Begin typing your search above and press return to search.

ప్రధాని మోడీపై పార్లమెంట్ లో దాడికి ప్రయత్నించింది ఎవరు..!

గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.

By:  Raja Ch   |   6 Feb 2026 1:17 AM IST
ప్రధాని మోడీపై పార్లమెంట్  లో దాడికి ప్రయత్నించింది ఎవరు..!
X

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ సభల్లోను ప్రసంగించాల్సి ఉండగా.. పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... ప్రధాని మోడీపై దాడి చేసేలా పలువురు ప్రతిపక్ష ఎంపీలు వ్యవహరించారని.. పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధానిని అగౌరవపరచవచ్చనే ముందస్తు సమాచారంతోనే ఆయనను సభకు రావొద్దని విజ్ఞప్తి చేసినట్లు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు! దీంతో.. ఈ విషయం సంచలనంగా మారింది.

అవును... గురువారం లోక్ సభ, రాజ్యసభల్లో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇందులో భాగంగా... పలువురు ప్రతిపక్ష ఎంపీలు ప్రధానిని అగౌరవపరచొచ్చనే ముందస్తు సమాచారం తనకు ఉందని.. అందువల్లే లోక్ సభకు ప్రధానిని రావొద్దని విజ్ఞప్తి చేసినట్లు స్పీకర్ ఓం బిర్లా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. దీంతో.. ప్రధానిపై దాడికి ప్రయత్నించింది ఎవరనేది ఆసక్తిగా మారింది. మరోవైపు రాజ్యసభలోనూ రచ్చ జరిగింది.

గురువారం రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానానికి ప్రధాని ప్రసంగిస్తుండగా.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి. ప్రధాని ప్రసంగిస్తుండగా.. ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ప్రతిపక్ష ఎంపీలు... లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని మాట్లాడటానికి అనుమతించాలని డిమాండ్ చేస్తూ నిరంతరం గందరగోళాన్ని సృష్టించారు. రెండు సభల్లోనూ ప్రతిపక్ష నాయకులను మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు.

పార్లమెంటరీ నియమాలను ఉటంకిస్తూ... మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే రాసిన "ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ"లోని కొన్ని భాగాలను కలిగి ఉన్న ఒక పత్రికలో ప్రచురించబడిన సారాంశాన్ని ఉటంకించడానికి రాహుల్ గాంధీని స్పీకర్ అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే రచ్చ మొదలైంది. ఈ సందర్భంగా... ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రాథమిక స్ఫూర్తిని దెబ్బతీస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.

ఇదే సమయంలో.. తాను ఉటంకించాలనుకున్న సారాంశం జాతీయ ప్రయోజాలకు సంబంధించినదని.. ఇది డొక్లాం, గల్వాన్ వద్ద చైనా సైన్యంతో మన సైన్యం ప్రతిష్టంభనకు సంబంధించినదని చెబుతూ.. ఈ ఘర్షణల సమయంలో ప్రభుత్వం నిర్ణయాత్మక చర్య తీసుకోవడంలో విఫలమైందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇదే క్రమంలో... ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. లోక్ సభకు పదే పదే అంతరాయాలు ఏర్పడటం, ప్రధానమంత్రి హాజరు కాకపోవడాన్ని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా... ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రశ్నల నుంచి అధికారపార్టీ తప్పించుకుంటుందని మండిపడ్డారు. నరవాణే రాసిన పుస్తకం, ఎప్ స్టీన్ ఫైల్స్ కి సంబంధించిన విషయాలు, అమెరికా-భారత్ మధ్య ఒప్పందం, రైతులపై దాని ప్రభావం గురించిన ప్రశ్నలకు ప్రభుత్వం భయపడుతోందని అన్నారు.