కేంద్ర మంత్రుల చివరి సమావేశం.. సెప్లెంబరు తొలి వారంలోనే విస్తరణ!
కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు.
By: Tupaki Political Desk | 26 Aug 2026 4:18 PM ISTకేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యస్థీకరిస్తారని చాలా కాలంగా జరుగుతున్న ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సంకేతాలు అందుతున్నాయని చెబుతున్నారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం, మంత్రులను తేనీటి విందుకు రమ్మనిమని గురువారం ప్రధాని మోదీ ఆహ్వానించడంతో మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ముహూర్తం సమీపించిందని పరిశీలకులు భావిస్తున్నారు. సాధారణంగా మంత్రివర్గం చివరి సమావేశాల్లోనే ఇటువంటి పరిస్థితి ఉంటుందని, ఏ నిర్ణయాలు తీసుకోకుండానే పిచ్చిపాటిగా మాట్లాడి సమావేశాన్ని ముగిస్తారని అధికారులు అంటున్నారు. బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఇటువంటి వాతావరణం కనిపించడంతో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు మళ్లీ జోరందుకున్నాయని చెబుతున్నారు.
ప్రధాని మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు గడుస్తున్నందున కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారని గత రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది. దీంతో జూన్ నుంచి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఊహగానాలు ప్రచారంలోనే ఉన్నాయి. కానీ, వివిధ కారణాలతో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తున్నారని చెబుతున్నారు. ఇక తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో సెప్టెంబరు తొలివారంలో మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని సంకేతాలు అందుతున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని విస్తరించడంతోపాటు తాజాగా మంత్రులకు ప్రధాని మోదీ నివాసంలో తేనీటి విందు ఇవ్వడంతో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు సమయం సమీపించిందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ విదేశీ పర్యటనల్లో ఉన్నారు. వీరిద్దరూ సెప్టెంబరు 2న తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని చెబుతున్నారు. ఆ సమయానికి ఇతర కేంద్ర మంత్రులు అందరూ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోందని అంటున్నారు. ఈ పరిస్థితులు, పరిణామాలు గమనిస్తే సెప్టెంబరు తొలివారంలో మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఆపరేషన్ 2029
ప్రధాని మోదీ మూడో విడత పాలనలో పలు ఒడిదిడుకులు చోటుచేసుకుంటుండటంపై బీజేపీ అధిష్టానం అప్రమత్తం అయిందని అంటున్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ గడిచిన 12 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేనంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమంలో చోటుచేసుకున్న పరిణామాలతో ప్రధాని కొంతవరకు ఆత్మరక్షణలో పడిపోయారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్నడూ లేనివిధంగా రెండు కీలక బిల్లుల విషయంలో ప్రధాని మోదీ వెనకడుగు వేయాల్సిన పరిస్థితులు బీజేపీని ఆలోచనకు గురిచేస్తున్నాయని అంటున్నారు. దీంతో 2029 ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవాలంటే ప్రస్తుతం ఉన్న టీమ్ తో అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోందని అంటున్నారు. ప్రస్తుత మంత్రుల్లో సీనియర్లు, వయోభారంతో ఇబ్బంది పడుతున్నవారిని తప్పించి యువతకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాలు వరుసగా కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ భేటీ అయ్యారని చెబుతున్నారు. ఈ వరుస సమావేశాల్లో తన అంతరంగాన్ని చెప్పి, పార్టీ కోసం త్యాగాలు చేయాలని సీనియర్లకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికి తాజా పరిణామాలు గమనిస్తే మరో పది రోజుల్లో కొత్త కేంద్ర మంత్రులు బాధ్యతలు స్వీకరించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.
