రండి.. నా పక్కన కూర్చోండి: పవన్‌కు మోడీ ఆఫర్
ఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు.
By: Garuda Media | 16 Oct 2025 3:27 PM ISTఏపీ పర్యటనకు వచ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి నేరుగా కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తొలుత ఆయన హెలికాప్టర్‌లో శ్రీశైలం మల్లన్న దర్శనా నికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆయనతో పాటు సీఎం చంద్రబాబు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా వెళ్లాల్సి ఉంది. అయితే.. ప్రధానిని హెలికాప్టర్‌లో పంపించి.. వారు రోడ్డు మార్గంలో వెళ్లాలని భావించారు.
అయితే.. ప్రధాన మంత్రి పర్యటన కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రిగా సీఎం ఉండాలని పీఎంవో నుంచి వచ్చిన సమాచారంతో సీఎం చంద్రబాబు ప్రధానితో పాటు హెలికాప్టర్ ఎక్కివెళ్లేందుకు రెడీ అయ్యారు. ఇక, గవర్నర్, డిప్యూటీ సీఎంలు రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లేందుకు.. కాన్వాయ్‌లు రెడీ చేసుకున్నారు. అయితే.. ప్రధాని హెలికాప్టర్ ఎక్కుతున్న సమయంలో ఆశ్చర్యంగా.. ఆయనే పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. రండి.. అందరం కలిసి వెళ్దాం.. అని అన్నారు. కానీ, ప్రొటోకాల్ లో ఈ విషయం లేదు.
దీంతో అధికారులు కూడా ఉలిక్కిపడ్డారు. కానీ, అక్కడికక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక.. ప్రధానిని వారించే ప్రయత్నం చేయలేక పోయారు. ఈ హెలికాప్టర్‌లో ఏడుగురు ఎక్కే అవకాశం ఉంది. ప్రధాని, ఆయన భద్రతా సిబ్బంది ముగ్గురు ఉంటారు. ఇక, సీఎం చంద్రబాబు.. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరు ఉంటారు. ఇంక ఒకే ఒక్క సీటు ఖాళీ ఉంటుంది. దానిని జాగ్రత్తల కోసం ఉంచుతారు. కానీ, ప్రధాని పవన్‌ను ఆహ్వానించేసరికి.. సీఎం చంద్రబాబు సెక్యూరిటీ వెనక్కి తగ్గారు. దీంతో ప్రధాని పిలుపును అందుకున్న పవన్.. అదే హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్లారు. అంతేకాదు.. ప్రధాని తనపక్క సీటులోనే పవన్‌ను కూర్చోవాలని చెప్పడం మరో విశేషం.
