గూగుల్ నుంచి గిన్నిస్ రికార్డు దాకా: ప్రధాని మోదీ ప్రసంగంలో హైలెట్స్
అల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర గడ్డపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.
By: Tupaki Political Desk | 1 Aug 2026 2:53 PM ISTఅల్లూరి సీతారామరాజు నడయాడిన పవిత్ర గడ్డపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించడంపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ ఎయిర్ పోర్టు రాష్ట్ర అభివృద్ధికి ఒక నూతన రన్‌వేగా, లాంచ్‌ప్యాడ్‌గా నిలుస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ అభివృద్ధి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ ఎంతో చారిత్రాత్మకమైన రోజని కొనియాడారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహాస్వామి, శ్రీకూర్మం కూర్మనాధస్వామి, పైడితల్లి అమ్మవారికి భక్తిపూర్వక నమస్కారాలు తెలిపారు.
అభివృద్ధి, సంస్కృతుల అద్భుత సంగమం
ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవంతో పాటు మొత్తంగా రూ. 18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ప్రధాని వెల్లడించారు. అభివృద్ధిలో రికార్డులు సృష్టించడమే కాకుండా, 13 వేల మందికి పైగా గిరిజన మహిళలు థింసా నృత్యంతో గిన్నిస్ రికార్డు సాధించడం విశేషమని, ఈ విజయం సాధించిన గిరిజన మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అల్లూరి పేరుతో నూతన శకం
గిరిజనుల హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రారంభించడం ఎంతో సంతోషకరమన్నారు. గతంలో ఎయిర్‌పోర్టులకు కేవలం ఒకే కుటుంబం పేర్లు పెట్టే పద్ధతి ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక ఆ సంస్కృతిని మార్చామని ప్రధాని గుర్తుచేశారు. అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్‌లో సంత్ రవిదాస్ పేర్లతో విమానాశ్రయాలను ఏర్పాటు చేసినట్లే, భోగాపురంలో అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టామని స్పష్టం చేశారు. దేశంలో గతంలో కేవలం 74 ఎయిర్‌పోర్టులు మాత్రమే ఉండేవని, నేడు ఆ సంఖ్య 166కి చేరిందని తెలిపారు. 'ఉడాన్' పథకం ద్వారా చిన్న చిన్న పట్టణాల నుంచి కూడా సామాన్యులు విమానయానం చేసే అవకాశం లభించిందని, కాశీ నుంచి అమృత్‌సర్ వరకు విస్తరించిన 'స్మోక్ ఎయిర్ పోర్టు మోడల్' ద్వారా 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించిన పంజాబ్‌ను ఆయన అభినందించారు.
డబుల్ ఇంజిన్ సర్కార్‌తో రెండింతల వేగం
ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన డబుల్ ఇంజిన్ సర్కార్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీని రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోందని ప్రధాని ప్రశంసించారు. రాష్ట్రంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న సీఎం చంద్రబాబు కృషితోనే భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని కొనియాడారు.
బ్లూ ఎకానమీ
కోస్టల్ ఎకానమిక్ కారిడార్‌ను అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు పాత పోర్టుల ఆధునీకరణతో పాటు, మూలపేట, రామాయపట్నంలో కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ-రాయపూర్ ఎక్స్ ప్రెస్ వేతో పాటు జాతీయ రహదారుల ద్వారా రవాణా వేగం పెంచుతున్నామని, రూ. 1 లక్ష కోట్ల వ్యయంతో రైల్వే కనెక్టివిటీ పనులు చేపట్టి 70కి పైగా స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని వెల్లడించారు. పీఎం గతి శక్తి పథకం కింద రైలు, పోర్టు, ఎయిర్‌పోర్టుల సమన్వయంతో ఆధునిక లాజిస్టిక్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసి రైతులకు, పారిశ్రామికవేత్తలకు ఎంతో మేలు చేకూరుస్తున్నామన్నారు.
ఫ్యూచరిస్టిక్ హబ్‌గా విశాఖ
ఇక్కడి యువతలో సాఫ్ట్‌వేర్, ఐటీ, టెక్ రంగాల్లో అద్భుతమైన టాలెంట్ ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీకండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్‌వేర్‌తో పాటు మాన్యుఫాక్చరింగ్ రంగంలోనూ అభివృద్ధి వేగం పుంజుకుంటోందని చెప్పారు. ఏపీకి సెమీకండక్టర్ పరిశ్రమతో పాటు ఏఐ ఇన్ఫ్రా, డేటా సెంటర్లు రాబోతున్నాయని, త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ కూడా ఏర్పాటు కానుందని వెల్లడించారు. నక్కపల్లిలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అతిపెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటవుతోందని, దీనిద్వారా దేశంలోనే ఏపీ ప్రముఖ ఫార్మా హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. అలాగే రాయలసీమలో గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నట్లు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర ఎకనామిక్ రీజియన్ - ఆసియాలో కీలకం
గత మూడేళ్ల పర్యటనల్లో తాను రూ. 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టానని గుర్తుచేసిన మోదీ, ఏపీ అభివృద్ధి యాత్రలో ఉత్తరాంధ్ర ప్రాంతం, విశాఖ ఎకనామిక్ రీజియన్ కీలక పాత్ర పోషించనున్నాయని స్పష్టం చేశారు. ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో ఆసియా ఖండంలోనే అత్యంత ముఖ్యమైన కేంద్రంగా మారబోతోందని, ఇందుకు తగిన అన్ని చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటోందని భరోసానిచ్చారు. "పెట్టుబడుల నుంచి ఉపాధి" అనేది ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ప్రధాని ఉద్ఘాటించారు. పెట్టుబడులు పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి పెరిగితే ఎగుమతులు పెరుగుతాయి, ఎగుమతులు పెరిగితే ఉపాధి లభిస్తుంది... తద్వారా ప్రజల జీవితాలు మెరుగవుతాయని వివరించారు. ఇవాళ ఏపీలో శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులన్నీ 'స్వర్ణాంధ్ర - వికసిత్ భారత్' సంకల్పాన్ని వంద శాతం నెరవేరుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.
