చిన్నప్పుడు నేర్చుకోవాల్సింది...మోడీ అసంతృప్తి
నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఈ రోజున ఉన్నారు. ఆయనలా ఎక్కువ దేశాలు పర్యటించిన నాయకుడు ఎవరూ లేరు.
By: Satya P | 20 Nov 2025 9:26 AM ISTనరేంద్ర మోడీ ప్రపంచ నాయకుడిగా ఈ రోజున ఉన్నారు. ఆయనలా ఎక్కువ దేశాలు పర్యటించిన నాయకుడు ఎవరూ లేరు. ఆయన భారత్ ని ప్రతీ దేశానికి అనుసంధానం చేశారు. ఆయన అంతర్జాతీయ వేదిక మీద భారత్ ని నిలబెట్టడమే కాదు, తాను ఎంతో శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మోడీ రాజకీయ జీవితం కనుక పరిశీలిస్తే అపజయం లేని వీరుడిగా కనిపిస్తారు. అంతే కాదు కనీసం ఒక్క రోజు ఒక గంట అయినా ఆ ఉన్నత స్థానం మీద కూర్చోవాలని ఆశించే వర్తమాన రాజకీయ తరం ఉన్న నేపధ్యంలో మోడీ ముఖ్యమంత్రిగా పదమూడేళ్ళు, ప్రధానిగా దాదాపుగా పదకొండున్నరేళ్ళ పాటు ఏకధాటిగా పాలిస్తూనే ఉన్నారు. ఆయన అత్యున్నత సింహాసనానికి ఎపుడూ మోజు పడింది లేదు కానీ అదే ఆయనను అంటిపెట్టుకుని ఉందని అంతా అంటారు.
తీరని కోరికలు :
మోడీకి తీరని కోరికలు ఉన్నాయా అని సందేహం ఎవరికైనా రావడం సహజం. అయితే ప్రతీ మనిషికీ కోరికలు ఉంటాయి. మోడీ స్థాయిలో ఆయనకు కూడా ఉన్నాయి. కానీ ఆయనలో నెలకొన్న ఆధ్యాత్మిక భావన వల్ల ఎపుడూ ఏదీ బయటకు చెప్పరు, దక్కిన దానితోనే పూర్తి సంతృప్తి చెందుతారు. అలాంటి మోడీ ఒక విషయంలో మాత్రం తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఒక భాష విషయంలో. అదే తమిళ భాష.
తమిళ భాషను కొనియాడారు :
మోడీ తమిళ భాషను కొనియాడారు. ఈ భాషను ఆయన ఎంతగానో మెచ్చుకున్నారు. ఒక దశలో భావోద్వేగం చేందారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత నిధులను ఆయన బుధవారం కోయంబత్తూరులో జరిగిన సభలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా ఆసక్తికరమైన విషయాలనే చెప్పారు తాను బాల్యంలోనే తమిళ భాష నేర్చుకుని ఉండాల్సింది అని మోడీ చెప్పడం విశేషం.
ఆర్ధం కాలేదని బాధ :
ఇక తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులో జరిగిన దక్షిణ భారత సేంద్రియ రైతుల సదస్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ స్థానికంగా ఒక రైతు నాయకుడి తమిళ ప్రసంగం తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. అయితే భాషా సమస్య వల్ల అది పూర్తిగా అర్థం కాకపోవడంపైన మోడీ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తమిళ భాష తాను చిన్ననాడే నేర్చుకుని ఉండాల్సింది అని అన్నారు.
అనువాదం కావాలి :
ఇక ఈ రైతు సదస్సులో రైతు నాయకుడు అయిన పీఆర్ పాండియన్ తమిళంలో అనర్ఘళంగా ప్రసంగించారు. ఆయన చేసిన ప్రసంగం ఆద్యంతం వింటూ మోడీ అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత మాట్లాడిన మోడీ రైతు నాయకుడు పాండియన్ ప్రసంగం తమిళంలో ఉండటం వల్ల చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. అయితే అది నాకు పెద్దగా అర్థం కాలేదని సభా ముఖంగా ఒప్పుకున్నారు. కానీ ఈ భాషా వికాసం చూశాక తాను తమిళం నేర్చుకుని ఉంటే ఎంతో బాగుండేది కదా అనిపించిందని మోడీ చెప్పడం విశేషం. ఇలా తమిళ భాష మీద ప్రధాని తన అభిమానాన్ని చాటుకోవడంతో ఆ సభకు హాజరైన వేలాదిగా రైతుల నుంచి కరతాళధ్వనులు వినిపించాయి. ఇదిలా ఉంటే రైతు నాయకుడు పాండియన్ ప్రసంగాన్ని తనకు హిందీ లేదా ఇంగ్లీషులోకి అనువదించి ఇవ్వాలని తమిళనాడు రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవిని ప్రధాని మోడీ సభా వేదిక నుంచే కోరారు.
