ఏపీకి వస్తేనే మోడీకి హాయి...నిజమేనా ?
ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తారు. అఫ్ కోర్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువగా పర్యటిస్తారు. అలాగే ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా అధిక పర్యటనలు ఉంటున్నాయి.
By: Satya P | 3 Aug 2026 9:36 AM ISTప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తారు. అఫ్ కోర్స్ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువగా పర్యటిస్తారు. అలాగే ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న చోట్ల కూడా అధిక పర్యటనలు ఉంటున్నాయి. అయితే ఎక్కడికి వెళ్ళినా పొగడ్తలతో పాటు విమర్శలు కూడా ఉంటాయి. అదేంటో ఏపీకి ప్రధాని వస్తే మాత్రం కేవలం పొగడ్తలు మాత్రమే ఉంటాయి. విమర్శలు అసలు వినిపించవు. దేశంలో 28 రాష్ట్రాలు 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉంటే అందులో ఏకైక రాజకీయ ప్రశాంతత ఏపీలోనే బీజేపీ పెద్దలకు లభిస్తోంది అంటే ఆశ్చర్యం మాత్రమే కాదు ఆలోచనలు కూడా రేకెత్తిస్తోంది.
పీక్స్ కి చేరుకున్న వైనం :
ఇక ఏపీలో మోడీకి పొగడ్తలు చూస్తే పీక్స్ కి చేరుకుంటున్నాయని అని అంటున్నారు మోడీజీకి జై అంటూ ఎవరో కాదు, ఏకంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తాను అంటూ జనాల చేత అనిపించే కార్యక్రమం బహుశా బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా అక్కడి ముఖ్యమంత్రులు చేయరేమో అని అంటున్నారు. అలాగే మరో మిత్ర పక్షం నేత మోడీ పాదాలకు వందనాలు అంటూ ఆయనను తిడితే తన గుండె తరుక్కుపోతోంది అని చేస్తున్న వ్యాఖ్యానాలు కూడా రాజకీయంగా వైరల్ అవుతున్నాయి. ఇక విపక్షంలో ఉన్న వైసీపీ నేతలు కూడా మోడీ ఈజ్ గ్రేట్ టీడీపీ జనసేన మాత్రమే మా ప్రత్యర్ధులు అన్న తీరున వ్యవహరిస్తున్నారు. ఏపీలో ఈ విధంగా ఘనమైన స్వాగత సత్కారాలే తప్ప ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మోడీ పర్యటన సాగిపోవడం చూసి బీజేపీ నేతలు తమకు అంతా కలసి శ్రమ తగ్గించారు అని మురిసిపోతున్నారు.
పౌరుషాల గడ్డగా :
ఏపీ అంటే పౌరుషాల గడ్డగా చరిత్ర చెబుతోంది ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం అయితే బ్రిటిష్ వారి గుండుకు తన గుండెను అడ్డు పెట్టి ఎదురు నిలిచారు. అంతే కాదు అనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రులకు జరుగుతున్న అవమానాల పట్ల ఆగ్రహించి ప్రత్యేక రాష్ట్రం కోసం తన తనువు అర్పించారు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది లేదు. ఆయన ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం ఏకంగా పార్టీ పెట్టి ఢిల్లీ పాలకులను గడగడలాడించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో నాయకులు ఉన్నారు. కేంద్రం మిథ్య అని ఎన్టీఆర్ అన్నారు. రాష్ట్రాల సమాహారమే కేంద్రం అన్నది ఆయన భావన. అలాంటి ఏపీ ఆత్మ గౌరవం కాపాడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది, ముఖ్యంగా పెద్దల మీద ఎక్కువగా ఉంటుందని మేధావులు అంటున్నారు.
ఇచ్చి పుచ్చుకోవచ్చు కానీ :
కేంద్రంతో గొడవలు పడమని ఎవరూ అనడం లేదు, ఇచ్చి పుచ్చుకోవాలి, సామరస్యంగా మెలగాలి. ప్రధానిని గౌరవించి తీరాలి. అదే సమయంలో ఎవరి హుందాతనాన్ని వారు కాపాడుకోవాలని అన్న సూచనలు విన వస్తున్నాయి. కేంద్రం ఏపీకి ఏమిచ్చింది అన్నది కూడా ఒక చర్చ అయితే ఏమిచ్చినా అది రాష్ట్రాల హక్కు మాత్రమే కానీ ఉదారత ఏముందన్నది మరో ప్రశ్న. ఏపీకి ప్రత్యేక హోదా ఈ రోజుకీ ఇవ్వలేదు అని అంటున్న వారూ ఉన్నారు. విభజన చట్టంలోని ఎన్ని హామీలు నెరవేర్చరో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది అని గుర్తు చేస్తున్నారు. తొమ్మిది పదవ షెడ్యూల్ ప్రకారం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఉమ్మడి ఏపీకి చెందిన ఆస్తులలో హైదరాబాద్ లో వదిలి వచ్చేసిన వాటి విలువ లక్ష కోట్లకు పైగా ఏపీకి వస్తుందని పుష్కర కాలం గడచినా ఈ రోజునకు అయినా తెచ్చుకోగలిగామా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఏపీలో నెలకొన్న చిత్రమైన రాజకీయం వల్ల దేశంలో విపక్షాలతో ఢీ అంటే ఢీ గా పోరు సలుపుతున్న బీజేపీ పెద్దలకు ఎంతో ఊరట కలుగుతోంది అంటే ఆలోచించాల్సిందే కదా
