టొమాటో... కందిపప్పు...మిల్లెట్ పులావ్...బ్రిక్స్ డిన్నర్ వావ్ !
ఢిల్లీలో రెండు రోజుల పాటు భారత మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పదకొండు సభ్య దేశాల నుంచి అగ్ర నేతలు హాజరయ్యారు.
By: Satya P | 13 Sept 2026 9:44 AM ISTఢిల్లీలో రెండు రోజుల పాటు భారత మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సుకు పదకొండు సభ్య దేశాల నుంచి అగ్ర నేతలు హాజరయ్యారు. కీలక సెషన్ లో అంతర్జాతీయ సమస్యల మీద చర్చలు తరువాత రాత్రి విందు భోజనానికి అతిధులను పూర్తిగా భారతీయ పద్ధతిలో ఆహ్వానించారు. అనంతరం వారికి వండి వడ్డించిన విందు చూస్తే వావ్ అనిపించకమానదు. పూర్తిగా శాకాహారంతో కూడిన ఈ విందు భోజనం సంప్రదాయ వంటకాల్లో మేళవించి మరీ నోరూరించింది. ఇందులో ఎక్కువగా దక్షిణాది వంటకాలను ఉపయోగించారు. అలా నరేంద్ర మోడీ బ్రిక్స్ నేతల గౌరవార్థం అద్భుతమైన శాకాహార విందుని ప్రత్యేకంగా అందించారు. ప్రధాని మోడీ ఫక్తు శాఖాహారి అన్నది తెలిసిందే. ఆయన ఈసారి వివిధ దేశాధినేతలకు కూడా శాకాహారంలో ఉన్న పసందైన రుచి ఏమిటో చూపించారు.
అదిరిపోయే మెనూ :
బ్రిక్స్ దేశాధినేతల కోసం ప్రత్యేకంగా మెనూ తయారు చేయించారు. అందులో సంపూర్ణమైన శాకాహారం వంటలకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఈ గాలా డిన్నర్‌లో పాల్గొన్న దేశాధినేతలు వరిత్ వెంట వచ్చిన ఉన్నతాధికారులకు ఈ విందు భోజనం భారతీయ పాక శాస్త్రం గొప్పదనం ఏమిటో చాటి చెప్పింది. ఇక్కడ రుచి మాత్రమే కాదు పర్యావరణం పట్ల బాధ్యతగా ఉంటూ ప్రకృతి పంటను ఎలా స్వీకరించాలన్నది కూడా వివరించే ప్రయత్నం జరిగింది. దాంతో సంపూర్ణ ఆరోగ్యమే కాకుండా ప్రకృతికి కూడా మేలైన విధానంగా ఇది నిలుస్తుందని చాటి చెప్పే విధంగా భారత్ ఈ విందును ఏర్పాటు చేసింది అని అంటున్నారు.
దక్షిణాదికి పెద్ద పీట :
ఇక బహు విధాలుగా ఏర్చి కూర్చిన ఈ వంటకాలలో దక్షిణాదికే పెద్ద పీట వేశారు. దక్షిణాది సంప్రదాయాన్ని కళ్ళకు కట్టేలా వర్జిన్ కొబ్బరి నూనెతో వండిన క్యారెట్ బీన్స్ పొరియల్ తాజా కొబ్బరి తురుముతో రుచికరంగా తయారు చేసి మరీ అతిధులకు వడ్డించారు. మొక్కలు అధారిత పదార్ధాలతో తయారు చేసిన పనీర్ లబబ్దార్ ప్రత్యేక ఆకర్షణ అయితే దానిని ఉల్లి-టొమాటో గ్రేవీలో వడ్డించడం జరిగింది. అలాగే టొమాటో కందిపప్పు కరివేపాకుతో చేసిన తక్కాళి బెల్లె సారు సైతం అదిరిపోయే విధంగా ఉంది. ఇక బాస్మతి బియ్యం దానికి సిరిధాన్యాలతో కలిపి వండిన మిల్లెట్ పులావ్ అయితే బ్రిక్స్ అతిధులకు నోరూరించాయి. ఇక చల్లటి బీట్‌రూట్ రైతా పలు రకాల భారతీయ రొట్టెలను కూడా ఇందులో వడ్డించారు. ఇక చూస్తే హిమాలయాల ప్రాంతాలలో లభించే అరుదైన గుచ్చి పుట్టగొడుగులు ఆస్పరాగస్‌లను కుంకుమపువ్వు ఎండుద్రాక్ష మామ్రా బాదంపప్పులతో కలిపి వండిన గుచ్చి మర్మిక్ మొత్తం విందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అని చెబుతున్నారు. దక్షిణాది సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ, వర్జిన్ కొబ్బరి నూనెతో వండిన 'క్యారెట్ బీన్స్ పొరియల్', తాజా కొబ్బరి తురుముతో రుచికరంగా వడ్డించారు.
గుజరాత్ వంటకం సైతం :
ఇదే విందులో మరో వైపు గుజరాతీ సంప్రదాయ వంటకమైన ఖాండ్వీని ఖాండ్వీ మిల్లెఫ్యూయెల్ పేరుతో అతిధులకు రుచి చూపించారు. అలాగే శెనగపిండితో ఆవిరిపై ఉడికించిన సున్నితమైన రోల్స్‌పై ఆవాలు కొబ్బరి, కరివేపాకుతో తాలింపు పెట్టి కుంకుమపువ్వు మామిడి మైక్రో గ్రీన్స్ తేలికపాటి పెరుగు తరహా డ్రెస్సింగ్‌తో వడ్డించారు. ఖుంబ్ గలౌటీని పుట్టగొడుగుల కబాబ్‌లను పుదీనా ముత్యాలతో షీర్మల్ బ్రెడ్‌పై అందించి అతిధులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఇక మొత్తం విందు ముగింపులో చూస్తే అందించిన డెజర్ట్‌లు అదిరిపోయే లెవెల్ అని అంటున్నారు. ఓల్డ్ ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్ విత్ జిలేబీ పేరుతో తాజా పండ్లను తేలికపాటి క్రీమ్‌తో కలిపి కరకరలాడే జిలేబితో అందించారు. నెమ్మదిగా ఉడికించిన బియ్యం, పాలతో చేసిన షహతూత్ ఫిర్నీపై షహతూత్ పండ్లు బంగారు రేకుతో అలంకరించి వడ్డించడం ఈ విందుకే రాజసాన్ని తెచ్చిపెట్టింది.
