Begin typing your search above and press return to search.

రెండేళ్ళ తరువాత అక్కడికి మోడీ...సర్వత్రా ఆసక్తి !

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోని దేశాలను అన్నింటినీ ఒకటికి రెండు మూడు సార్లు చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే.

By:  Satya P   |   8 Sept 2025 4:00 AM IST
రెండేళ్ళ తరువాత అక్కడికి మోడీ...సర్వత్రా ఆసక్తి !
X

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచంలోని దేశాలను అన్నింటినీ ఒకటికి రెండు మూడు సార్లు చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన పదకొండేళ్ళ ప్రధానిమంత్రిత్వంలో అనేక దేశాలు తిరిగారు. ఆయన మాదిరిగా విదేశీ పర్యటనలు చేసే ప్రధాని మరొకరు కనిపించరు. అంతలా మోడీ తన పర్యటనలలో సమీప భవిష్యత్తులో ఎవరూ రికార్డులు బద్ధలు కొట్టకుండా చేసుకున్నారు. దటీజ్ మోడీ అని కూడా అనిపించారు. అంతే కాదు మోడీ భారత దేశంలోని అనేక ప్రాంతాలను చాలా విరివిగా విస్తారంగా తిరుగుతారు. ఆయన అంత క్రియాశీలంగా తిరిగే ప్రధాని కూడా మరొకరు లేరు అన్న పేరుని సంపాదించారు. అలాంటి ప్రధాని గత రెండేళ్ళుగా ఒక రాష్ట్రానికి మాత్రం వెళ్ళలేదు. దాని మీద విపక్షాలు ఎన్ని సార్లు విమర్శలు చేసినా పార్లమెంట్ లోపలా వెలుపలా రచ్చ చేసినా మోడీ మాత్రం ఆ రాష్ట్రానికి వెళ్ళలేదు. ఆ రాష్ట్రం ఏమిటో ఈపాటికి అందరికీ తెలిసే ఉంటుంది. అదే మణిపూర్.

అగ్ని గుండంగా మణిపూర్ :

రెండేళ్ళ ముందు వరకూ బాగానే ఉన్న మణిపూర్ 2023 నుంచి అగ్ని గుండంగా మారిపోయింది. అక్కడ రెండు జాతుల మధ్య ఘర్షణలతో తీవ్రమైన సామాజిక అస్థిరత ఏర్పడి అది రాజకీయంగానూ అతి పెద్ద సమస్యగా మారింది. కుకీలు మెయితీల మధ్యన జాతి సంఘర్షణలు భారీ ఎత్తున సాగాయి. దాంతో రాష్ట్రం ఏకంగా రావణ కాష్టంగా మారింది. అంతే కాదు లా అండ్ ఆర్డర్ కి కూడా ఇబ్బందిగా పరిణమించింది. ఇక హింస పెద్ద ఎత్తున చెలరేగింది. రెండు తెగల మధ్యన ఘర్షణలో ఎంతో మంది చనిపోయారు కూడా. ఇక రాజకీయంగా చూస్తే బీజేపీ ఏలుబడిలో మణిపూర్ ఉంది. దాంతో ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మణిపూర్ రాష్ట్రపతి పాలనలో ఉంది.

భారీ ఎత్తున ఏర్పాట్లు :

ఇక మణిపూర్ లో రాష్ట్రపతిపాలన విధించాక నెమ్మదిగా వాతావరణం అదుపులోకి వచ్చింది. ఇపుడిపుడే శాంతి అక్కడ నెలకొంటోంది. ఈ కీలక సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటన చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది ఒక విధంగా చూస్తే విశేషంగా భావిస్తున్నారు. ఈ నెల 13న నరేంద్ర మోడీ మణిపూర్ పర్యటన చేపడుతున్నారు. దాని కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మణిపూర్ రాజధాని ఇంఫాల్ చేరుకుని అక్కడ ప్రసిద్ధి చెందిన కాంగ్లా కోట లోపల జరిగే సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కోట లోపల సుమార్ పదిహేను వేల మంది ప్రజలకు ఉద్దేశించి ప్రధాని ప్రసంగం చేయనున్నారు.

అక్కడ బహిరంగ సభలో మోడీ :

కాంగ్లా కోట సభ తరువాత ప్రధని నేరుగా చురచంద్ పూర్ కి వెళ్తారు. అక్కడ ఉన్న పీసీ గ్రౌండ్ మైదానంలో మోడీ బహిరంగ సభలో మొత్తం మణిపూర్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సభ మీదనే ఇపుడు అందరి దృష్టి ఉంది. మోడీ ఏమి మాట్లాడుతారు, మణిపూర్ కి ఏ వరాలు ప్రకటిస్తారు అన్నది అంతా ఆలోచిస్తున్నారు. ఈ సభకు దాదాపుగా పది వేల మంది ప్రజలను మాత్రమే అనుమతించారు. ఈ సభకు వస్తున్న మోడీని నేరుగా కలసి తమ సమస్యలను చెప్పుకోవాలని చాలా మంది స్థానిక ప్రజలు చూస్తున్నారు. మోడీ సైతం మణిపూర్ ఉజ్వల భవిష్యత్తు కోసం భారీ ప్రకటనలు చేసే అవకశం ఉంది అని అంటున్నారు.

కట్టుదిట్టమైన భద్రత :

జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికిన మణిపూర్ కి చాలా కాలం తరువాత ప్రధాని మోడీ వస్తున్న నేపధ్యంలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. ఇంఫాల్ అంతార్జాతీయ విమానశ్రయానికి పూర్తి నిఘా పెట్టారు. చుట్టు పక్కన పొదలను తొలగించి మరీ మోడీ పర్యటనలో ఎలాటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు. మొత్తానికి మోడీ సరైన సమయంలోనే మణిపూర్ పర్యటన చేపడుతున్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆలస్యం చాలా అయిందని విపక్షాలు అంటున్నాయి. ఎవరు ఏమన్నా కూడా మోడీ మణిపూర్ మళ్ళీ పూర్తిగా అభివృద్ధి బాటన పట్టేందుకు ఏ వరాలు ఇస్తారు అన్నదే సర్వత్రా చర్చగా ఉంది.