Begin typing your search above and press return to search.

జనసేనకు మంటెక్కిస్తున్న పిఠాపురం వర్మ ?

పిఠాపురం వర్మ అలియాస్ ఎస్వీఎస్ఎన్ వర్మకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది.

By:  Satya P   |   18 May 2026 9:00 AM IST
జనసేనకు మంటెక్కిస్తున్న పిఠాపురం వర్మ ?
X

పిఠాపురం వర్మ అలియాస్ ఎస్వీఎస్ఎన్ వర్మకు 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కకుండా పోయింది. జనసేనతో పొత్తు కారణంగా పవన్ కళ్యాణ్ పిఠాపురాన్ని ఎంచుకోవడంతో వర్మకు షాక్ భారీగానే తగిలింది. అయితే ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నాడు హామీ ఇచ్చారని వర్మ వర్గం చెప్పుకుంటూ వచ్చింది. ఆ ముచ్చట కూడా లేకపోగా లేటెస్ట్ గా చూస్తే వర్మకు పిఠాపురం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి పదవిని కూడా తీసేశారు. దాంతో మీడియా ముందు కళ్ళ నీళ్ళ పర్యంతం అయిన వర్మ ఆ తరువాత కాకినాడకు షిఫ్ట్ అయిపోయారు. సరే ఇక్కడిదాకా బాగానే ఉంది అనుకున్నా వర్మ కాకినాడ నుంచే తనదైన స్టైల్ లో రాజకీయం స్టార్ట్ చేశారు అని అంటున్నారు.

వర్మ చెంతకు పార్టీ నేతలు :

ఇక కాకినాడలో వర్మ ఉంటున్న నివాసం దగ్గరకే పిఠాపురం టీడీపీ నేతలు అంతా క్యూ కట్టడం ఇపుడు కొత్త రాజకీయంగా చూస్తున్నారు. వారంతా తండోపతండాలుగా వెళ్ళి మరీ వర్మకు బాసటగా ఉంటామని చెబుతున్నారు. అంతే కాదు వర్మకు తాము అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన తమ నాయకుడు అని చెబుతున్నారు. వర్మకు పార్టీ పరంగా ఈ విధంగా మద్దతు పెరుగుతోందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ఇలా పిఠాపురం నియోజకవర్గంలోని 54 గ్రామాల నుంచి నాయకులు తరలి వెళ్తున్నారు. అలాగే వివిధ మండలాలకు చెందిన నాయకులు కూడా వర్మ నివాసం వద్ద కనిపిస్తున్నారు. పార్టీలో ఆయనకు జరిగిన అన్యాయం మీద వారు ఓదార్పు మాటలు చెబుతున్నారని మంచి రోజులు ముందు ఉన్నాయని అంటున్నారని చెబుతున్నారు.

అక్కడ నుంచే ఫోకస్ :

ఇక వర్మ వద్దకు వెళ్ళిన నాయకులు అంతా పిఠాపురంలో జరుగుతున్న పరిణామాల గురించి చెబుతున్నారు. అక్కడ ఏమి జరిగినా పూస గుచ్చినట్లుగా వివరిస్తున్నారు. అంతే కాదు అక్కడ నుంచే నియోజకవర్గంలో రాజకీయాన్ని సమీక్షిస్తున్నారు. వర్మ కూడా వారికి సలహా సూచనలు ఇస్తున్నారు అని ప్రచారం సాగుతోంది. సరిగ్గా ఇక్కడే జనసేన వర్గాలకు మండుకొస్తోందిట. వర్మకు ఇంచార్జి పదవి తీసేసిన తరువాత పిఠాపురం నియోజకవర్గం రాజకీయాలతో పనేంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. మిత్ర బంధాన్ని కూటమి ధర్మాన్ని విస్మరించి మరీ వర్మ ఈ విధంగా సమాంతరంగా రాజకీయాలు చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదని జనసేన వర్గాలు అసహనం ప్రదర్శిస్తున్నాయని అంటున్నారు.

అంతా అభిమానం :

అయితే తన వద్దకు వచ్చే క్యాడర్ ని నాయకులను తాను వద్దు అని ఎలా అంటాను అని వర్మ ప్రశ్నిస్తున్నారు. వారంతా ఎంతో అభిమానంతో తన వద్దకు వస్తూంటే తలుపులు మూయలేము కదా అని ఆయన అంటున్నారు. తన పార్టీ నేతలు తన వద్దకు వస్తే తప్పేంటి అని కూడా అంటున్నట్టుగా చెబుతున్నారు మొత్తానికి వర్మకు పోయింది ఇంచార్జి పదవి మాత్రమే అని మొత్తం నియోజకవర్గం టీడీపీ క్యాడర్ అంతా ఆయన వెంటనే ఉందని అంటున్నారు. దానికి ఉదాహరణే కాకినాడ దాకా వెళ్ళి మరీ పార్టీ నేతలు కలిసి రావడం అని అంటున్నారు. దాంతో వర్మ మళ్ళీ పిఠాపురం రాజకీయాల్లో వేలూ కాలూ పెట్టడం మీద జనసేన వర్గాలు అయితే ఆగ్రహిస్తున్నాయట. మరి వర్మ ఇంటికి టీడీపీ నేతలు వెళ్ళి కలసి రావడం ఈ ఓదార్పు మాటలు మంతనాల మీద టీడీపీ హైకమాండ్ ఏమైనా కొత్త డైరెక్షన్ ఇస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. జనసేన వర్గాలు అయితే వర్మ మీద మాత్రం మండిపడుతున్నాయని అంటున్నారు.