Begin typing your search above and press return to search.

ఇయర్ 2025....మోడీ మార్క్ రివ్యూ...అదే హైలెట్ !

ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ తనదైన శైలిలో 2025 ని నిర్వహించారు. ఈ ఏడాదిలో గుర్తుండిపోయే అంశాలను ఆయన మరో సారి అందరికి మననం చేస్తూ హైలెట్స్ ఏంటో చాటి చెప్పారు.

By:  Satya P   |   28 Dec 2025 10:00 PM IST
ఇయర్ 2025....మోడీ మార్క్ రివ్యూ...అదే హైలెట్ !
X

మరో మూడు రోజులలో 2025 సంవత్సరం కాల గర్భంలో కలసిపోతుంది. ఈ నేపధ్యంలో పన్నెండు నెలల ఈ ఇయర్ ని ఒకసారి రివ్యూ చేసుకోవడం అంతా చేస్తున్న పని ఈ దేశాన్ని ఏలే ప్రధాని నరేంద్ర మోడీకి 2025 ని ఎలా రివ్యూ చేస్తారు అన్నది ఉత్కంఠ ఉంటుంది. ఆయన ప్రతీ నెలా చివరి ఆదివారం మన్ కీ బాత్ పేరుతో ఆకాశవాణి దూరదర్శన్ ద్వారా ప్రజలతో మాట్లాడుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా మోడీ తనదైన శైలిలో 2025 ని నిర్వహించారు. ఈ ఏడాదిలో గుర్తుండిపోయే అంశాలను ఆయన మరో సారి అందరికి మననం చేస్తూ హైలెట్స్ ఏంటో చాటి చెప్పారు.

ఆపరేషన్ సింధూర్ :

ఈ పేరు వింటే పాక్ గుండెల్లో వణుకు పుడుతుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ గుండెళ్ళో గునపాలు దించేసి భారత్ ప్రపంచానికి కూడా తాను చెప్పాలనుకున్నది చెప్పింది. ఆ విధంగా చూస్తే 2025 లో ఇది అతి పెద్ద హైలెట్. జాతీయ భద్రత విషయంలో ఎక్కడా రాజీపడమని స్పష్టం చేస్తూ కేంద్రం తీసుకున్న దృఢమైన నిర్ణయంగా దీనిని అంతా చూస్తున్నారు. అంతే కాదు ఈ ఏడాది క్రీడల నుంచి, సైన్స్ ప్రయోగశాలల నుండి మొదలెడితే ప్రపంచంలోని అతిపెద్ద వేదికల వరకు తన సత్తా చాటింది అని మోడీ చెప్పుకొచ్చారు. దాదాపుగా వీలైన ప్రతీ సందర్భంలో ఈ సంవత్సరం భారతదేశం ప్రతిచోటా తనదైన బలమైన ముద్ర వేసిందని నరేంద్ర మోడీ చెప్పడం విశేషం.

గర్వపడేలా సాగింది :

ఇక 2025 సంవత్సరం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసే అనేక క్షణాలను అందించిందని మోడీ అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ప్రతి భారతీయుడికి గర్వానికి ప్రతీకగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు. ఈ నాటి భారతదేశం తన భద్రత విషయంలో రాజీ పడదని ప్రపంచం స్పష్టంగా చూసిందని ఆయన అన్నారు. వందేమాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలు చూపిన అదే స్ఫూర్తిని ఉత్సాహాన్ని కొనసగించాలని ఆయన కోరడం గమనార్హం. క్రీడల పరంగా కూడా 2025 ఒక చిరస్మరణీయ సంవత్సరమని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. భారత పురుషుల క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. మహిళల క్రికెట్ జట్టు మొదటిసారిగా ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. మహిళల బ్లైండ్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారతదేశ బిడ్డలు గొప్ప చరిత్ర సృష్టించారని మోదీ కొనియాడారు. అలాగే ఆసియా కప్ టీ20లో కూడా త్రివర్ణ పతాకం గర్వంగా రెపరెపలాడిందని ఆయన అన్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అనేక పతకాలు సాధించిన పారా-అథ్లెట్లను కూడా ఇదే సందర్భంలో మోడీ ప్రశంసించారు.

కుంభమేళా ఆశ్చర్యం :

మహా కుంభమేళా అన్నది ఒక్క భారత్ మాత్రమే నిర్వహించగలదు అన్నది ప్రపంచానికి చూపించిన ఘనత భారత్ ది నరేంద్ర మోడీ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో నిర్వహించిన ప్రయాగ్‌రాజ్ మహాకుంభం యావత్ ప్రపంచాన్ని అబ్బురపరచింది అని ఆయన చెప్పారు. అలాగే ఇదే ఏడాది చివరిలో అయోధ్యలోని రామ మందిరంలో జరిగిన ధ్వజారోహణ కార్యక్రమం ప్రతి భారతీయుడిని గర్వంతో నింపిందని ఆయన అన్నారు. కొత్త ఆలోచనలు, కొత్త పద్ధతులతో తరువాత తరం భారతీయ సంస్కృతి మూలాలను ముందుకు తీసుకుని వెళ్తున్న విధానం ఎంతో ఆనందకరమని మోడీ అన్నారు.