దేశంలో వారే బలవంతులు- నరేంద్ర మోడీ
భారత దేశంలో అత్యంత బలవంతులు సర్వోన్నతులు ప్రజలే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
By: Satya P | 15 Jan 2026 10:21 PM ISTభారత దేశంలో అత్యంత బలవంతులు సర్వోన్నతులు ప్రజలే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత దేశం బలం అంతా కూడా ప్రజాస్వామ్యంలోనే ఉందని చెప్పారు. భారతదేశంలో వైవిధ్యం ఉందని అయితే అదే దేశానికి అతి పెద్ద శక్తిగా మారి ఈ రోజు వేగవంతమైన అభివృద్ధికి దారి తీస్తోందని అన్నారు.
నిరూపించిన భారత్ :
ఇదిలా ఉంటే న్యూఢిల్లీలోని సంవిధాన సదన్‌లో జరిగిన కామన్వెల్త్ స్పీకర్లు ప్రిసైడింగ్ అధికారుల సదస్సులో నరేంద్ర మోడీ మాట్లాడుతూ భారతదేశం తన వైవిధ్యాన్ని ప్రజాస్వామ్యానికి ఎంత బలంగా మార్చుకుందో వివరించే ప్రయత్నం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలు ప్రజాస్వామ్య ప్రక్రియలు స్థిరత్వం తో పాటు వేగవంతమైన ప్రగతిని అలాగే ఎంతో విస్తృత పరిధిని సైతం అందిస్తాయని చెప్పారు. ఇదే విషయం భారతదేశం ఆచరణాత్మకంగా నిరూపించిందని ప్రధానమంత్రి చెప్పడం విశేషం.
చివరి వ్యక్తి వరకూ :
ఇక భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే చివరి వ్యక్తికి కూడా సేవలు అందించడమేనని ఆయన చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి వ్యక్తి సంక్షేమం కోసం పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. గత కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని మోడీ గుర్తు చేశారు. భారతదేశంలో ప్రజల ఆకాంక్షలకే అత్యంత ప్రాధాన్యత ఇచ్చామని తాము పదకొండేళ్ళ పాలనలో ఇదే జరిగిందని అన్నారు.
అన్నింటా నంబర్ వన్ :
ఇక ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఈ రోజున అవతరించిందని మోడీ అన్నారు. భారతదేశంలోని యూపీఐ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ అని ప్రకటించారు. అలాగే భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ ఉత్పత్తిదారుగా ఉందని ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉందని ఆయన చెప్పారు. అని ఆయన అన్నారు. ప్రతి అంతర్జాతీయ వేదికపై గ్లోబల్ సౌత్ దేశాల ఆందోళనలను భారతదేశం బలంగా వినిపిస్తోందని మోడీ చెప్పారు. భారత్ జీ 20 అధ్యక్ష పదవి కాలంలో కూడా గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలను ప్రపంచ అజెండాకు కేంద్రంగా ఉంచిందని గుర్తు చేశారు. భారత్ అభివృద్ధి ఎపుడూ అందరితో ఉంటుందని అన్నారు. దేశంలోని భిన్నత్వంలో ఏకత్వం సాధించిన భారత్ అంతర్జాతీయంగా కూడా బలంగా మారిందని అన్నారు.
