బంగారం ధరలు తగ్గడానికి అదే కారణమా? మోదీ వ్యాఖ్యల వెనుక ఆసక్తికర కోణం
బంగారం కొనుగోళ్లు తగ్గించాలంటూ ఏడాది క్రితం తాను చేసిన విజ్ఞప్తికి ప్రజలు స్పందించారని ప్రధాని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్ సభలో మాట్లాడుతూ, ప్రజలు అవసరం లేని కొనుగోళ్లు తగ్గించడంతో బంగారం ధరలు దిగివచ్చాయని పేర్కొన్నారు. అయితే ధరల తగ్గుదలలో అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావం కూడా కీలకమే.
By: A.N.Kumar | 22 Nov 2026 5:49 AM ISTభారతీయ కుటుంబాల్లో బంగారం అంటే కేవలం ఆభరణం మాత్రమే కాదు.. అది తరతరాల సెంటిమెంట్.. భవిష్యత్తుకు భరోసా... అలాంటి పసిడి ధరలు కొద్దిగా తగ్గుముఖం పట్టడంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే బంగారం ధరలు దిగిరావడానికి అసలు కారణం ఏమిటనే దానిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆర్థిక నిపుణుల్లోనూ.. సామాన్యుల్లోనూ ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఒక సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ బంగారం ధరలు తగ్గడానికి దేశ ప్రజల నిర్ణయమే ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. తాను ఏడాది క్రితం చేసిన విజ్ఞప్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.. అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలని తాను కోరానని.. అందుకు ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలు కొనుగోళ్లు తగ్గించడం వల్లే మార్కెట్లో ధరలు దిగొచ్చాయని ఆయన విశ్లేషించారు. గతంలో దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పిలుపు మేరకు ప్రజలు ఒక పూట భోజనం మానేసి ఆహార పొదుపులో భాగస్వాములయ్యారని.. ఇప్పుడు తన మాటపై గౌరవంతో ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించి డబ్బు ఆదా చేసుకుంటున్నారని ఆయన పోల్చారు.
ఏ వస్తువుకైనా డిమాండ్ తగ్గినప్పుడు ధరలపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. దేశీయంగా బంగారం కొనుగోళ్లు తగ్గితే స్థానిక మార్కెట్లో కొంత ప్రభావం ఉండవచ్చు. కానీ బంగారం ధరలు కేవలం ప్రపంచంలోనే అత్యధికంగా కొనే భారతీయ వినియోగదారుల నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టమైంది.
మార్కెట్ లెక్కలు ఎలా ఉన్నా ప్రధాని మోదీ వ్యాఖ్యల వెనుక ఉన్న సామాజిక కోణాన్ని విస్మరించలేం. పండుగలు, పెళ్లిళ్ల పేరుతో అప్పులు చేసి మరీ అవసరానికి మించి బంగారం కొనే మధ్యతరగతి కుటుంబాలు తమ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలనే సందేశం ఇందులో కనిపిస్తోంది. అనవసర ఖర్చులను తగ్గించుకుని పొదుపు వైపు అడుగులు వేయాలనే ఉద్దేశంతోనే మోడీ చేసిన వ్యాఖ్యలను దేశ ప్రజలు విన్నారు. వాటిని అమలు చేసి బంగారం కొనడాన్ని తగ్గించడంతోనే బంగారం ధరలు దిగివచ్చాయి.
బంగారం ధరల తగ్గుదల వెనుక అంతర్జాతీయ ఆర్థిక సమీకరణాల పాత్రే కీలకమైనప్పటికీ సామాన్యులలో పొదుపు అలవాట్లను ప్రోత్సహించేందుకు ప్రధాని చేసిన ప్రకటన దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గి దరలు దిగిరావడానికి కారణమైందని అర్థమవుతోంది.
