Begin typing your search above and press return to search.

పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్లు గెలవడం కొత్త కాదు, వింత కూడా కాదు, బలమైన నాయకులు ఉంటే పార్టీ సింబల్ దాటి మరీ జనాదరణ పొందుతారు.

By:  Satya P   |   3 Nov 2026 11:53 PM IST
పవన్ పిఠాపురంలో రెబెల్స్ కొత్త రికార్డు !
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇండిపెండెంట్లు గెలవడం కొత్త కాదు, వింత కూడా కాదు, బలమైన నాయకులు ఉంటే పార్టీ సింబల్ దాటి మరీ జనాదరణ పొందుతారు. అయితే ఈసారి జరిగింది అది కాదు కూటమి పార్టీలలో పొత్తుల కారణంగా తమకు సీట్లు దక్కలేదని భావించిన రెబెల్స్ పార్టీని ధిక్కరించి మరీ పోటీ చేశారు. అయితే వారికి జనాలు నీరాజనాలు పలికారు. అలా ఒకరిద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది కూటమి వైపు నుంచి రెబెల్స్ గా గెలిచారు. మరో ఇద్దరు వైసీపీ నుంచి రెబెల్స్ గా గెలిచారు. దాంతో పవన్ ఎమ్మెల్యేగా ఉన్న పిఠాపురం మునిసిపాలిటీలో ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తూ రెబెల్స్ మోగించిన బెల్స్ బిగ్ సౌండ్ చేస్తున్నాయి అంటున్నారు.

డిప్యూటీ సీఎం ఇలాకాలో :

ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ సొంత ఇలాకా అయిన పిఠాపురంలో ఓటర్లు ఈ విధంగా ప్రధాన పార్టీలను కాదని రెబెల్స్ కి పెద్ద పీట వేయడం విలక్షణ తీర్పుగా భావిస్తున్నారు. ఇక్కడ చిత్రమేంటి అంటే జనసేన తరఫున కూటమి అభ్యర్ధిగా మున్సిపల్ ఛైర్మన్‌ సీటుకి పోటీ చేసిన దానం లాజర్ బాబు 8 వేల 944 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అయితే మొత్తం 36 వార్డులున్న పిఠాపురం మున్సిపాలిటీలో ఎన్నికలకు ముందే మూడు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 33 చోట్ల చూస్తే అందులో పదింటిని రెబెల్స్ గెలుచుకున్నారు. మిగిలిన వాటిలో జనసేన 16 వార్డులు, టీడీపీ 5, బీజేపీ 1 వార్డును గెలుచుకుని మున్సిపల్ పీఠాన్ని పదిలపరుచుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ఇక్కడ దక్కింది కేవలం ఒక్క వార్డు మాత్రమే.

రెబెల్స్ గట్టిగానే :

అయితే ఆ పది మంది రెబెల్స్ గట్టిగానే నిలబడి జనం మన్ననలు పొందారు అంటున్నారు. అటు కూటమిలోని మూడు పార్టీలను ఇటు వైసీపీని కూడా కాదని వారు గెలిచారు అంటే గ్రేట్ అంటున్నారు. పిఠాపురం మునిసిపాలిటీలో 17, 21, 31, 34 వార్డులలో జనసేన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచి తిరుగులేని విజయం సాధించారు. 8, 9, 33, 36 వార్డులలో టీడీపీ టికెట్ దక్కని నాయకులు స్వతంత్రులుగా పోటీ చేసి సత్తా చాటారు. 1, 18 వార్డులలో వైసీపీ రెబల్ అభ్యర్థులు గెలుపొంది కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. దీంతో రెబెల్స్ ఇపుడు జనసేన తరువాత పది సీట్లతో రెండో స్థానంలో ఉన్నారు.

ఎక్కడా లేని విధంగానే :

మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తీసుకుంటే ఎక్కడా ఈ విధంగా జరగలేదని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇంత పెద్ద ఎత్తున రెబెల్స్ గెలవడం ఏ ఇతర మున్సిపాలిటీలో జరగలేదని, కేవలం పిఠాపురంలోనే ఇంత పెద్ద సంఖ్యలో స్వతంత్రులు నెగ్గడం అంటే ఇది అతి పెద్ద రాజకీయ సంచలనంగా మారింది. అంతే కాదు సరికొత్త రాజకీయ చర్చలకు కూడా దారితీసింది. ఛైర్మన్‌గా పవన్ కల్యాణ్ బలపరిచిన దానం లాజర్ బాబుకు భారీ ఆధిక్యం కట్టబెట్టిన ప్రజలు వార్డుల విషయానికి వచ్చేసరికి మాత్రం తమకు నచ్చిన అభ్యర్ధికి జై కొట్టేశారు. దాంతోనే రెబెల్స్ పెద్ద ఎత్తున గెలిచారు అని అంటున్నారు. మరి గెలిచిన ఈ రెబెల్స్ సొంతంగానే ఉంటారా లేదా తమ సొంత పార్టీలలోకి వెళ్ళిపోతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా పిఠాపురం ఫలితం ఇపుడు చర్చకు ఆస్కారం ఇస్తోంది.