Begin typing your search above and press return to search.

పవన్ కి ఎదురెళ్ళడం వైసీపీకి కష్టమేనా ?

వైసీపీకి 2019లో ఉన్నంత ఊపు జోష్ 2024 ఎన్నికల ఫలితాల తరువాత కనిపించడం లేదు. దానికి కారణం మారిన రాజకీయ పరిణామాలు.

By:  Satya P   |   20 Nov 2025 1:00 PM IST
పవన్ కి ఎదురెళ్ళడం వైసీపీకి కష్టమేనా ?
X

వైసీపీకి 2019లో ఉన్నంత ఊపు జోష్ 2024 ఎన్నికల ఫలితాల తరువాత కనిపించడం లేదు. దానికి కారణం మారిన రాజకీయ పరిణామాలు. ఏకంగా మూడు పెద్ద పార్టీలు కూటమిగా కలసికట్టుగా జట్టు కట్టి ముందుకు వస్తే వైసీపీకి భారీ పరాజయం ఎదురైంది. ఇది రాజకీయం అనుకుంటే సామాజిక వర్గ సమీకరణ దృష్ట్యా చూసుకుంటే కూడా ఏపీలోని అన్ని ప్రాంతాలలో కూటమి తగిన విధంగా సర్దుబాటు చేసుకుని పకడ్బందీగా సాగుతోంది.

పిఠాపురం సంగతేంటి :

ఇవన్నీ పక్కన పెడితే కూటమి అగ్ర నేతల కీలక నియోజకవర్గాలను టచ్ చేసేందుకు వైసీపీ నేతలు ఇష్టపడడం లేదు అని అంటున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ అయినా కుప్పంలో చంద్రబాబు అయినా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అయినా తన సొంత నియోజకవర్గాలను కంచుకోటలుగా మార్చుకున్నారు దాంతో అక్కడ వైసీపీ తేలిపోతోంది. 2024లోనే దారుణమైన రిజల్ట్ చూసిన తరువాత 2029 ఎన్నికల్లో పోటీకి ఎవరూ సుముఖంగా లేరని అంటున్నారు. ఎందుకంటే కూటమి అగ్ర నేతల నియోజకవర్గాలలో పోటీ అన్నది నామ్ కే వాస్తే అవుతోందని రిజల్ట్ ముందే తెలిసి బరిలోకి దిగడమే అవుతుందని భావిస్తున్నారుట.

ఆమె ససేమిరా :

ఇక 2024 ఎన్నికల్లో ఏకంగా కాకినాడ ఎంపీ సీటుని వదులుకుని మరీ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీకి దిగిన వంగా గీత అయితే పిఠాపురంలో భారీ ఓటమి తరువాత అంత యాక్టివ్ గా లేరని అంటున్నారు గడచిన ఏణ్ణర్ధం కాలంగా చూస్తే వైసీపీ క్యాడర్ సైతం వీక్ అవుతోందని అంటున్నారు. వైసీపీ అధినాయకత్వం ఇచ్చిన ఏ పిలుపు కూడా పిఠాపురంలో సక్సెస్ కాలేదని అంటున్నారు. దాని కంటే ముందు వంగా గీత కూడా చురుకుగా లేరాని చెబుతున్నారు.

మాజీ ఎమ్మెల్యేతోనే :

ఇక మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేనలోకి వెళ్ళిపోయారు. ఆయనతో పాటు భారీ క్యాడర్ కూడా వెళ్ళిపోయింది. ఇక మిగిలిన వారు కూడా కూటమికి ఎదురెళ్ళలేమని తేల్చి చెబుతున్నారుట. దాంతో పవన్ మీద పోరు అన్నది వైసీపీకి చాలా కష్టంగా భారంగా మారింది అని అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ పిఠాపురంలో బలపడ్డారు. ఆయన వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ నుంచే పోటీకి దిగుతారు అని అంటున్నారు. దాంతో ఆయన మీద పోటీ ఎందుకని వంగా గీత ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. తనకు వేరే నియోజకవర్గం ఇస్తే పోటీ చేస్తాను ఆమె అధినాయకత్వానికి చెబుతున్నారు అని భోగట్టా. అయితే హైకమాండ్ మాత్రం ఈ విషయంలో ఏ విధంగానూ రియాక్టు కాకపోవడంతో ఆమె పూర్తిగా సైలెంట్ మోడ్ లోకి వెళ్తున్నారని అంటున్నారు. మరి కీలక నియోజకవర్గాల్లో బలమైన నేతలు పోటీకి దూరం అని చెబితే వైసీపీకి రానున్న కాలంలో ఎలా అన్నదే చర్చగా ఉంది.