మోడీ టూర్: భోగాపురం మాత్రమేకాదు.. చాలానే ఉన్నాయి!
ఇదే వేదికగా దాదాపు 18 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ, వీటిలో అత్యంత కీలకమైంది.. బోగాపురం విమానాశ్రయం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
By: Garuda Media | 31 July 2026 7:23 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ఏపీకి రానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రారంభోత్సవం చేయనున్నారు. దీనిని జాతికి అంకితం చేయనున్నారు. అయితే.. ఈ ఒక్క కార్యక్రమానికే ప్రదాన మంత్రి పరిమితం కావడం లేదు. ఇదే వేదికగా దాదాపు 18 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. కానీ, వీటిలో అత్యంత కీలకమైంది.. బోగాపురం విమానాశ్రయం కావడంతో దీనికి ప్రాధాన్యం ఏర్పడింది.
భోగాపురం విమానాశ్రయంతోపాటు.. విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్న సెమీ కండెక్టర్ ప్లాంట్‌కు కూ డా ప్రధాని శ్రీకారం చుట్టనున్నారు. దీనివిలువ సుమారు 450 కోట్లకుపైగానే ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న తొలి సెమీకండెక్టర్ యూనిట్ కావడం గమనార్హం. సెమికాన్ ఇండియా ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నానికి ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్లాంట్ నుంచి ఏడాదికి సుమారు 10 కోట్ల చిప్‌లను తయారు చేయనున్నారు.
ఇక, భోగాపురం వేదిక నుంచే.. కర్నూలులో నిర్మించనున్న పునరుత్పాదక ఇంధన జోన్ విద్యుత్ ప్రసార వ్యవస్థను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దీనికి సుమారు 5500 కోట్ల రూపాయలను వెచ్చించనున్నారు. అలాగే.. సీమలోని కర్నూలు, అనంతపురంలో సౌర, పవన విద్యుత్ జోన్లను ప్రారంభించనున్నారు. ఇక, విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య కొత్తగా నిర్మించనున్న నేషనల్ హైవే పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు.
ప్రస్తుతం విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే వారు. విజయవాడ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే.. ఇక నుంచి షార్ట్‌కట్‌తో పాటు.. విజయవాడ సిటీ సహా పరిసర ప్రాంతాలను టచ్ చేయకుండానే హైదరాబాద్‌ను చేరుకునేలా.. ఈ జాతీయ రహదారిని నిర్మిస్తున్నారు. దీనికిగాను.. భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయనుండగా.. కేంద్రం నిర్మాణం చేయనుంది. దీనికి 1900 కోట్ల రూపాయలను కేటాయించను న్నారు. ఇది ఫ్యూచర్ సిటీని కూడా కలుపుతుందని అధికారులు తెలిపారు.
