ఆందోళనల మధ్య మోదీ సంచలన ప్రకటన..
దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ గందరగోళం రాజకీయాన్ని ఊపేస్తున్న వేళ మన లీడర్ల నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ ప్రకటన వచ్చేసింది.
By: A.N.Kumar | 23 July 2026 10:35 AM ISTదేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ గందరగోళం రాజకీయాన్ని ఊపేస్తున్న వేళ మన లీడర్ల నుంచి ఒక మైండ్ బ్లోయింగ్ ప్రకటన వచ్చేసింది. పరీక్షల పేపర్లు ప్రింట్ అయ్యే లోపే లీక్ అయిపోయి రోడ్డున పడ్డ లక్షలాది మంది విద్యార్థుల కష్టాలను చూసి చలించిపోయిన పెద్దలు.. సమస్యకు అసలు కారణమైన సిస్టమ్‌ను బాగుచేయడం పక్కన పెట్టి "ఫాస్ట్ ట్రాక్ కోర్టులు" అనే సరికొత్త మెరుపు ఆలోచనను జనాల్లోకి వదిలారు. సమస్యేమో ఎగ్జామ్ హోల్‌లో ఉంటే పరిష్కారాన్ని మాత్రం కోర్టు బోనులో వెతుకుతున్న ఈ అద్భుతమైన ఐడియాపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆనందబాష్పాలు రాలుస్తున్నారు.
డ్రామాల నడుమ "సెటైరికల్" సీన్లు..
ఇకపై లీకేజీలు చేసిన వారిని వదిలిపెట్టేది లేదు అని ప్రభుత్వం శపథం చేస్తోంది. అంటే.. "మేము పేపర్లు లీక్ అవ్వకుండా చూడలేం గానీ, లీక్ అయ్యాక మిమ్మల్ని ఫాస్ట్ ట్రాక్‌లో విచారిస్తాం" అని ఇన్ డైరెక్ట్‌గా డిక్లేర్ చేశారన్నమాట! భలే కిటుకు కదా? మరోవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్షాలు, 'కాక్రోచ్ జనతా పార్టీ' రేపిన ఆందోళనల ధాటికి విద్యాశాఖ మంత్రి కుర్చీ కాస్త కదిలినంత పనైంది. "రాజీనామా చెయ్యండి సామీ" అని విద్యార్థులు మొత్తుకుంటుంటే "ముందు కోర్టు డిసైడ్ చేయనివ్వండి" అంటూ సమయం దాటేసే కళలో ముందడుగు వేశారు.
సోషల్ మీడియాలో వార్ఫేర్
"యువతే మా ప్రాణం" అని ఒకరు ట్వీట్ చేస్తే, "వ్యవస్థను నిర్వీర్యం చేసి ఇప్పుడు ఉపన్యాసాలా?" అని రాహుల్ గాంధీ కౌంటర్ ఎక్స్ పోస్ట్ పడేశారు. నాయకులందరూ ట్విట్టర్‌లోనే దేశాన్ని బాగుచేసే పనిలో బిజీగా ఉన్నారు.
మెట్రో బంద్.. బారికేడ్ల సందడి
పరీక్షా కేంద్రాల్లో ప్రశాంతత ఉండాలో లేదో తెలీదు కానీ రాజధాని ఢిల్లీలోని 16 మెట్రో స్టేషన్లు మాత్రం ప్రశాంతంగా మూతపడ్డాయి. విద్యార్థులు, నిరసనకారులు రోడ్డెక్కకుండా పోలీసులు వేసిన బారికేడ్లు చూస్తే.. నీట్ ఎగ్జామ్ కంటే ఈ బారికేడ్ల సెటప్పే చాలా పటిష్టంగా ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఆలోచించాల్సిన విషయమేంటంటే
పేపర్ లీక్ అయిన ప్రతిసారీ ఒక కొత్త కమిటీ, ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రకటన రావడం ఆనవాయితీగా మారింది. కానీ అసలు పేపర్ లీక్ కాకుండా ఉండే బలమైన డిజిటల్ లేదా సెక్యూర్ సిస్టమ్ ఎప్పుడు వస్తుందో ఆ దేవుడికే ఎరుక..
మొత్తానికి విద్యార్థులు మాత్రం భవిష్యత్తు కోసం పుస్తకాలు పట్టుకోవాలా లేక నిరసన బెనర్లు పట్టుకోవాలా అని కన్ఫ్యూజన్‌లో ఉంటే ప్రభుత్వం మాత్రం "ఫాస్ట్ ట్రాక్" బోర్డు తగిలించి చేతులు దులుపుకునే పనిలో ఉంది.
