ప్రధాని టూర్‌లో బాంబుల కలకలం.. ఉదయమే వచ్చిన బెదిరింపు కాల్!
బెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పేలుడు పదార్థాలు లభ్యమవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయమే ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు.
By: Tupaki Political Desk | 10 May 2026 7:35 PM ISTబెంగళూరులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పేలుడు పదార్థాలు లభ్యమవడం తీవ్ర కలకలం సృష్టించింది. ఉదయమే ఓ వ్యక్తి బెదిరింపు కాల్ చేయడంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. ఇక ఆ వ్యక్తి బెదిరించినట్లే సాయంత్రం జిలిటెన్ స్టిక్స్ లభించడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రధాని మోదీ కాన్వాయ్ వెళ్లాల్సిన కగ్గలిపుర పరిసరాల్లోని వాడరహల్లి గేట్ సమీపంలో రోడ్డుకు 25 అడుగుల దూరంలో పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించడంతో భారీ ప్రమాదం తప్పిందని అంటున్నారు.
జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఈ ఉదంతంపై కర్ణాటక పోలీసులతోపాటు జాతీయ భద్రతా సంస్థ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. బెంగళూరు శివార్లలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ప్రధాని పర్యటించే మార్గంలో పోలీసులు అణువణువు సోదించడంతో ఓ చోట అనుమానాస్పదంగా ఉన్న జిలిటిన్ స్టిక్స్ ఉన్న ప్యాకెట్ ను ఓ కానిస్టేబుల్ గుర్తించినట్లు కన్నడ మీడియా వెల్లడించింది.
రోడ్డుకు అత్యంత సమీపంలో పేలుడు పదార్థాలు ఉండటంతో కానిస్టేబుల్ వెంటనే పోలీసు ఉన్నతాధికారులను అప్రమత్తం చేశాడు. దీంతో బాంబ్ స్కాడ్ వెనువెంటనే అక్కడికి చేరుకుని బాంబులను నిర్వీర్యం చేశాయి. ఆ తర్వత ప్రధాని పర్యటనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతోపాటు అదనపు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. కాగా, ప్రధాని సాయంత్రం బెంగళూరు వస్తున్నారనగా, ఆదివారం ఉదయం 7.30 నిమిషాల సమయంలో పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చినట్లు చెబుతున్నారు.
ప్రధాని మోదీ పర్యటనకు ముందే హెచ్ఏఎల్ ఎయిర్ పోర్టు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమం వద్ద పేలుళ్లు జరుగుతాయని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. ఈ కాల్ చేసిన వ్యక్తిని కోరమంగళకు చెందిన లోహిత్ (40)గా పోలీసులు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, ఆయన మానసిక పరిస్థితి సరిగా లేదని, గతంలోనూ ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసిన చరిత్ర ఉందని గుర్తించారని అంటున్నారు. అయితే నిందితుడు సమాచారం ఇచ్చినట్లుగానే పేలుడు పదార్థాలు లభ్యమవడం అనేక సందేహాలకు తావిస్తోందని అంటున్నారు. దీంతో పోలీసు ఉన్నతాధికారులు సమగ్ర విచారణకు ఆదేశించారు.
మరోవైపు బాంబులు గుర్తించిన ప్రధాని సభ మాత్రం యథావిధిగా కొనసాగింది. షెడ్యూల్ ప్రకారం ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. మోదీ పర్యటన సాఫీగా సాగిపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, దాదాపు 12 ఏళ్లుగా ప్రధానిగా కొనసాగుతున్న మోదీ పలు అంతర్గత, భాహ్య సంస్థల నుంచి ముప్పు ఎదుర్కొంటున్నారు. దీంతో ఆయన పర్యటనకు భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తుంటారు. అయినప్పటికీ బెంగళూరు సమీపంలో జిలిటన్ స్టిక్స్ లభించడం కలకలం రేపుతోంది. ఇవి ఆ ప్రాంతానికి ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? ప్రధాని పర్యటనలో విధ్వంసానికే వాటిని తీసుకువచ్చారా? లేక క్వారీ పేలుళ్లకు తీసుకువచ్చి మరచిపోయి వదిలేశారా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
