మోడీ ఎందుకు వస్తున్నారు.. అంటే !
ప్రధాని పర్యటనలో కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు.
By: Garuda Media | 15 Oct 2025 5:25 PM ISTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ఏపీకి వస్తున్నారు. సహజంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తరచుగా పర్యటించే ప్రధాని.. ఈ దఫా ఏపీపైనా ఎక్కువగానే దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటికి ఏడాది కాలంలో మూడు సార్లు వచ్చారు. తాజాగా కర్నూలు పర్యటనతో ఆయన ఏపీకి నాలుగోసారి వచ్చినట్టు అయింది. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారు. వీటిలో 13 వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్రం నుంచే ఏపీకి రానున్నాయి.
ప్రధాని పర్యటనలో కీలకమైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేయనున్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో సుమారు రూ.13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల ప్రాజెక్టులు ఉండగా, ఇవి రాష్ట్రాభివృద్ధికి కీలక మలుపుగా నిలుస్తాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.
పూలింగ్ స్టేషన్ ట్రాన్స్‌మిషన్ సిస్టమ్ - రూ.2,880 కోట్లు: కర్నూలు జిల్లా అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, రూ.2,880 కోట్ల వ్యయంతో కర్నూలు–3 పూలింగ్ స్టేషన్ అనుసంధాన ట్రాన్స్‌మిషన్ వ్యవస్థ. ఇది విద్యుత్ సరఫరా సామర్థ్యాన్ని పెంచుతుంది.
+ ఓర్వకల్, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి పనులకు, అలాగే పాపాఘ్ని నదిపై వంతెనకు, ఎస్. గుండ్లపల్లి–కనిగిరి బైపాస్ రహదారికి శంకుస్థాపన చేయనున్నారు. వీటి ద్వారా సుమారు రూ.21,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. లక్ష మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి.
+ సబ్బవరం - షీలానగర్ గ్రీన్ ఫీల్డ్ రహదారి: రూ.960 కోట్ల వ్యయంతో నిర్మాణం. పీలేరు - కాలూరు నాలుగు లేన్ల విస్తరణ: రూ.1,140 కోట్ల ప్రాజెక్టుకు శంకుస్థాపన. గుడివాడ - నూజెళ్ల రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా శ్రీకారం. కొత్తవలస - విజయనగరం నాలుగో లేన్ రహదారి ప్రారంభం. దుర్తి - సింహాచలం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రారంభించనున్నారు. కొత్తవలస - బొద్దవార, శిమిలిగుడ–గోరాపూర్ రైల్వే సెక్షన్లు జాతికి అంకితం చేయనున్నారు. కాగా... కర్నూలు నుంచే ఆయా ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.
