చేనేతకు ప్రధాని ప్రచారం: తెలుగు రాష్ట్రాల్లో ఈ రంగంలో మార్కెట్ ఎంతో తెలుసా?
భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని జెన్ జెడ్, జెన్ ఆల్ఫా యువతతో అనుసంధానం కావడం కోసం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
By: Sivaji Kontham | 7 Aug 2026 9:35 AM ISTభారత ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని జెన్ జెడ్, జెన్ ఆల్ఫా యువతతో అనుసంధానం కావడం కోసం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ప్రభుత్వం - యువత మధ్య ఉన్న గ్యాప్ లోపాన్ని స్పష్టంగా ఎత్తిచూపడంతో.. ప్రధాని మోదీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ప్రతిరోజూ రాత్రి వేళల్లో రీల్స్ షేర్ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. సాంప్రదాయ మీడియా కంటే నేరుగా సామాజిక మాధ్యమాల ద్వారానే తన సందేశాలను యువతకు చేరవేయడం ఒక తెలివైన ప్రచార వ్యూహంగా కనిపిస్తోంది. తాజాగా జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన షేర్ చేసిన వీడియో చేనేత రంగ విశిష్టతను చాటిచెప్పడమే కాకుండా డిజిటల్ పరిధిలో ఒక కొత్త చర్చకు తెరలేపింది.
ఈ ప్రత్యేక రీల్‌లో ప్రధాని మోదీ 1905 ఆగస్టు 7న ప్రారంభమైన స్వదేశీ ఉద్యమం చారిత్రక ప్రాధాన్యతను గుర్తుచేస్తూ... చేనేత వస్త్రాల సాంస్కృతిక వైవిధ్యాన్ని వివరించారు. ఫ్రెండ్‌షిప్ డే మాదిరిగానే చేనేత దినోత్సవాన్ని కూడా ఉత్సాహంగా జరుపుకోవాలని.. యువత తమకు నచ్చిన చేనేత ఉత్పత్తులను ధరించి ``గెట్ రెడీ విత్ మీ`` (GRWM) ట్రెండింగ్ మోడల్‌లో వీడియోలు చేసి `#నేషనల్‌హ్యాండ్‌లూమ్‌డే` హ్యాష్‌ట్యాగ్‌తో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. చిన్నపాటి ఇళ్లలోనే నేతపని చేస్తూ జీవనం సాగించే పేద నేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వడమే `ఆత్మనిర్భర్ భారత్` సాధనలో కీలకమని.. ప్రతీ ఒక్కరూ చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ డిజిటల్ ప్రచారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక శక్తివంతమైన వ్యూహంగా పరిణమించనుంది. పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, మంగళగిరి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం వంటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన చేనేత క్లస్టర్లు ఈ రెండు రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఈ ఉత్పత్తులను ఆధునిక రీల్స్ రూపంలో యువత ముందుకు తీసుకురావడం వల్ల.. చేనేత కేవలం పండుగలకే కాకుండా రోజువారీ ఫ్యాషన్‌లోనూ భాగమవుతుంది. పవర్‌లూమ్ యంత్రాల పోటీ వల్ల చేనేత శ్రమ కనుమరుగవుతున్న తరుణంలో.. ఇటువంటి ప్రచారం బ్రాండ్ విలువను పెంచి.. నకిలీ వస్త్రాల నుండి అసలైన చేనేతను గుర్తించే అవగాహనను పెంచుతుంది.
తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలో చేనేత రంగానికి భారీ పరిధి ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కలిపి దాదాపు 6 లక్షల నుండి 7 లక్షల మంది నేరుగానూ.. పరోక్షంగానూ (నూలు వడకడం, రంగులు వేయడం మొదలైన పనులలో) ఈ రంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అంతర్గత అమ్మకాలు, ప్రభుత్వ కోఆపరేటివ్ సొసైటీలు (TSCO, APCO) .. అంతర్జాతీయ ఎగుమతులు అన్నీ కలిపి ఈ రెండు రాష్ట్రాల చేనేత మార్కెట్ పరిమాణం సుమారు 5,000 కోట్ల నుండి 7,000 కోట్లుగా ఉంది. ప్రధాని ప్రచారం ద్వారా ఈ విస్తారమైన మార్కెట్‌కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
ఈ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. వేలాది మంది నెటిజన్లు `హర్ హర్ మహదేవ్`,`జై హింద్` అంటూ మద్దతు తెలుపగా.. కెమెరా యాంగిల్స్ .. వీడియో క్వాలిటీని యువత ప్రశంసించింది. రాబోయే ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకోవడానికే మోదీ ఈ `ఇన్ఫ్లుయెన్సర్` అవతారం ఎత్తారని కొందరు విమర్శించగా... మరికొందరు కామెంట్ సెక్షన్‌లో అస్సాం వరదలు, విద్యార్థుల సమస్యలు, మణిపూర్ అంశం, పెట్రోల్ ధరలు .. #UGCROLLBACK వంటి నిరసనలను లేవనెత్తారు. ఏది ఏమైనా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మోదీ ఎంచుకున్న ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వ్యూహం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారతదేశానికి అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటిగా గుర్తించి చేనేతకు ప్రధాని బాసటగా నిలవడం హర్షించదగినది. యువతరం దీనిని ప్రోత్సహించడం సరైన నిర్ణయమే.
