ఒకే హెలీకాప్టర్ లో స్టార్స్ ఆఫ్ కూటమి... మోడీతో పిక్స్ వైరల్!
ఈ సందర్భంగా.. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు.
By: Raja Ch | 16 Oct 2025 12:44 PM ISTఎన్డీఏ ప్రభుత్వం తరపున వరుస ప్రారంభోత్సవాలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. మరోసారి ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.
అవును... ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ.. శ్రీశైలం బయల్దేరారు. ఈ సందర్భంగా కర్నూలు ఎయిర్ పోర్టులో దిగిన ఆయనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. అనంతరం.. ప్రధాని మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కలిసి ఒకే హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లారు.
ఈ సందర్భంగా.. శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం దర్శించుకోనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారు 1,500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మోడీ సాయంత్రం 4:45 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్తారు.
సభకు భారీగా తరలివెళుతున్న ప్రజలు!:
‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో గురువారం కర్నూలులో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరైన నేపథ్యంలో... ఈ సభకు పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు బస్సుల్లో కర్నూలుకు చేరుకుంటున్నారు. ఈ సమయంలో రాష్ట్రం నలుమూలల నుంచి కూటమి పార్టీల జెండాలతో కదులుతున్న వాహనాలు సందడి చేస్తున్నాయి.
ఆహార పదార్ధాలు అద్భుతః!:
కర్నూలు లో మోడీ సభకు వచ్చే ప్రజల కోసం ఆహార ఏర్పాట్లు చేశారు. కర్నూలులోని పలు ప్రాంతాల్లో ఆహార పొట్లాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా... నంద్యాల - కర్నూలు రోడ్డులో ఆహార ఏర్పాట్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఫుడ్ స్టాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రకాల వంటకాలు, ఆహార పదార్థాల నాణ్యతను ఆయన పరిశీలించారు.
