Begin typing your search above and press return to search.

"హాయ్ ఫ్రెండ్స్" పిలుపు మారింది.. వ్యూహం మారింది.. డిజిటల్ రాజకీయంలో మోదీ మాస్టర్ స్ట్రోక్!

యువత ఆగ్రహాన్ని చల్లార్చడానికి మోదీ కేవలం వీడియోలకే పరిమితం కాలేదు. ఒకవైపు సోషల్ మీడియా ద్వారా నేరుగా విద్యార్థులను రీచ్ అవుతూనే మరోవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

By:  A.N.Kumar   |   25 July 2026 10:35 AM IST
హాయ్ ఫ్రెండ్స్ పిలుపు మారింది.. వ్యూహం మారింది.. డిజిటల్ రాజకీయంలో మోదీ మాస్టర్ స్ట్రోక్!
X

సాధారణంగా భారత రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం అంటే "భాయియో ఔర్ బహెనో", "సవా కరోడ్ దేశ్‌వాసియో" లేదా "భారత్ మాతాకీ జై" అనే గంభీరమైన నినాదాలు టక్కున గుర్తొస్తాయి. కానీ కాలంతో పాటు మారడమే కాకుండా కాలాన్ని కూడా తన వైపు తిప్పుకోవడం మోదీ శైలి. తాజాగా ఆయన సోషల్ మీడియా వేదికగా తీసుకుంటున్న నిర్ణయాలు, విడుదల చేస్తున్న వీడియోలు ప్రధానిలోని ఒక సరికొత్త జనరేషన్ జెడ్ దృక్పథాన్ని ఆవిష్కరిస్తున్నాయి. దేశంలో తలనెప్పిగా మారిన వివాదాలను పరిష్కరించే క్రమంలో యువతకు నేరుగా కనెక్ట్ అయ్యేందుకు మోదీ ఎంచుకున్న సరికొత్త వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

సంక్షోభంలో ప్రతిపక్షాల రాజకీయం.. పార్లమెంట్ వద్ద సెల్ఫీ వీడియో

ఇటీవల 'నీట్' పేపర్ లీకేజీ ఉదంతం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. జంతర్ మంతర్ వేదికగా 'కాక్రోచ్ జనతా పార్టీ' ఆందోళనలతో పాటు.. విద్యార్థుల నిరసనలు మిన్నంటాయి. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రయత్నించాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ఆందోళనల్లో పాల్గొంటూ తన పగిలిన బూట్లు, చిరిగిన దుస్తులను చూపిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం ముమ్మరం చేశారు. ఇందిరా గాంధీ త్యాగాలతో పోలుస్తూ కాంగ్రెస్ వర్గాలు తీవ్ర రాజకీయ ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాయి.

ఈ రాజకీయ వేడిని, యువతలో ఉన్న ఆగ్రహాన్ని గమనించిన ప్రధాని మోదీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. యుద్ధ ప్రాతిపదికన పార్లమెంట్ భవనం నేపథ్యంగా ఒక అర్ధరాత్రి సెల్ఫీ వీడియోను వదిలి సంచలనం సృష్టించారు. "పేపర్ లీకేజీకి పాల్పడిన దోషులెవరినీ విడిచిపెట్టేది లేదు.. కఠిన చర్యలు తథ్యం!" అని నేరుగా హామీ ఇచ్చి పరిస్థితిని ఒక్కసారిగా తన అదుపులోకి తెచ్చుకున్నారు.

"మై ఫ్రెండ్స్.." మార్పుకు సంకేతం

తొలి వీడియో ఇచ్చిన ఊపుతో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ మరో సంచలన వీడియోను పోస్ట్ చేశారు. ఈ రెండింట్లోనూ అందరినీ ఆశ్చర్యపరిచింది ఆయన సంబోధన. పాత శైలికి గుడ్‌బై చెబుతూ "భాయియో బహెనో", "దేశ్‌వాసియో" అనే సంప్రదాయ పదాలను పక్కనబెట్టారు. జెన్ జెడ్ స్టైల్ ఫాలో అయ్యారు. జస్ట్ "హాయ్ మై ఫ్రెండ్స్.." అంటూ ఎంతో ఆత్మీయంగా, క్లోజ్ ఫ్రెండ్‌లా సంభాషణ ప్రారంభించారు. "థాంక్యూ ఫ్రెండ్స్.. నిన్న రాత్రి మీతో మాట్లాడే అవకాశం వచ్చింది. నా వీడియోకు మీరు ఇచ్చిన విలువైన సూచనలకు, ప్రేమానురాగాలకు ధన్యవాదాలు. మీ నమ్మకమే నా అతిపెద్ద బలం" అని వ్యాఖ్యానించారు.

కేవలం మాటల్లోనే కాకుండా తన హావభావాలు, కెమెరా ముందు సెల్ఫీ శైలిలో మాట్లాడే విధానంలో పూర్తిగా నేటి తరం యువకుడిలా రూపాంతరం చెందారు.

సంక్షోభ నివారణలో 'మోదీ మార్క్' మాస్టర్ ప్లాన్

యువత ఆగ్రహాన్ని చల్లార్చడానికి మోదీ కేవలం వీడియోలకే పరిమితం కాలేదు. ఒకవైపు సోషల్ మీడియా ద్వారా నేరుగా విద్యార్థులను రీచ్ అవుతూనే మరోవైపు వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. కేబినెట్ మంత్రులకు ఆదేశాలిచ్చారు. మంత్రులంతా ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ప్రధాన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో యాక్టివ్‌గా ఉంటూ యువతతో సత్సంబంధాలు నెరపాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మంత్రులను రంగంలోకి దింపి పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్‌తో చర్చలు జరిపించారు. ఆయన ద్వారా ప్రకటనలు చేయించి యువతలో ఉన్న అసంతృప్తిని ప్రశాంత పరిచారు. యువత భాషలోనే జవాబిచ్చారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా, వారి శైలిలోనే స్పందిస్తూ వివాదానికి తెరదించే ప్రయత్నం చేశారు.

నాయకత్వానికి కొత్త నిర్వచనం

వయసుతో సంబంధం లేకుండా మారుతున్న తరాల ఆలోచనలకు, టెక్నాలజీ ట్రెండ్లకు అనుగుణంగా మారడమే అసలైన నాయకత్వ లక్షణం అని ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నిరూపించారు. జెన్ జెడ్ మనస్తత్వాన్ని అర్ధం చేసుకుని, వారి భాషలోనే సంభాషిస్తూ, ఎదురైన సంక్షోభాన్ని తన అనుకూల అంశంగా మలుచుకోవడంలో "తనకు తానే సాటి" అని మరొకసారి చాటిచెప్పారు.