తిట్టిన కూతురుకు మోదీ జీవితమిచ్చారు.. రుచికా సింగ్ తల్లికి తెలిసొచ్చిందిలా..
సోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన యువతి రుచికా సింగ్‌ను ప్రధాని పెద్ద మనసుతో క్షమిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఆమె కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది.
By: A.N.Kumar | 2 Aug 2026 1:45 PM ISTసోషల్ మీడియాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడిన యువతి రుచికా సింగ్‌ను ప్రధాని పెద్ద మనసుతో క్షమిస్తున్నట్లు ప్రకటించడం పట్ల ఆమె కుటుంబం తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఈ నిర్ణయంపై రుచికా సింగ్ తల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రధానికి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రధాని పెద్ద మనసు.. కుటుంబానికి కొండంత ఊరట
తన కుమార్తె చేసిన తప్పును గుర్తుచేసుకుంటూ రుచికా తల్లి కంటినీరు పెట్టుకున్నారు. "నా కూతురు తెలియక పెద్ద తప్పు చేసింది. అయినప్పటికీ ఆమె భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని క్షమించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ప్రధాని మోదీకి చేతులెత్తి దండం పెడుతున్నాను. ఆయన పుట్టినరోజు సందర్భంగా మా కుటుంబానికి ఇంతకంటే పెద్ద బహుమతి మరొకటి ఉండదు" అని ఆమె అన్నారు. అంతేకాకుండా రుచికా సింగ్‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను కూడా ఉపసంహరించుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని ఆమె అభ్యర్థించారు.
శిక్షించడమే కాదు.. మారేందుకు అవకాశమివ్వాలి
యువత ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆవేశం, అవగాహన రాహిత్యం వల్లే యువత ఇలాంటి పొరపాట్లు చేస్తోందని పేర్కొన్నారు. "తప్పు చేసిన వారిని కేవలం శిక్షించడమే కాకుండా వారు తమను తాము దిద్దుకుని మారేందుకు ఒక అవకాశం ఇవ్వడం కూడా సమాజ బాధ్యత. ఈ ఘటన ద్వారా నా కుమార్తె చాలా పెద్ద పాఠమే నేర్చుకుంది" అని ఆమె వెల్లడించారు.
టీనేజర్లకు సోషల్ మీడియా నిషేధించాలి: తల్లి సంచలన విజ్ఞప్తి
ఈ సందర్భంగా సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రుచికా తల్లి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పసి వయసులోనే పిల్లలు సోషల్ మీడియా బారిన పడి దారితప్పుతున్నారని అన్నారు. 20 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా వేదికలను వినియోగించకుండా నిషేధం విధించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. కొందరు స్వార్థపరులు ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పిన్న వయస్కులైన యువతను తమ రాజకీయ లేదా స్వంత ప్రయోజనాల కోసం తప్పుదారి పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. సరైన పరిణతి లేని వయసులో పిల్లలు సోషల్ మీడియా ప్రభావానికి లోనై ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుని జీవితాలను పాడుచేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయిలో ముమ్మరమైన చర్చ
ప్రధాని మోదీ తీసుకున్న క్షమాపణ నిర్ణయంతో ఈ వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రధాని చూపిన ఔదార్యాన్ని, పెద్ద మనసును పలువురు రాజకీయ ప్రముఖులు, నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరొకవైపు, మైనర్లు టీనేజర్లు సోషల్ మీడియాను ఉపయోగించడంపై కఠిన నిబంధనలు తీసుకరావాలా వద్దా అనే అంశంపై నెట్ ఇంట్లో పెద్ద ఎత్తున వాదనలు జరుగుతున్నాయి.
రుచికా సింగ్‌పై నమోదైన కేసు ఉపసంహరణపై అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా ఈ ఘటన నేటి తరం యువత సోషల్ మీడియాను ఎంత బాధ్యతాయుతంగా, జాగ్రత్తగా ఉపయోగించాలో స్పష్టమైన సందేశాన్ని ఇస్తోంది.
