పిఠాపురం.. వైసీపీ ఆశలు వదిలేసుకున్నట్టేనా ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇక, ఎప్పటికీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉండదా? అంటే.. ఔననే చర్చే జరుగుతోంది.
By: Garuda Media | 29 Nov 2025 10:00 PM ISTఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనా? ఇక, ఎప్పటికీ ఇక్కడ గెలిచే ఛాన్స్ ఉండదా? అంటే.. ఔననే చర్చే జరుగుతోంది. పొలిటికల్ కంటే కూడా.. స్థానిక ప్రజలను ఆత్మీయంగా చేరదీస్తున్న పవన్ వ్యూహం ముందు వైసీపీ తేలిపోతోందని చెబుతున్నారు. కష్టం సుఖమే కాదు.. ఆనందంలోనూ పవన్ కల్యాణ్ ఇక్కడి ప్రజలకు చేరువ అవుతున్నారు.
ఏ శుభకార్యం జరిగినా.. నేనున్నానంటూ ఆయన ముందుకు వస్తున్నారు. ఇక్కడి మహిళలకు చీరలు పెడుతున్నారు. వ్రతాలు, నోములు వంటివి సామూహికంగా చేయిస్తున్నారు. ఇలా.. కుటుంబ సభ్యుడిగా పవన్ మారిపోయారు. ఇక, యువత పరంగా చూస్తే.. సినీగ్లామర్‌ను వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. రైతులు, ఇతర సాధారణ ప్రజల విషయానికి వచ్చినా.. పవన్‌కు మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో పవన్‌కు తిరుగులేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
ఒక్కమాటలో చెప్పాలంటే.. పిఠాపురం - పవన్ అడ్డాగా మారిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. పైగా ఇక్కడే ఆయన ఇల్లు కట్టుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి దీనిని విడిదిగా మార్చుకుని ప్రతి నెలా కనీసం రెండు నుంచి మూడు రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. దీంతో స్థానికులతో మరింత బంధం పెంచు కునే దిశగా పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నట్టు అయింది. మరి పిఠాపురంలో ఇంత జరుగుతుంటే.. ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ఏం చేస్తోంది? అనేది ప్రశ్న.
ఇప్పుడు వైసీపీ తరఫున పిఠాపురంలో గళం వినిపించే నాయకులు కరువయ్యారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వంగా గీత కాకినాడకు పరిమితమయ్యారు. అప్పట్లో అడపా దడపా వచ్చేవారు. ఇటీవల కాలంలో అసలు రావడమే మానేశారు. ఇక, పెండెం దొరబాబు పార్టీ మారి.. జనసేన కండువా కప్పుకొన్నారు. కేడర్ పరంగా కూడా వైసీపీ బలహీనంగా ఉంది. కాపులు మొత్తంగా ఆ పార్టీకి ఈ నియోజకవర్గంలో వైసీపీని దూరం పెట్టారు. సో.. ఎలా చూసుకున్నా.. పిఠాపురంపై వైసీపీ ఆశలు వదులుకోవాల్సిందేనని అంటున్నారు పరిశీలకులు.
