మోడీ స్వదేశీ మంత్రం...చదవాలంటే ?
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. స్వదేశీ మంత్రం ప్రతీ భారతీయుని ప్రాథమిక కర్తవ్యం కావాలని కోరారు.
By: Satya P | 22 Sept 2025 7:00 AM ISTబీజేపీ చాలా కాలంగా స్వదేశీ నినాదం అందుకుంటూ అది ఒక ప్రచారంగా చేస్తూ వస్తోంది. అయితే విదేశీ వస్తువులు మాత్రం దేశంలో ఇబ్బడి ముబ్బడిగా అమ్ముడవుతున్నాయి. విదేశీ మోజు మాత్రం జనాలలో అలాగే ఉంది. ఇపుడు చూస్తే అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయి. మనం ఎగుమతి చేసే వస్తువుల మీద భారీ సుంకాలు అమెరికా పెద్దన్న వేస్తున్నారు. అంతే కాదు అసహజంగా అసాధారణమైన రీతిలో అమెరికా సుంకాలు విధించింది. దీంతో ఇపుడు మరింత బిగ్గరగా బీజేపీ స్వదేశీ మంత్రం పఠిస్తోంది.
మోడీ పిలుపు :
ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. స్వదేశీ మంత్రం ప్రతీ భారతీయుని ప్రాథమిక కర్తవ్యం కావాలని కోరారు. అంతే కాదు స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని అందరూ స్వదేశీ వస్తువులనే పిలుపు ఇచ్చారు. ఈ రోజున చూస్తే భారత్ లోకి అనేక విదేశీ వస్తువులు వచ్చాయని మోడీ చెప్పారు. వాటిని పక్కన పెట్టి దేశీయ ఉత్పాదనలకు పెద్ద పీట వేయాలని కోరారు.
మేడ్ ఇన్ ఇండియాతో :
ఇక మీదట భారతీయ ప్రజానీకం మేడ్ ఇన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ని డెవలప్ చేసుకోవాలని ప్రధానమంత్రి కోరారు. భారత దేశం అన్ని విధాలుగా సమృద్ధిగా ఉండాలంటే దేశీయ ఉత్పత్తులే వాడాలని ఆయన అన్నారు. ఇక మీదట అంతా స్వదేశీ వస్తువులు కొంటామని గర్వంగా చెప్పుకోవాలని మోడీ అన్నారు. స్వదేశీ అభియాన్‌లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలు స్థానిక ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ సాధ్యమని ఆయన అన్నారు.
విదేశీ వినియోగానికి చెక్ :
దేశంలో భారతీయులు తయారు చేసే అలాగే స్థానికంగా ఉత్పత్తి చేసే వస్తువులని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రతిన పూనాలని అపుడే దేశ గౌరవాన్ని పెంచుతాయని మోడీ అన్నారు. ఈ విధంగా ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని దేశ ప్రజలంతా స్వదేశీ మంత్రం పాటించాలని ఆయన అన్నారు. ఇక మీదట విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని మోడీ గట్టిగా చెప్పారు. ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ప్రసంగిస్తారు. ఇపుడు అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు భారత్ ఎదుర్కొంటోంది కాబట్టి మోడీ జనంతో నేరుగా మాట్లాడి సందేశం ఇచ్చారు. అయితే ఈ సందేశాన్ని జనాలు పాటించాలి అంటే పాలకులు తమ వంతుగా తగినంత ప్రోత్సాహం అందించాలని అంతా కోరుతున్నారు.
మంత్రాలకు జరిగేనా :
అయితే మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నది ఒక పాత సామెతగా ఉంది. అలాగే ఇపుడు ప్రమాదం ముంచుకు వచ్చిన వేళ ఈ మంత్రం పఠిస్తే పులి లాంటి కష్టాలు కష్టాలు తగ్గుతాయా అన్నది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వదేశీ అభిమానం స్వావలంబన అన్నది ఏ దేశానికి అయినా ప్రధమ కర్తవ్యంగా ఉండాలి. తన దేశాన్ని ముందు అన్న నైతికతతో పాటు ఏమి మేలు చేసినా దేశం కోసం ఎంతో కొంత పనికి వచ్చేలా చేయాలి అన్న తపన ఉండాలి. అయితే దానిని ఎంత వరకూ పౌరుల మదిలో పాదుకొన్నది అన్నది ఒక ప్రశ్న అయితే అలాంటి వాతావరణం గతంలో ఎంతమేరకు ఉంచారు అన్నది కూడా మరో వైపు వస్తున్న ప్రశ్న.
ప్రతీకార సుంకాలతో :
ఈ రోజున విదేశీ వస్తువుల మీద మోజు ప్రేమ సగటు భారతీయ పౌరుడికి ఎందుకు అంటే ఆ దేశం నచ్చి ఏ మాత్రం కాదు, అక్కడ వస్తువులు చౌకగా నాణ్యతతో ఇస్తున్న్నారు అన్న ఒకే ఒక ఆలోచనతో. అంటే తమకు తక్కువ ధరలకు మంచి వస్తువులు వస్తే కచ్చితంగా మెజారిటీ వినియోగదారులు ఆ వైపు మళ్ళుతారు. దానికి స్వదీశీ మంత్రం అని పేరు పెట్టుకున్నా తప్పు లేదు. ఇక దేశంలోకి విచ్చలవిడిగా ఎంట్రీ ఇస్తున్న విదేశీ వస్తువుల మీద సుంఖాలు పెంచాలి ప్రతీకార సుంకాలు వేయాలి. అదే సమయంలో దేశంలో ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు ప్రోత్సాహం ఆర్ధికంగా ఇవ్వాలి, అంతే కాదు నాణ్యతా ప్రమాణాలు బాగా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
