Begin typing your search above and press return to search.

పిఠాపురం వర్మ...రీప్లేస్ కష్టమే సుమా !

అక్కడ టీడీపీ పార్టీగా ఉంది కానీ వర్మ అంటేనే వారికి గురి. ఆయన చెబితే దేనికైనా రెడీ. అంతలా పార్టీని మించి అభిమానం సంపాదించుకున్నారు వర్మ.

By:  Satya P   |   11 May 2026 9:45 AM IST
పిఠాపురం వర్మ...రీప్లేస్ కష్టమే సుమా !
X

పిఠాపురంలో వర్మ పాతుకు పోయారు. టీడీపీని ఆయన 2024 నుంచి నడిపిస్తున్నారు. ఆయనతోనే పార్టీ మొత్తం ఉంది. 22 ఏళ్ల సావాసం అన్న మాట. వర్మకు పిఠాపురం మొత్తం నియోజకవర్గంలో ప్రతీ కార్యకర్తతో నేరుగా పరిచయం ఉంది. సాన్నిహిత్యం ఉంది. ఎవరేమిటి అన్నది తెలిసు. అందరినీ పేరు పెట్టి పిలిచే అంత జ్ఞాపకశక్తి ఉంది. వారి కష్టాలలో బాధలలో వర్మ ఉంటూ వచ్చారు. వర్మ హైదరాబాద్ లో వ్యాపారాలు చేసేవారు. ఆ తరువాత రాజకీయాల మీద ఆసక్తిని పెంచుకుని టీడీపీలో చేరారు. అలా ఆయన తెలుగుదేశం పార్టీకి రెండున్నర దశాబ్దాలుగా ఒక సైనికునిగా గట్టిగా బంధం వేసుకున్నారు. ఇక వర్మ వెంట నడిచేది కూడా భారీ సైన్యమే.

వర్మ ఎంత చెబితే అంత :

అక్కడ టీడీపీ పార్టీగా ఉంది కానీ వర్మ అంటేనే వారికి గురి. ఆయన చెబితే దేనికైనా రెడీ. అంతలా పార్టీని మించి అభిమానం సంపాదించుకున్నారు వర్మ. ఇదే ఇపుడు టీడీపీకి వర్మ నుంచి పార్టీని వేరు చేయడం కష్టం అయిపోతోంది అని అంటున్నారు. పిఠాపురంలో టీడీపీ క్యాడర్ అంత అవర్మ వెంటే నడుస్తుంది అని అంటారు. వర్మకు అంతలా బలం ఉంది. ఆయన ఒక విధంగా పార్టీలో బాహుబలి అవతారం ఎత్తారు. 2024 ఎన్నికల వేళ వర్మకు టికెట్ ఇవ్వడం లేదని తెలియడంతో అప్పట్లో పిఠాపురం అంతటా టీడీపీ కార్యకర్తలు సృష్టించిన రభస చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. అయితే తరువాత అంతా సర్దుబాటు చేసుకుని వర్మనే జనసేన గెలుపు కోసం పనిచేయమని బాధ్యతలు అప్పగించింది టీడీపీ.

ఇండిపెండెంట్ గా పోటీ :

ఇక 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే వర్మ ఇండిపెండెంట్ గా దిగి మరీ గెలిచారు. టీడీపీ అధికార అభ్యర్ధిని కూడా ఆయన ఓడించారు. దీంతో తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో ఆయన చేరారు. కానీ వర్మ బలం అలా అధినాయకత్వానికి తెలిసింది. అయితే పార్టీ వేరు అని వర్మ నాయకత్వం వేరు అని చెప్పేందుకు టీడీపీ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. అంతే కాదు వర్మకు ఆల్టర్నేషన్ లీడర్ షిప్ తయారు చేయడంలో కూడా పార్టీ ఎప్పటికప్పుడు ఫెయిల్ అవుతూ వచ్చింది. ఇపుడు చూస్తే వర్మను ఇంచార్జి పదవి నుంచి తీసేశారు. ఎవరికి ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది అని అంటున్నారు.

పరిశీలకుని ముందే రచ్చ :

పిఠాపురంలో కమిటీని వేయాలా లేక కొత్త ఇంచార్జిని నియమించాలా అన్న దాని మీద పార్టీ తర్జన భర్జన పడుతోంది. ఇక పరిశీలకునిగా పార్టీ మాజీ మంత్రి సుజయ క్రిష్ణ రంగారావుని పంపించింది. ఆయన పిఠాపురం టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతూంటే వారంతా వర్మకు అన్యాయం చేశారు అని రచ్చ చేశారు . వర్మ పార్టీ కోసం కష్టపడితే ఆయనకు అన్యాయం చేస్తారా అని క్యాడర్ గళమెత్తారు అని తెలుస్తోంది. అయితే కార్యకర్తల అభిప్రాయం మేరకే అన్నీ జరుగుతాయని పరిశీలకునిగా మాజీ మంత్రి హామీ ఇచ్చారు. మరో వైపు తెర పైకి అనేక పేర్లు వస్తున్నాయి కానీ ఎవరిని ఇంచార్జిగా చేసినా వర్మ ప్రభావాన్ని తట్టుకుని నిలబడి పార్టీని నిలబెట్టగలరా అన్న సందేహాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి పిఠాపురం టీడీపీ చుట్టూ వర్మ తన కోటను బలంగా కట్టేశారు అని అంటున్నారు.