Begin typing your search above and press return to search.

షాకింగ్... సెక్యూరిటీ కళ్లు గప్పి ప్రధానిని కలిసిన వ్యక్తి ఎవరు?

ఆయనను ఎవరు స్వాగతించాలి, ఆయనతో ఎవరు మాట్లాడాలి, ఆయనను ఎవరెవరు కలవాలి అనేవి అన్నీ పక్కాగా ప్లాన్ చేసి ఉంటారు. నిత్యం భద్రతాసిబ్బంది అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

By:  Raja Ch   |   22 Oct 2025 9:44 PM IST
షాకింగ్... సెక్యూరిటీ కళ్లు గప్పి ప్రధానిని కలిసిన వ్యక్తి ఎవరు?
X

ప్రధాన మంత్రి ఏదైనా ప్రాంతంలో పర్యటిస్తున్నారంటే.. ఆ ప్రాంతంలో విమానం దిగినప్పటి నుంచి, తిరిగి హస్తినకు బయలుదేరేవరకూ కట్టుదిట్టమైన భద్రతా వలయం ఆయన చుట్టూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆయనను ఎవరు స్వాగతించాలి, ఆయనతో ఎవరు మాట్లాడాలి, ఆయనను ఎవరెవరు కలవాలి అనేవి అన్నీ పక్కాగా ప్లాన్ చేసి ఉంటారు. నిత్యం భద్రతాసిబ్బంది అన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తారు.

అనుమతి లేకుండా ఈగ కూడా ఆయనకు సమీపంగా రాని స్థాయిలో అన్నట్లుగా ప్రధాన మంత్రి సెక్యూరిటీ ఉంటుంది. ఈ క్రమంలో... మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే... రాష్ట్ర పోలీసులు, ఎన్.ఎస్.జీ. కమేండోలు, స్పెషల్ భద్రతా సిబ్బంది మొదలైన వారిని దాటి ఓ వ్యక్తి ప్రధానిని కలిసిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!

అవును... అక్టోబర్ 16న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లాలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఉన్నత స్థాయి పర్యటన సందర్భంగా పూర్తి భద్రత కల్పించడానికి సుమారు 7,300 మంది పోలీసు సిబ్బందిని మొహరించినట్లు ఎస్పీ తెలిపారు! అయితే ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి ఏదో విధంగా భద్రతా బృందాన్ని మోసగించి ప్రధానమంత్రిని కలిశారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం గా మారింది.

అసలు ప్రధానమంత్రిని కలవడానికి ఆ వ్యక్తి జాబితాలో లేడని, అతను మరొక వ్యక్తి ఐడి కార్డును ఉపయోగించి మోడీని కలవడానికి వెళ్ళాడని అంటున్నారు. ఆ వ్యక్తి గుర్తింపు ఐడి కార్డుతో సరిపోలడం లేదని తరువాత తేలిందని తెలుస్తోంది. దీంతో.. సంబంధిత భద్రతా దళాలు ఇటీవల కర్నూలుకు వచ్చి, అక్కడ ప్రధానిని అక్రమంగా కలిసిన ఈ వ్యక్తి వివరాలను సేకరించినట్లు సమాచారం!

ఈ విధంగా అనధికారికంగా ప్రధాని ప్రధాని సెక్యూరిటీ కళ్లుగప్పి ఇతరుల ఐడీతో ఆయనను కలిసిన వ్యక్తి ఆదోనికి చెందిన ఓ బీజేపీ నాయకుడు అని ప్రచారం జరుగుతోంది. తర్వాత ఆ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో చర్చ మొదలైందని అంటున్నారు. ప్రధానిని కలిసే వారి జాబితాలో సదరు నాయకుడి పేరు లేకపోయినా ఎలా కలిశారని ఆరా తీస్తున్నారు!

గతంలో కర్ణాటకలో ఓ సారి ఇలాగే...!:

గతంలో 26వ జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవానికి కర్ణాటక పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. హుబ్బళ్లిలో రోడ్‌ షో సందర్భంగా పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే! ఇందులో భాగంగా... ప్రధాని మోడీకి దండ వేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక యువకుడు ఆయన భద్రతా కవర్‌ ను దాటవేసాడు. అనంతరం అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది అతన్ని వెనక్కి లాగారు!