Begin typing your search above and press return to search.

ఒకే వేదిక‌ను పంచుకున్న‌ మోడీ-రాహుల్‌.. విషయం ఇదీ!

రాజ‌కీయంగా క‌స్సు-బుస్సు మ‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీలు ఒకే వేదిక‌ను పంచుకున్నారు.

By:  Garuda Media   |   26 Nov 2025 4:34 PM IST
ఒకే వేదిక‌ను పంచుకున్న‌ మోడీ-రాహుల్‌.. విషయం ఇదీ!
X

రాజ‌కీయంగా క‌స్సు-బుస్సు మ‌నే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీలు ఒకే వేదిక‌ను పంచుకున్నారు. ఇది నిజం!. రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని పాత పార్ల‌మెంటు సెంట్ర‌ల్ హాల్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక‌ కార్య‌క్ర‌మం దీనికి వేదిక అయింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్రపతి ద్రౌప‌దిముర్ముతోపాటు ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ప్రధాని న‌రేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు ఒకే వ‌రుస‌లో కూర్చున్నారు. వీరితో పాటు రాజ్య‌స‌భ‌లో విప‌క్ష నాయ‌కుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము తెలుగు, తమిళం, మలయాళం స‌హా 9 భాషల్లో ఉన్న రాజ్యాంగ ప్రతులను డిజిటల్‌గా ఆవిష్కరించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర‌ప‌తి మాట్లాడుతూ.. రాజ్యాంగం మ‌న‌కు క‌ర్త‌వ్య బోధ చేస్తోంద‌ని, మ‌న ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌కు రాజ్యాంగ‌మే మూలస్తంభ‌మ‌ని ఉద్ఘాటించారు. ప్ర‌జ‌ల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హ‌క్కుల‌ను రాజ్యాంగం ప్ర‌సాదించింద‌ని తెలిపారు. సామాజిక న్యాయానికి రాజ్యాంగం పెద్ద‌పీట వేసింద‌ని.. దీనివ‌ల్లే ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్ ల‌భించింద‌ని పేర్కొన్నారు.

ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్ మాట్లాడుతూ.. ప్ర‌జాస్వామ్యానికి భార‌త్ త‌ల్లివంటిద‌ని పేర్కొన్నారు. రాజ్యాంగ ర‌చ‌న‌లో ఎంద‌రో మ‌హానుభావులు భాగ‌స్వాములు అయ్యార‌ని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ప్ర‌తి పేజీలోనూ వారి దూర‌దృష్టి గోచ‌ర‌మ‌వుతుంద‌ని తెలిపారు. 1949లో ఇదే రోజు.. రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నామ‌ని పేర్కొన్నారు. కాగా, ప్ర‌స్తుతం భార‌త్ నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింద‌ని, త్వ‌ర‌లోనే మూడో ఆర్థిక వ్య‌వ‌స్థగా అవ‌త‌రించ‌నుంద‌ని తెలిపారు.

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళ‌ల సంఖ్య పెర‌గ‌డం శుభ‌సూచ‌క‌మ‌ని ఉప‌రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్‌ పేర్కొన్నారు. అనంత‌రం.. రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, స్పీక‌ర్ ఓం బిర్లా స‌హా అంద‌రూ సామూహికంగా రాజ్యాంగ పీఠిక‌ను చ‌దివారు.వీరితో పాటు రాహ‌ల్‌గాంధీ, ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున ఖ‌ర్గే కూడా పీఠిక చ‌దివారు.