Begin typing your search above and press return to search.

మోదీకి జపాన్ నుంచి ప్రత్యేక కానుక.. అసలేంటి ‘దారుమా డాల్’

జపాన్ సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన దారుమా డాల్ ఒక విశిష్టమైన బొమ్మ. పట్టుదల, అదృష్టం, లక్ష్యాలను సాధించడంలో ఉన్న నిబద్ధతకు ఇది ప్రతీక.

By:  A.N.Kumar   |   30 Aug 2025 10:26 PM IST
మోదీకి జపాన్ నుంచి ప్రత్యేక కానుక.. అసలేంటి ‘దారుమా డాల్’
X

జపాన్ సంస్కృతిలో ప్రాముఖ్యత కలిగిన దారుమా డాల్ ఒక విశిష్టమైన బొమ్మ. పట్టుదల, అదృష్టం, లక్ష్యాలను సాధించడంలో ఉన్న నిబద్ధతకు ఇది ప్రతీక. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి జపాన్ పర్యటనలో బహుమతిగా లభించిన ఈ బొమ్మ, దాని మూలాల గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.

-బోధిధర్మునితో దారుమా డాల్ సంబంధం

దారుమా బొమ్మకి భారతీయ బౌద్ధ సన్యాసి బోధిధర్మునితో బలమైన సంబంధం ఉంది. క్రీ.శ. 5వ లేదా 6వ శతాబ్దానికి చెందిన బోధిధర్ముడు దక్షిణ భారతదేశంలోని కాంచీపురం ప్రాంతానికి చెందినవాడని ప్రచలిత వాదన. ఆయన బౌద్ధమతాన్ని చైనాకు తీసుకువెళ్లిన తొలివారిలో ఒకరుగా పరిగణించబడతారు. చైనాలో ఆయన షావోలిన్ టెంపుల్ వ్యవస్థాపకుడిగా కూడా గుర్తింపు పొందారు. బోధిధర్ముడు తొమ్మిదేళ్లపాటు గోడ వైపు చూస్తూ నిరంతరం ధ్యానం చేశారని ప్రసిద్ధి. ఈ ధ్యానం మధ్యలో ఆయన నిద్రపోకుండా ఉండేందుకు తన కనురెప్పలను కోసుకున్నారని ఒక పురాణం చెబుతుంది. ఈ కథ, ఆయన అచంచలమైన సంకల్పం .. నిర్విరామ పట్టుదలకు ప్రతీకగా నిలిచింది. జపాన్‌లో బోధిధర్ముడిని "దైషి దారుమా" లేదా కేవలం "దారుమా" అని పిలుస్తారు. ఆయన యొక్క ఈ పట్టుదల.. ధ్యాన భంగిమ ఆధారంగానే దారుమా బొమ్మ రూపుదిద్దుకుంది. దారుమా బొమ్మ ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి నిటారుగా నిలబడుతుంది. ఇది జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించి, లక్ష్యాల సాధనలో వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలనే బోధిధర్ముని స్ఫూర్తిని సూచిస్తుంది. ఈ లక్షణం జపనీయుల ఓడకుండా మళ్ళీ ప్రయత్నించే తత్వానికి ప్రతిబింబం.

- దారుమా డాల్: జపాన్ సంస్కృతిలో ఒక ముఖ్యమైన చిహ్నం

దాని భారతీయ మూలాలతో పాటు, దారుమా బొమ్మ జపనీయ సంస్కృతిలో అనేక అంశాలను సూచిస్తుంది. దారుమా బొమ్మకి మొదట ఒక కంటికి రంగు వేస్తారు. ఇది ఒక లక్ష్యాన్ని లేదా కోరికను నిర్దేశించుకున్నట్లు సూచిస్తుంది. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత, రెండో కంటికి రంగు వేస్తారు. ఇది లక్ష్య సాధనలో క్రమశిక్షణ, నిబద్ధత , స్వీయ-ప్రేరణ ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. దారుమా బొమ్మ ఎర్రని రంగులో, గడ్డంతో తయారు చేయబడుతుంది. దీనికి గుండ్రటి, స్థిరమైన బరువు కలిగిన ఆధారం ఉంటుంది. ఇది నిశ్చలంగా నిలబడటానికి సహాయపడుతుంది. పాపియర్-మాచే అనే సాంకేతికతను ఉపయోగించి దీన్ని ఎక్కువగా తయారు చేస్తారు. జపాన్ ప్రజలు దారుమా బొమ్మని అదృష్టం, శ్రేయస్సు , విజయానికి చిహ్నంగా భావిస్తారు. వ్యాపారాలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు తమ లక్ష్యాలను సాధించడానికి ఈ బొమ్మని కొనుగోలు చేస్తారు.

దారుమా డాల్ ఒక జపనీయ సంప్రదాయ చిహ్నంగా ఉన్నప్పటికీ, దాని మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. భారతీయ సన్యాసి బోధిధర్ముని యొక్క నిర్విరామ పట్టుదల, నిబద్ధత, ధ్యానానికి ప్రతీకగా ఈ బొమ్మ నిలిచింది. మోదీకి ఈ బొమ్మను బహుమతిగా ఇవ్వడం అనేది భారతదేశం - జపాన్ మధ్య ఉన్న చారిత్రక , సాంస్కృతిక బంధాలకు నిదర్శనం. ఇది రెండు దేశాల మధ్య ఉన్న లోతైన ఆధ్యాత్మిక , సాంస్కృతిక అనుసంధానాన్ని తెలియజేస్తుంది.