Begin typing your search above and press return to search.

'ఇబ్బందులున్నా.. ఏమున్నా'... కూటమి విషయంలో పవన్ కోరిక ఇదే!

అవును... 'సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌' పేరుతో కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By:  Raja Ch   |   16 Oct 2025 5:28 PM IST
ఇబ్బందులున్నా.. ఏమున్నా... కూటమి విషయంలో పవన్  కోరిక ఇదే!
X

కర్నూలులో నేడు కీలకమైన కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ కార్యక్రమం కర్నూలు జిల్లాలోని నన్నురు వద్ద సుమారు 450 ఎకరాల మైదానంలో జరిగింది. ‘సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్’ పేరుతో నిర్వహించిన ఈ సభలో మోడీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన, నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు వర్చువల్‌ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అంతకంటే ముందు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా మోడీని కొనియాడుతూ, కూటమి ఐక్యత విషయంలో తన కోరికను మరోసారి వ్యక్తపరిచారు.

అవును... 'సూపర్‌ జీఎస్టీ - సూపర్‌ సేవింగ్స్‌' పేరుతో కర్నూలులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం 15 ఏళ్లకు తక్కువకాకుండా బలంగా ఉండాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఆకాక్షించారు. దీని కోసం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని నిలబడతామని అన్నారు.

ఇబ్బందులు ఉన్నా.. ఏమున్నా తట్టుకుని నిలబడాలని ఈ సందర్భంగా సూచించిన పవన్ కల్యాణ్.. ఒక తరం కోసం ఆలోచించే నాయకులు సీఎం చంద్రబాబు అని.. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు నాయకత్వంలో అందరం సమష్టిగా పనిచేస్తామని.. తద్వారా వచ్చే తరం ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

'ప్రధాని మోడీ కర్మయోగి'!:

ప్రధాని నరేంద్ర మోడీని కర్మయోగిగా చూస్తామని.. ఎలాంటి లాభాపేక్ష లేకుండా పనిచేస్తున్నారు కాబట్టే మోడీని కర్మయోగి అంటామని చెప్పిన పవన్ కల్యాణ్.. ఆయన ప్రభుత్వాన్ని మాత్రమే కాదు, రెండు తరాలను నడుపుతున్నారని అన్నారు. ఎవరిపైనా ఆధారపడకుండా, దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్‌ భారత్‌ తీసుకువచ్చారని ప్రశంసించారు.

ఇదే క్రమంలో... దేశ జెండా ఎంత పౌరుషంగా ఉంటుందో అదేవిధంగా భారతదేశాన్ని ప్రపంచపటంలో నిలబెట్టారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ కొనియాడారు. దేశంలో పన్నులు ఎప్పుడూ పెరగడమే తప్ప తగ్గవని, అలాంటి పన్నుల భారాన్ని తగ్గించారని.. ఫలితంగా ప్రతీ కుటుంబానికి ఏడాదికి రూ.20వేలు ఆదా చేసుకునే అవకాశం కల్పించారని తెలిపారు.