప్రధాని మోదీ తన స్కిన్ టోన్ మార్చుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ప్రధాని భిన్నమైన ప్రచార వ్యూహంతో పనిచేస్తుంటారని, ఇందుకు కొన్ని ఉదాహరణలు చూపుతున్నారు.
ప్రధాని మోదీ ఎక్కడికి వెళ్లిన అక్కడి సంప్రదాయాలను గౌరవించేలా వ్యవహరిస్తారని అంటున్నారు. దేశంలో భిన్న ప్రాంతాల సంప్రదాయలు, కట్టుబాట్లను అలవర్చుకుని ఆయా ప్రజలకు దగ్గరగా ఉన్నానని, తాను వారిలో ఒకరని నమ్మకాన్ని కల్పించేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తారని చెబుతున్నారు. ఇందుకు గతంలో ప్రధాని మోదీ వ్యవహరించిన ప్రచార వ్యూహాలను గుర్తు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల సమయంలో అక్కడి సంప్రదాయ వస్త్రాలను ధరించి ప్రచారం చేసిన ప్రధాని మోదీ, పశ్చిమబెంగాల్ ఓటర్లను ఆకట్టుకునేందుకు రవీంద్రనాథ్ ఠాగూర్ మాదిరిగా పొడవాటి గెడ్డం పెంచుకుని ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న విషయాన్ని ఎత్తిచూపుతున్నారు.
ఇప్పుడు తమిళనాడులో కూడా ప్రధాని మోదీ అదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. తమిళ ప్రజలు చామన ఛాయలో ఉంటారన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ద్రవిడ ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రధాని మోదీ డార్కర్ టోన్ మేకప్ లేదా బ్రాంజర్ ద్వారా తన మేలి వర్ణాన్ని చామన ఛాయగా మార్చుకుని ఎన్నికల ప్రచారానికి వచ్చారని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘తమిళనాడు మేకోవర్’’ కోసం ప్రధాని ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మరికొందరు నెటిజన్లు ఈ వాదనను తిరస్కరిస్తున్నారు.
ప్రధాని రూపు రేఖలలో కనిపిస్తున్న తేడాకు ఎండ, కెమెరా లైటింగ్ తేడా కావొచ్చనని విశ్లేషిస్తున్నారు. తీవ్ర సూర్య రశ్మి, కెమెరా ఎక్స్ పోజర్ లేదా పోస్ట్ ప్రాసెసింగ్ ప్రభావాల వల్ల ప్రధాని చామనఛాయలో కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. వేసవి కాలం కావడం, ఎండలు కూడా తీవ్రంగా ఉండటం వల్ల ప్రధాని చర్మం కూడా ప్రభావితమై ఉండవచ్చునని అంటున్నారు. దీంతో ప్రధాని మోదీ స్కిన్ రంగుపై నెట్టింట చర్చ హాట్ టాపిక్ అవుతోంది. కాగా, ఇలాంటి చర్చలు గమనిస్తే తమిళనాడు ఎన్నికలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో అర్థమవుతోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
