Begin typing your search above and press return to search.

రేవంత్ నాతో కలువు.. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఓపెన్ ఆఫర్

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికర సన్నివేశాలకు వేదిక అయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ తన పక్కనే కూర్చొపెట్టుకోవడం నెటిజన్లను ఆకర్షించింది.

By:  Tupaki Political Desk   |   10 May 2026 7:32 PM IST
రేవంత్ నాతో కలువు.. కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ ఓపెన్ ఆఫర్
X

ప్రధాని నరేంద్రమోదీ తెలంగాణ పర్యటన ఆసక్తికర సన్నివేశాలకు వేదిక అయింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రధాని మోదీ తన పక్కనే కూర్చొపెట్టుకోవడం నెటిజన్లను ఆకర్షించింది. ఇద్దరు నేతలు చక్కగా మాట్లాడుకోవడమే కాకుండా, పరస్పర గౌరవంతో మసులుకోవడం, హాయిగా నవ్వుకోవడం గమనిస్తే కాంగ్రెస్ నేతతో ప్రధాని మోదీ ఎప్పుడూ ఇలా నడుచుకోలేదని, అలాంటి అరుదైన దృశ్యం హైదరాబాద్ లో ఆవిష్కృతమైందని వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ప్రధాని మోదీ హెచ్ఐసీసీలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తమతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఓ కాంగ్రెస్ నేతను ప్రోత్సహిస్తున్నట్లు ప్రధాని ప్రసంగించడం సభికులను అబ్బురపరిచింది. ప్రధాని కంటే ముందుగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాజకీయాలు మాట్లాడనని స్పష్టం చేశారు. ఆ తర్వాత తన ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను ప్రస్తావించిన ప్రధాని మోదీ తాను కూడా రాజకీయాలు మాట్లాడనని చమత్కరించారు.

ఇలా ఉత్సాహంగా సాగిన సభలో అభివృద్ధి కార్యక్రమాల్లో తమతో కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. అభివృద్ధిలో తెలంగాణ చేరాల్సిన చోటుకి చేరలేదని ప్రధాని అభిప్రాయపడ్డారు. తన సొంత రాష్ట్రం గుజరాత్ కంటే ఎక్కువగా తెలంగాణకు నిధులు కేటాయిస్తున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. యూపీఏ హయాంలో గుజరాత్ కు ఎన్ని నిధులు ఇచ్చారో ఇప్పుడు తెలంగాణకు అంతే నిధులు ఇస్తే సరిపోతాయా? అంటూ ప్రధాని మోదీ ప్రశ్నించారు. అలా చేస్తే తెలంగాణకు కేటాయిస్తున్న నిధులలో సగం కోత పడుతుందని వ్యాఖ్యానించారు.

తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రధాని వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో ఉద్యోగ కల్పన జరుగుతుందని ప్రధాని ఉద్ఘాటించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ ఎన్నో రెట్లు పెరిగిందని వెల్లడించారు. 2014లో ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ రూ.వెయ్యి కోట్లు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. తమ ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి లక్షల కోట్లు వెచ్చిస్తోందని, తెలంగాణ కూడా ఇందులో ఎక్కువ లబ్ధి పొందుతోందని ప్రధాని మోదీ వివరించారు.

కాగా, ప్రధాని మోదీ సభ విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధాని మోదీ పక్కనే కూర్చోపెట్టుకోవడమే కాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలగడం సభికులను కట్టిపడేసింది. ఇద్దరు నేతలు నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోలను వైరల్ చేస్తున్న నెటిజన్లు పలు ఆకర్షణీయమైన కామెంట్లు చేస్తున్నారు.