Begin typing your search above and press return to search.

సేషెల్స్ టూర్.. ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న జంతువును కలవనున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం హిందూ మహాసముద్రంలోని కీలక ద్వీప దేశమైన సేషెల్స్‌కు బయలుదేరారు.

By:  A.N.Kumar   |   27 Jun 2026 12:53 PM IST
సేషెల్స్ టూర్.. ప్రపంచంలోనే అతిపెద్ద వయసున్న జంతువును కలవనున్న మోదీ
X

భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు రోజుల అధికారిక పర్యటన కోసం హిందూ మహాసముద్రంలోని కీలక ద్వీప దేశమైన సేషెల్స్‌కు బయలుదేరారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యత ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతంలో పరస్పర సహకారాన్ని విస్తరించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. ప్రత్యేకించి సేషెల్స్ స్వాతంత్ర్యానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న 'నేషనల్ డే గోల్డెన్ జూబ్లీ' వేడుకల్లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొననుండటం విశేషం.

వ్యూహాత్మక బంధం.. చైనాకు చెక్

పర్యటనలో భాగంగా సేషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సముద్ర భద్రత, వాణిజ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, బ్లూ ఎకానమీ సముద్ర వనరుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటి కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ తన వ్యూహాత్మక భాగస్వామి అయిన సేషెల్స్‌తో బంధాన్ని మరింత గట్టి పరుచుకోవడం ఈ పర్యటనలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రక్షణ, పెట్టుబడుల పరంగా ఇరు దేశాల మధ్య కొత్త ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.

ప్రత్యేక ఆకర్షణగా 194 ఏళ్ల ‘జోనాథన్’

ఈ అధికారిక పర్యటనలో రాజకీయ అంశాలతో పాటు ఒక అద్భుతమైన, ఆసక్తికరమైన ఘట్టం చోటు చేసుకోనుంది. ప్రపంచంలోనే అత్యంత వయసున్న జీవిగా గుర్తింపు పొందిన ‘జోనాథన్’ అనే భారీ తాబేలును ప్రధాని మోదీ సందర్శించనున్నారు.

జోనాథన్ ప్రత్యేకతలు

దీని వయసు దాదాపు 194 సంవత్సరాలు... ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ జంతువుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. శతాబ్దాల చరిత్రకు, ఎన్నో తరాల మార్పులకు సాక్షిగా నిలిచిన ఈ తాబేలు ప్రకృతి సంరక్షణకు ఒక సజీవ ప్రతీక. ఈ అరుదైన తాబేలును చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రధాని మోదీ దీన్ని సందర్శించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణకు భారత్ ఇస్తున్న ప్రాధాన్యతను ప్రపంచానికి చాటిచెప్పినట్లవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.

11 ఏళ్ల తర్వాత రెండోసారి..

ప్రధాని మోదీకి సేషెల్స్‌లో ఇది మొదటి పర్యటన కాదు. గతంలో 2015లో ఆయన ఈ ద్వీప దేశాన్ని సందర్శించి పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దాదాపు పదకొండు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన మరోసారి సేషెల్స్‌ అడుగుపెడుతుండటం.. ఇరు దేశాల మధ్య ఉన్న నిరంతర సన్నిహిత సంబంధాలకు అద్దం పడుతోంది.

ఈ పర్యటన కేవలం దౌత్యపరమైన బంధాలకే పరిమితం కాకుండా, సాంస్కృతిక సత్సంబంధాలను పెంపొందించడానికి.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ వ్యూహాత్మక స్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి ఎంతగానో దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.