PM నరేంద్ర మోదీ గిఫ్ట్‌లను వేలం వేసే ప్రక్రియ ఎలా మొదలైంది?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు అందించే కానుకలు- జ్ఞాపికలను బహిరంగంగా వేలం వేసే వినూత్న సంప్రదాయం రాజకీయాలకు ఒక కొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టింది.
By: Sivaji Kontham | 18 Sept 2026 9:28 AM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు అందించే కానుకలు- జ్ఞాపికలను బహిరంగంగా వేలం వేసే వినూత్న సంప్రదాయం రాజకీయాలకు ఒక కొత్త అర్ధాన్ని తెచ్చిపెట్టింది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే ఈ ఆలోచనకు బీజం పడింది. తనకు వచ్చే ప్రతి బహుమతిపైనా వ్యక్తిగత హక్కు ఉండకూడదనే ఉద్దేశంతో వాటిని వేలం వేసి వచ్చిన విరాళాలను బాలికల విద్యను ప్రోత్సహించే `కన్యా కేలవణి` వంటి సత్కార్యాలకు ఉపయోగించేవారు. ఇదే స్ఫూర్తితో ఆయన దేశ ప్రధాని అయిన తర్వాత జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియను మరింత విస్తృతం చేశారు.
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ.. నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ (NGMA) ఆధ్వర్యంలో ఈ ఈ-వేలం ప్రక్రియ అధికారికంగా జనవరి 2019లో ప్రారంభమైంది. అప్పటి నుంచి ప్రధాని మోదీ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రతి ఏటా ఈ వేలాన్ని నిర్వహించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ వేదికపై కేవలం సాంప్రదాయ కళారూపాలు, శిల్పాలు, మొమెంటోలు మాత్రమే కాకుండా... వివిధ జాతీయ, అంతర్జాతీయ వేదికలపై క్రీడాకారులు ప్రధానికి బహుకరించిన పతకాలు, కిట్లు, జావెలిన్‌లు వంటి అమూల్యమైన వస్తువులు కూడా ఉంచడం విశేషం.
ఈ వేలం ప్రక్రియ కేవలం ఆచారంగానే కాకుండా ఆర్థికంగా, పర్యావరణపరంగాను అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఇప్పటివరకు నిర్వహించిన పలు ఎడిషన్ల ద్వారా మొత్తం 52 కోట్లకు పైగా నిధులు సేకరించడం విశేషం. ఈ వేలం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని కేంద్ర ప్రభుత్వ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టయిన `నమామి గంగే` ప్రొగ్రామ్ కింద గంగా నది పరిరక్షణ, ప్రక్షాళన కార్యక్రమానికే పూర్తిగా కేటాయిస్తున్నారు.
ప్రజల నుంచి అందిన కానుకలనే మళ్లీ అత్యంత పారదర్శకమైన వేలం ద్వారా దేశ ప్రయోజనాలకోసం ఉపయోగించడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. దేశంపై అనుబంధాన్ని పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు... సామాజిక సేవకు ఈ నిధులు వెచ్చించడం ద్వారా మోదీ అనుసరిస్తున్న ఈ విధానం రాజకీయ నాయకులకు ఒక ఆదర్శవంతమైన మార్గంగా నిలుస్తోంది. PM మోదీ `వేలం పాట` దేశంలో నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిస్తే అది కచ్ఛితంగా ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలకు నిధిని సేకరించే విధంగా మారుతుంది. కానీ ఆ పని చేసేందుకు మన నాయకులు సిద్ధంగా ఉన్నారా? అనేదే ప్రశ్న.
ఈనెల 17న మరోసారి వేలం పాట:
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి దేశవ్యాప్తంగా అందిన కానుకలను పబ్లిక్ బిడ్డింగ్ కోసం ఉంచే ఎనిమిదో విడత `పీఎం మెమెంటోస్ ఈ-వేలం` సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ప్రారంభంకానుండగా..ఈసారి సుమారు 1498 బహుమతులు వేలానికి వస్తున్నట్లు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో కర్ణాటకకు చెందిన శ్రీరాముడి వెండి జ్ఞాపిక (రూ. 13.50 లక్షలు), కాకతీయ కళాధరణం వెండి ప్రతిరూపం (రూ. 9 లక్షలు), గొండు ఆర్ట్ పెయింటింగ్ వంటి 50 ప్రత్యేకమైన `హీరో ఆబ్జెక్ట్స్` ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల సాంస్కృతిక-కళా నైపుణ్యాలను ప్రతిబింబించే ఈ వస్తువుల ప్రదర్శన నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ లో నిర్వహించనున్నారు. ఈ ఆరేళ్లలో ఈ వేలం ద్వారా రూ. 52 కోట్లకు పైగా నిధులు సేకరించగా ఈసారి కూడా ఈ వేలం ద్వారా వచ్చే పూర్తి ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక `నమామి గంగే` ప్రాజెక్ట్‌కు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. ప్రజల నుంచి వచ్చిన కానుకలను తిరిగి ప్రజా సంక్షేమం, పర్యావరణ పరిరక్షణకే అంకితం చేయాలనే ప్రధాని మోదీ వ్యక్తిగత దృక్పథానికి ఇది నిదర్శనమని కేంద్ర సాంస్కృతిక మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పేర్కొన్నారు. https://pmmementos.gov.in/లో అక్టోబర్ 2 వరకు వేలం కొనసాగనుంది.
