పిఠాపురం 'వర్మ'కు దారి లేనట్టేనా ..!
అయితే, ఇది రాజకీయంగా వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటివరకు టిడిపి ఇక్కడ బలంగా ఉంది.
By: Garuda Media | 5 Oct 2025 8:30 AM ISTజనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా పార్టీని సంస్థగతంగా డెవలప్ చేసేందుకు పవన్ కళ్యాణ్ దృష్టిపెట్టారు. ఈనెల మూడో వారంలో పిఠాపురంలో పర్యటించి, గ్రామ, మండలాల స్థాయిలో నాయకులను ఎంపిక చేయనున్నారు. ఆయా స్థాయిలలో అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తద్వారా వచ్చే స్థానిక ఎన్నికల నాటికి పిఠాపురంపై పైచేయి సాధించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
అయితే, ఇది రాజకీయంగా వివాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. ఇప్పటివరకు టిడిపి ఇక్కడ బలంగా ఉంది. గత ఎన్నికల సమయంలో టిడిపి కీలక నాయకుడు వర్మ టికెట్ త్యాగం చేసి పవన్ కళ్యాణ్ విజయం కోసం పనిచేశారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి తిరిగి ఇక్కడ నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో వర్మ అంతర్గతంగా రాజకీయాలు చేస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురంపై మరింత పట్టు సాధించే దిశగా జనసేన అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
దీంతో ఇక టీడీపీకి ఇక్కడ అవకాశం ఉండే పరిస్థితి లేదని కూడా అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయడం ఖాయమని, నియోజకవర్గ మార్పు ఉండకపోవచ్చు అన్నది జనసేన నాయకులు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే అంతర్గతంగా పార్టీని డెవలప్ చేయడం కోసం మండలాలు జిల్లాల స్థాయిలో నాయకులను నియమించే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది. దీనిని నిశితంగా గమనిస్తున్న వర్మ.. ఆయన అనుచరులు.. ఇక నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే ఆలోచనలో పడ్డారు.
వాస్తవానికి గత ఎన్నికల సమయంలోనే నియోజకవర్గాన్ని వదులుకునేందుకు వర్మ ఇష్టపడలేదు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు అప్పట్లో ఆయనకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఈ టికెట్ ను పవన్ కళ్యాణ్ కు ఇచ్చేశారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోతుండడం, వర్మకు ప్రాధాన్యం తగ్గడంతో పాటు క్షేత్రస్థాయిలో జనసేన మరింత పుంజుకునే దిశగా అడుగులు వేస్తుండడంతో వర్మ, ఆయన అనుచరులు కూడా డోలాయమానంలో పడ్డారు. ఏం చేయాలన్నది వారికి పాలు పోవడం లేదు.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా తమకు టికెట్టు ఇవ్వకపోతే వర్మ ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేసే అవకాశం ఉంటుందన్నది ఆయన వర్గం నుంచి వినిపిస్తున్న మాట. అయితే ఎన్నికలు రావడానికి ఇంకా మూడున్నర సంవత్సరాలు సమయం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు వర్మ ఆ దిశగా అడుగులు వేస్తారా? లేకపోతే వేచి చూస్తారా? అనేది చూడాలి. ప్రస్తుతం అయితే పిఠాపురం రాజకీయాలు వేడెక్కాయి. జనసేన చేస్తున్న దూకుడుతో వర్మ వర్గం ఆలోచనలో పడింది.
మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది చూడాలి. మరో వైపు టిడిపి అధినేత ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నారు. ఇటు వర్మతోను అటు పార్టీ నాయకులతోనూ చంద్రబాబు పిఠాపురం గురించి ఎక్కడా చర్చించటం లేదు. సో దీనిని బట్టి జనసేనకు పూర్తిస్థాయిలో పిఠాపురాన్ని అప్పగించారన్నది స్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలోనే వర్మకు దారులు మూసుకుపోతున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారో చూడాలి.
