రాహుల్‌కాదు.. ప్రియాంకతో మోడీ ముచ్చట్లు.. రీజనేంటి?
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. ఉభయ సభలు రెండూ నిరవధికంగా వాయిదా పడ్డాయి.
By: Garuda Media | 20 Dec 2025 12:11 AM ISTకాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని పక్కన పెట్టేసిన ప్రధాని మోడీ.. ఆయన సోదరి, కేరళకు చెందిన వైనాడ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా విజయం దక్కించుకున్న ప్రియాంకగాంధీతో సుమారు 40 నిమిషాలకు పైగాముచ్చటించడం.. జాతీయ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. వాస్తవానికి ప్రియాంక గాంధీ కేవలం ఎంపీ మాత్రమే. ఆమె కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా.. ఆ పార్టీలో కానీ, లోక్‌సభలో కానీ.. ఆమెకు ప్రత్యేకంగా పెద్దపదవులు ఏమీ లేవు. అలాంటప్పుడు.. మోడీ.. ఆమెతో ప్రత్యేకంగా 40 నిమిషాలపాటు ముచ్చటించడం..(అందరి సమక్షంలోనే) ఏంటన్నది ఆసక్తిని రేపింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు శుక్రవారం సాయంత్రంతో ముగిశాయి. ఉభయ సభలు రెండూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈనేపథ్యాన్ని పురస్కరించుకుని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా.. పలువురు ఎంపీలకు.. సభలో నాయకులకు తేనీటి (చాయ్) విందు ఇచ్చారు. ఈ విందుకు రాహుల్‌గాంధీని ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించారా ? లేదా? అనేది తెలియదు.ఆయన కూడా ఈ కార్యక్రమానికి రాలేదు. ఇక, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఏఐసీసీ చీఫ్, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే కూడా ఈ తేనీటి విందులో కనిపించలేదు. కానీ.. ప్రధానికి ఎదురుగా.. ఓ పక్కగా.. మాత్రం ప్రియాంక గాంధీ కూర్చున్నారు. ఆమె కాలిపై కాలు వేసుకుని.. చాయ్ తాగుతూ.. ప్రధానితో ముచ్చటించారు.
ప్రియాంక గాంధీ పక్కన వేరే కుర్చీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఒకే సోఫాలో స్పీకర్ ఓంబిర్లా, ఆయన పక్కన ప్రధాని మోడీ కూర్చున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ-ప్రియాంకల మధ్య మాటలు కలిశాయి. వయనాడ్ నియోజకవర్గం విశేషాలేంటని మోడీ ఆమెను ప్రశ్నించగా.. తన నియోజకవర్గంలో అటవీ సంపద ఎంతో ఉందని.. ముఖ్యంగా వనమూలికలకు ప్రసిద్ధి అని ఆమె చెప్పారు. అక్కడ నుంచి తెచ్చిన మూలికలతో చేసిన ఔషధాన్ని తాను తీసుకుంటున్నానని.. దీంతో దురద సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతున్నట్టు వివరించారు. మోడీ మళ్లీ స్పందిస్తూ.. ప్రజలను కలుస్తున్నారా? అని అనగా.. తరచుగా నియోజకవర్గానికి వెళ్తున్నానని.. రేపు ఆదివారంకూడా వెళ్తున్నట్టు చెప్పారు.
కాగా.. ఇటీవల వందేమాతరం సహా.. ఉపాధి హామీ పథకం పేరు మార్పు బిల్లులపై జరిగిన చర్చల్లో మోడీని కార్నర్ చేస్తూ.. ప్రియాంక తీవ్రంగా స్పందించారు. తన ముత్తాత నెహ్రూను విమర్శించేందుకు రోజు రోజంతా కేటాయించినా.. తనకు అభ్యంతరం లేదని.. కానీ, ప్రజల సమస్యలపై స్పందించేందుకు కూడా పార్లమెంటు వేదిక కావాలని సూటిగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకానికి పేరు మార్పును తప్పుబట్టారు. పేర్లు మార్చడం అంటే.. మోడీజీకి బాగా ఇష్టమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాలుష్యంపైనా చురకలు అంటించారు. ఇలాంటి సమయంలో రాహుల్‌ను పక్కన పెట్టి ప్రియాంకతో మోడీ ముచ్చటించడం.. జాతీయ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. రాహుల్ కంటే ప్రియాంకనే తమకు సమ ఉజ్జీ అని మోడీ భావిస్తున్నారా? లేక.. మరే కారణమైనా ఉందా? అనేది చర్చకు వస్తోంది.
